కూకట్ పల్లి లో పదేళ్ల బాలిక దారుణహత్య... ఇంట్లోనే ఏమి జరిగింది..!
అవును... కూకట్ పల్లి సంగీత్ నగర్ లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు.
By: Raja Ch | 18 Aug 2025 6:55 PM ISTహైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి సంగీత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... పదేళ్ల బాలిక ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. తల్లితండ్రులు ఇంట్లోలేని సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఈ హత్యకు గల వివరాలు పోలీసులు వెళ్లడించారు.
అవును... కూకట్ పల్లి సంగీత్ నగర్ లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. వారిలో తండ్రి బైక్ మెకానిక్, తల్లి ల్యాబ్ టెక్నీషియన్ కాగా... కుమార్తె కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. ఈ సమయంలో.. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని స్కూల్ కు పంపి విధులకు వెళ్లారు.
మరోవైపు ఆరోతరగతి చదువుతున్న కుమార్తెకు స్కూల్ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కుమారుడి లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి రాగా... బెడ్ రూమ్ లో పొట్టలో కత్తి పోట్లతో బాలిక విగత జీవిగా పడి ఉంది. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు తండ్రి.
ఈ సమయంలో తన కుమార్తెను ఎవరో హతమార్చినట్లు అనుమానించిన తండ్రి వెంటనే కూకట్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న వెంటనే కూకట్ పల్లి పోలీసులతో పాటు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
