Begin typing your search above and press return to search.

వామ్మో ఇదేం తాగుడు? రోజులో రూ.303 కోట్ల లిక్కర్ సేల్

తెలంగాణలో మద్యం అమ్మకాలకు సంబంధించి సరికొత్త రికార్డు నమోదైంది. ఒక్కరోజులో రూ.303 కోట్ల మద్యం అమ్మకాలు సాగి.. పాత రికార్డులు బద్దలై.. సరికొత్త రికార్డు నమోదైంది

By:  Garuda Media   |   22 Oct 2026 1:30 PM IST
వామ్మో ఇదేం తాగుడు? రోజులో రూ.303 కోట్ల లిక్కర్ సేల్
X

తెలంగాణలో మద్యం అమ్మకాలకు సంబంధించి సరికొత్త రికార్డు నమోదైంది. ఒక్కరోజులో రూ.303 కోట్ల మద్యం అమ్మకాలు సాగి.. పాత రికార్డులు బద్దలై.. సరికొత్త రికార్డు నమోదైంది. దసరా పండుగ సీజన్ లో మందుబాబుల జోరుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. అక్టోబరు ఒకటి నుంచి 19వరకు అంటే మొత్తం పందొమ్మిది రోజులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగిన మద్యం అమ్మకాలు రూ.2054 కోట్లను దాటేశాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాల జోరు ఏకంగా 37 శాతం పెరగటం గమనార్హం.

దసరా పండుగ వేళలో తెలంగాణలో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు తగ్గట్లే పండక్కి ముందు రోజు అంటే అక్టోబరు 19న మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేశాయి. ఆ ఒక్కరోజులోనే రూ.303 కోట్ల లిక్కర్ అమ్మకాలు సాగాయి. మొత్తం మద్యం అమ్మకాల్లో బీరు విక్రయాల దూకుడు కనిపించింది. గత ఏడాది దసరా సమయంలో నాలుగు రోజుల్లో రూ.698 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగితే.. ఈసారిరూ.755 కోట్లను దాటేసింది. తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం షాపులు.. సుమారు 1200 బార్ అండ్ రెస్టారెంట్లు.. పబ్బులు.. క్లబ్బుల ద్వారా ఇంత భారీగా అమ్మకాలు సాగాయి.

దసరాను నాన్ వెజ్ విందులతో వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీ. పండుగ విందులు.. ఆత్మీయులు కలుసుకోవటం.. పార్టీల కోసం చేసుకున్న ప్రత్యేక ఏర్పాట్ల నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దీనికి తోడు దసరా పండుక్కి వచ్చే స్కూల్ సెలవుల నేపథయంలో ముందే ఊళ్లకు వెళ్లిపోవటం.. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దీంతో వైన్ షాపులు.. బార్ల వద్ద విపరీతమైన రద్దీ చోటు చేసుకుంది. పండుగ రద్దీని అంచనా వేసిన అధికారులు.. భారీగా నిల్వలు చేసుకున్నారు. అందుకు తగ్గట్లే వ్యాపారాలు జోరుగా సాగటంతో..అటు ప్రభుత్వం.. ఇటు మద్యం వ్యాపారులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తాము కోరుకున్నట్లే పండుగ చేసుకున్న ప్రజలు సంతోషంగానే ఉన్నారు. కానీ.. ఒక్కటే సమస్య. ఇంత భారీగా అమ్మకాలు సాగాయి సరే. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అది కూడా ఆనందమే. కానీ.. ఇంత భారీగా మద్యాన్ని సేవించిన ప్రజల ఆరోగ్యం మాటేమిటి?అన్నదే అసలు ప్రశ్న.