వీళ్లు సంరక్షకులు కాదు.. రాక్షసులు... ఆ ఇంట్లో భయంకరమైన సంఘటన!
ఈ క్రమంలో ఆ దంపతులకు ఏమి బుద్ది పుట్టిందో తెలియదు కానీ... ఆ ఇంటిని మొత్తం తన ఆధీనంలోకి తీసుకున్నారని అంటున్నారు.
By: Raja Ch | 30 Dec 2025 12:00 PM ISTతన భార్య మరణించడంతో మానసిక వికలాంగురాలైన కుమార్తెను తీసుకుని మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఓం ప్రకాశ్ సింగ్ రాథోడ్. ఈ క్రమంలో తమ సంరక్షణ కోసం రాంప్రకాష్, అతని భార్య రాందేవి లను నియమించుకున్నారు. కట్ చేస్తే... వారి చేతుల్లో ఓం ప్రకాశ్ సింగ్, అతని కుమార్తె బంధీలుగా మారారు.. దాదాపు ఐదేళ్ల తర్వాత వారిని చూసినవారు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ సంఘటన భయంకరంగా ఉందని అంటున్నారు.
అవును... ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో 2016లో తన భార్య మరణించడంతో 70ఏళ్ల రిటైర్డ్ రైల్వే సీనియర్ క్లర్క్ ఓంప్రకాశ్ సింగ్ రాథోడ్, మానసిక వికలాంగురాలైన 27 ఏళ్ల అతని కుమార్తె రష్మి వేరే ఇంటికి మారారు. ఈ సమయంలో తమ సంరక్షణ కోసం రాంప్రకాష్ కుష్వాహా, అతని భార్య రాందేవిని నియమించుకున్నారు. వీరిద్దరూ తొలుత తండ్రీ, కుమార్తెకు సమయానికి వండి పెట్టడం.. మానసిక వికలాంగురాలైన రష్మీ మంచి చెడ్డలు చూడటం అన్నీ చూసుకునేవారు.
ఈ క్రమంలో ఆ దంపతులకు ఏమి బుద్ది పుట్టిందో తెలియదు కానీ... ఆ ఇంటిని మొత్తం తన ఆధీనంలోకి తీసుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో పైఅంతస్తులో హాయిగా ఉండే తండ్రీ, కుమార్తెను కింది గదులకు పరిమితం చేశారట. ఇదే సమయంలో వారి ప్రాథమిక అవసరాలు తీర్చకుండా ఈ జంట ఆ తండ్రీకూతుళ్లను అడ్డుకుందని అంటున్నారు. ఏదో ఒక పూట అప్పుడప్పుడూ నాలుగు మెతుకులు వేస్తూ వేధించారని ఆరోపిస్తున్నారు. దీంతో ఓంప్రకాష్, రష్మీల పరిస్థితి దయణీయంగా మారిపోయింది!
ఈ క్రమంలో వారిద్దరినీ చూడటానికి బంధువులు ఎవరైనా వస్తే... తాము ఎవరితోనూ మాట్లాడమని ఓంప్రకాష్ చెబుతున్నారని.. వీరిద్దరూ చెప్పి పంపించేసేవారంట. ఈ మాట ఆ నోటా ఈ నోటా పడి వారిని చూడటానికి బంధువులు రావడం మానేశారని చెబుతున్నారు. ఇలా ఉండగా... ఇటీవల ఓంప్రకాష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యలోనే మరణించారని బంధువులందరికీ వీరి సేవకుల నుంచి కబురు అందింది!
దీంతో... సోమవారం ఓంప్రకాష్ బంధువులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో వారికి ఓ భయానక దృశ్యం కనిపించింది. ఇందులో భాగంగా.. ఓంప్రకాష్ మృతదేహం పూర్తిగా కృశించిపోయి ఉండగా.. ఇక చీకటి గదిలో ఆయన కుమార్తె నగ్నంగా పడి ఉంది. సరైన ఆహారం లేక రష్మీ శరీరం 80 ఏళ్ల వృద్ధురాలిగా ఉందని అంటున్నారు. ఆమె శరీరంపై మాంసం లేదని.. అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉందని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఓంప్రకాష్ మృతదేహాన్ని చూసిన బంధువులు... ఒకప్పుడు ఎంతో గౌరవప్రదమైన జీవీతాన్ని గడిపి.. ఎప్పుడూ సూటు, టై ధరించి కనిపించిన ఈ రైల్వే ఉద్యోగి.. ఇలా విషాదరకమైన పరిస్థితుల్లో మరణిస్తారని తాము అనుకోలేదని రోధిస్తున్నారు. ఈ సమయంలో.. రష్మీని జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. మరోవైపు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివరాలను ఓంప్రకాష్ సోదరుడు అమర్ సింగ్ తెలిపారు!
