డాక్టర్ భార్యను చంపిన డాక్టర్ భర్త... ఇక్కడ నమ్మకం ప్రాణాంతకం!
అవును... నమ్మకం ప్రాణాంతకంగా మారిన ఓ దారుణ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది.
By: Raja Ch | 17 Oct 2025 10:42 AM ISTమొదట్లో సహజ మరణంగా భావించిన బెంగళూరు డాక్టర్ మరణం.. తాజాగా ఆమె భర్త చేతిలో జరిగిన హత్యగా తేలింది. తన భర్తే ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడని పోలీసులు గుర్తించారు! దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మత్తుమందు పదార్థాల వల్ల శ్వాసకోశ వైఫల్యం కారణంగా ఆమె మరణించారని ఫోరెన్సిక్ నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు.
అవును... నమ్మకం ప్రాణాంతకంగా మారిన ఓ దారుణ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి చెందిన 32 ఏళ్ల జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి తన భార్య డాక్టర్ కృతిక రెడ్డికి ప్రాణాంతకమైన అనస్థీషియా ఇచ్చి, దానిని సహజ మరణంగా చిత్రీకరించి హత్య చేశాడని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ హత్య సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 2024 మే 26న మహేందర్ రెడ్డికి, డాక్టర్ కృతిక రెడ్డికి వివాహం జరిగింది. ఈ క్రమంలో తన భార్య చాలా కాలంగా గ్యాస్ట్రిక్, జీవక్రియ రుగ్మతలతో బాధపడుతుందని తెలుసుకున్న తర్వాత మహేంద్ర కలత చెందాడని పోలీసులు తెలిపారు! పైగా... వివాహానికి ముందు ఆమె కుటుంబం ఈ విషయం తన వద్ద దాచిపెట్టిందని భావించాడని అంటున్నారు!
దీంతో ఆమెను హత్య చేయాలని.. అది హత్యగా కనిపించకుండా, సహజ మరణంలా ఉండేలా తన వైద్య వృత్తిని ఉపయోగించి చేయాలని పథకం రచించాడు! ఈ క్రమంలో... కృతిక మారతహళ్లిలోని తన తండ్రి ఇంట్లో ఉండగా.. అనారోగ్యం, అలసట కారణంగా ఆమె స్పృహ కోల్పోయిందని తెలుస్తోంది. ఆ సమయంలో ఆమెకు ట్రీట్ మెంట్ చేసే నెపంతో ఆమెను సందర్శించాడు మహేంద్ర!
ఈ సమయంలో రెండు రోజుల పాటు ఆమెకు మత్తుమందు కలిగిన ఇంట్రవీనస్ (4) ఇంజెక్షన్లు ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో... ఏప్రిల్ 23, 2025న ఆమె మళ్లీ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే... అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు!
సోదరి అనుమానం బిగ్ టర్న్!:
మొదట డాక్టర్ కృతిక సహజంగానే చనిపోయిందని ఆమె కుటుంబం అంగీకరించింది. అయితే.. ఆమె సోదరి డాక్టర్ నికితా రెడ్డి, తన సోదరి మరణానికి కారణాన్ని తెలుసుకోవాలని పట్టుబట్టడంతో పోలీసులు ఆసుపత్రి మెమో ఆధారంగా అసహజ మరణ నివేదిక దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆరు నెలల తర్వాత అసలు విషయం బయటపడిందని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఆమె శరీరంలో అనస్థీషియా జాడలను గుర్తించింది. మత్తుమందు అధిక మోతాదు వల్ల శ్వాసకోశ వైఫల్యం ఆమె మరణానికి దారితీసిందని పరిశోధకులు నిర్ధారించారు. దీనితో పోలీసులు ఈ కేసును హత్యగా మార్చి.. మహేంద్రను అరెస్టు చేశారు. అతడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 కింద కేసు నమోదు చేయబడింది.
