Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా వ్యసనం మోపిన ముప్పు.. రీల్స్ చూస్తోందని భార్యను దారుణంగా హతమార్చిన భర్త

ఇటీవల మళ్లీ ఇదే విషయమై దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన ధీరజ్ క్షణికావేశంలో రీమా గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

By:  A.N.Kumar   |   8 Aug 2026 11:16 AM IST
సోషల్ మీడియా వ్యసనం మోపిన ముప్పు.. రీల్స్ చూస్తోందని భార్యను దారుణంగా హతమార్చిన భర్త
X

సాంకేతికత పెరిగిన కొద్దీ వినోదం కోసం ఉపయోగించే సోషల్ మీడియా కుటుంబ జీవితాల్లో నిప్పులు పోస్తోంది. రీల్స్ పిచ్చి, స్మార్ట్‌ఫోన్ వ్యసనం ఓ పచ్చని సంసారంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం రీల్స్ చూస్తోందన్న నెపంతో భార్యపై ఆగ్రహం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేసిన సంచలన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే ఆ ఉన్మాది అంతమొందించడమే కాకుండా మృతదేహాన్ని బెడ్‌లో దాచిపెట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ కుమార్ (24), రీమా కుమారి (20) కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వలస వచ్చారు. అంతకుముందే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులోని ఓ ఇంట్లో నివాసముంటూ ధీరజ్ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. రీమా కూడా ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరింది.

అయితే గత కొంతకాలంగా రీమా ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా రీల్స్‌కు తీవ్రంగా అలవాటుపడింది. ఖాళీ సమయం దొరికితే చాలు ఫోన్‌లోనే మునిగిపోతూ ఇంటి పనులు, వంట చేయడాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ధీరజ్ ఆమెపై తీవ్ర అసహనం వ్యక్తం చేసేవాడు. ఈ విషయమై దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఫోన్ పక్కన పెట్టి సంసారంపై దృష్టి పెట్టాలని భర్త ఎంత చెప్పినా రీమా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో వారి మధ్య విభేదాలు మరింత ముదిరాయి.

క్షణికావేశం.. బెడ్‌లో దాచిన మృతదేహం

ఇటీవల మళ్లీ ఇదే విషయమై దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన ధీరజ్ క్షణికావేశంలో రీమా గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని బెడ్ లోపల దాచిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ప్రవర్తిస్తూ నాటకమాడాడు.

రీమా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం.. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు ఇంటికి వచ్చి చూశారు. గదిలో వెతకగా బెడ్‌లో దాచి ఉంచిన రీమా మృతదేహం లభ్యమైంది. దీంతో దిగ్భ్రాంతికి గురైన స్నేహితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడు ధీరజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల పూర్తి కారణాలు, దంపతుల మధ్య ఉన్న ఇతర గొడవలపై పోలీసులు విచారిస్తున్నారు.

విషాదంలో కుటుంబ సభ్యులు

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య చిన్న విషయానికే మొదలైన గొడవ, చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియా వాడకం మనుషుల మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ క్షణికావేశంలో దారుణమైన నేరాలకు ఎలా దారితీస్తోందో అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని పోలీసులు, మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.