ప్రేమ గురించి మాట్లాడదామని పిలిచి..క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశారా?
అమానుష ఘటన హైదరాబాద్ మహానగర శివారు అమీన్ పూర్ లో చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని హత్య చేసిన వైనం సంచలనంగా మాత్రమే కాదు.. అందుకు దారి తీసిన పరిస్థితులు షాకింగ్ గా మారాయి.
By: Garuda Media | 11 Dec 2025 9:44 AM ISTఅమానుష ఘటన హైదరాబాద్ మహానగర శివారు అమీన్ పూర్ లో చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని హత్య చేసిన వైనం సంచలనంగా మాత్రమే కాదు.. అందుకు దారి తీసిన పరిస్థితులు షాకింగ్ గా మారాయి. లవ్ మ్యాటర్ మాట్లాడేందుకు ఇంటికి పిలిచిన యువతి తరపు వారు.. అనంతరం దారుణంగా కొట్టటం.. ఈ క్రమంలో అతడి ప్రాణాలు పోయిన వైనం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువతిని బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి ప్రేమిస్తున్నాడు. అతను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఏపీలోని క్రిష్ణాజిల్లాలోని పెనగ్రంచిపోలుకు చెందిన ఇతనికి తల్లిదండ్రులు లేరు. అమీన్ పూర్ లో ఉన్న పెదనాన్న దగ్గర ఉంటున్నాడు. కుత్భుల్లాపూర్ లో రూం తీసుకొని రోజూ కాలేజీకి వెళ్లి వస్తుంటాడు. బీరంగూడకు చెందిన 19 ఏళ్ల అమ్మాయితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. దీంతో వీరీ స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.ఈ విషయంతెలిసిన అమ్మాయి తరఫు వారు సాయిని హెచ్చరించారు.
అయినా వినిపించుకోకపోవటంతో ఆగ్రహించిన యువతి తరఫు వారు.. పెళ్లి చేస్తామని.. అందుకు మాట్లాడుకుందామని ఇంటికి పిలిచారు. దీంతో ఆ యువకుడు అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి అడుగు పెట్టినంతనే అమ్మాయి తల్లిదండ్రులతో పాటు.. వారి బంధువులు అతడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సాయి ఇంట్లోకి వెళ్లగానే తలుపులు మూసేసినట్లు చెబుతున్నారు. లవ్ మ్యాటర్ గురించి మాట్లాడుతూ క్రికెట్ బ్యాట్ తో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అతను తీవ్ర గాయాల బారిన పడ్డాడు.
తాను అమ్మాయిని ఇటీవల కాలంలో కలవలేదని.. దాదాపు ఏడాది నుంచి కలవలేదని చెప్పటం.. ఈక్రమంలో విద్యార్థి మాటలకు ఆగ్రహానికి గురైన యువతి తరఫు వారు క్రికెట్ బ్యాట్ తో అతడిపై దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడ్ని.. నిజాంపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే. అప్పటికే ఆ యువకుడు చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. పథకం ప్రకారమే ఇంటికి పిలిచి హత్య చేశారని సాయి పెద్దనాన్న ఆరోపిస్తున్నాడు. గతంలోనే చంపేస్తామని బెదిరించినట్లుగా పేర్కొన్నారు.
నిజానికి ఆ అమ్మాయే సాయి కాలేజీ వద్దకు వెళ్లేదని.. తమ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడాలని కోరేదని.. సాయి శ్రవణ్ ను బతిమిలాడేదన్నారు. మాట్లాడేందుకు ఇంటికి పిలిచి చంపేశారంటూ పెద్దనాన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్నపోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇంటికి పిలిచి.. దాడి చేసి చంపేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
