Begin typing your search above and press return to search.

652 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతూంటే అంతకు అంత సెక్యూరిటీ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకప్పటి కంటే ఇపుడు డబ్బులు తీసుకోవడం సులువు.

By:  Satya P   |   9 May 2026 6:00 AM IST
652 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు
X

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతూంటే అంతకు అంత సెక్యూరిటీ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకప్పటి కంటే ఇపుడు డబ్బులు తీసుకోవడం సులువు. అంతే కాదు బ్యాంకులతో పని లేకుండా కరెన్సీ నోటు ముఖం చూడకుండా ట్రాన్సాక్షన్స్ సాగిపోతున్నాయి. ఇవి సజావుగా ఉన్నపుడు బాగానే ఉన్న సైబర్ నేరగాళ్ల చేతి వాటానికి గురి అయితే పోయేవి వందలూ వేలూ కాదు లక్షల్లోనే. దాంతో లబో దిబోమనడం బాధితుల వంతు అవుతోంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఓకేగా ఉన్నా సైబర్ నేరగాళ్ళు మాత్రం రెచ్చిపోతున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు కొత్త వ్యూహాలను అనుసరించాల్సి వస్తోంది.

పెద్ద మొత్తాలనే కొట్టేసి :

అమరావతిలో రెండు రోజుల పాటు సాగిన కలెక్టర్లు ఎస్పీల సదస్సులో చివరన శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ మీద జరిగిన సుదీర్ఘమైన సమీక్షలో చాలా విషయాలు వెలుగు చూశాయి. అందులో సైబర్ నేరాలు ఒకటి ఏకంగా ఏపీలో సైబర్ నేరాల్లో మొత్తం 652 కోట్లను బాధితులు కోల్పోయారని డీజీపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. అయితే ఇందులో 116 కోట్లు ఫ్రీజ్ చేయగలిగామని డీజీపీ చెప్పారు. దానికి ముఖ్యమంత్రి కూడా కచ్చితమైన సూచనలు చేశారు. ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత యాక్టివ్ గా పని చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలను కట్టడి చేసేలా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు విభాగానికి దిశా నిర్దేశం చేశారు.

క్రైమ్ రేట్ తగ్గింది :

ఇక గతేడాది తో పోల్చుకుంటే క్రైమ్ రేట్ తగ్గిందని సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. మహిళలపై నేరాలు 7 శాతం, చోరీలు 8 శాతం, ఆర్థిక నేరాలు 0.3 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 30 శాతం తగ్గాయని డీజీపీ వెల్లడించారు. కన్విక్షన్ రేట్ 2025 లో 44 శాతంగా ఉంటే 2026 లో 49.8 శాతానికి పెరిగిందని డీజీపీ చెప్పారు. దీన్ని 70 శాతానికి తీసుకువెళ్లాలనే లక్ష్యాన్ని చంద్రబాబు నిర్దేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మరింతగా ఫోకస్ తో పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.

విజిబుల్ పోలీసింగ్ :

ఇక ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో టెక్నాలజీ వాడాలని బాబు కోరారు. ఇన్ విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ అనేది చేసి చూపించాలని బాబు చెప్పారు. పోలీసుల చర్యలు చూసి నేరం చేయాలంటే భయపడే పరిస్థితి రావాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించి ఆధారాలు సేకరించటం దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడడం వంటివి చేయాలని అన్నారు. అంతే కాదు సైబర్ నేరాలను నియంత్రించేలా సైబర్ ఫోర్సుతో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ వద్ద ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేసి ఫలితాలు చూపించాలని అన్నారు. చోరీ కేసుల్లో ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే నిందితుడ్ని పట్టుకునేలా చర్యలు ఉండాలని కూడా బాబు దిశా నిర్దేశం చేశారు.