'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!
మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘నమస్తే వరల్డ్’ స్టార్టప్ ద్వారా కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో రూ.36.24 కోట్లతో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భారతీయ సంప్రదాయ బొమ్మలు, హస్తకళా ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ఈ పరిశ్రమతో స్థానిక యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
By: Tupaki Political Desk | 13 Nov 2026 12:36 PM ISTసినీ గ్లామర్, రాజకీయ వారసత్వం కలగలిపిన మంచు మనోజ్, భూమా మౌనిక జంట ఇప్పుడు వ్యాపార, పారిశ్రామిక రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. వైవిధ్యమైన యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి సంయుక్తంగా పారిశ్రామికవేత్తలుగా కొత్త అవతారం ఎత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేతులు కలిపిన వీరు కొత్తగా ప్రారంభించిన ‘నమస్తే వరల్డ్’ అనే స్టార్టప్ కంపెనీ ద్వారా కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.36 కోట్లతో ఏర్పాటు చేయనున్న యూనిట్ ద్వారా పలువురు యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు.
సాగర నగరం విశాఖలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సీఐఐ సమ్మిట్ లో మంచు మనోజ్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పరిశ్రమల సమాఖ్య, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్ లో పలువురు పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలు కొత్త యూనిట్లు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల స్టార్టప్ నమస్తే వరల్డ్ కూడా ఉంది. సినిమాల్లో బిజీగా ఉన్న మనోజ్ అనూహ్యంగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మనోజ్ తండ్రి ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆధ్వర్యంలో తిరుపతి సమీపంలో విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు మనోజ్ తమ విద్యాసంస్థల బాధ్యతలను చూసేవారు. అయితే కుటుంబంలో తలెత్తిన సమస్యల వల్ల మనోజ్ విద్యాసంస్థల బాధ్యతల నుంచి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక వ్యాపారంపై ఉన్న ఆసక్తితో ఆయన కొత్త సంస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవడం సినీ రాజకీయ వర్గాలను ఆకర్షిస్తోంది.
రూ. 36.24 కోట్ల పెట్టుబడి
ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ‘నమస్తే వరల్డ్’ స్టార్టప్ ద్వారా సుమారు రూ. 36.24 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు మనోజ్, మౌనిక దంపతులు ముందుకొచ్చారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులో తమ ప్రధాన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. నమస్తే వరల్డ్ సంస్థకు భూమా మౌనిక రెడ్డి వ్యవస్థాపకురాలిగా, సీఈవోగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మంచు మనోజ్ సహ-వ్యవస్థాపకుడి బాధ్యతలోపాటు సీఈవోగా ఉంటారని చెబుతున్నారు. ఈ సంస్థ ద్వారా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా పిల్లల ఆటబొమ్మలు, వివిధ రకాల హస్తకళా ఉత్పత్తులను ఈ యూనిట్లో తయారు చేస్తారు. స్థానిక హస్తకళాకారులను ప్రోత్సహించడంతో పాటు, వారి నైపుణ్యాలను ఆధునిక పారిశ్రామిక సమూహాలతో అనుసంధానించడం ముఖ్య ఉద్దేశమని మనోజ్ దంపతులు ప్రకటించారు. రాయలసీమ ప్రాంతంలోని ఓర్వకల్లులో పరిశ్రమ ఏర్పాటు కావడం వల్ల స్థానిక యువత, మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సాధారణంగా భూమా కుటుంబం అంటేనే రాయలసీమ రాజకీయాల్లో బలమైన ముద్ర ఉన్న కుటుంబం. మౌనిక రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో, ఆమె ఒక పారిశ్రామికవేత్తగా సొంత ప్రాంతమైన కర్నూలు జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా పరిశ్రమను స్థాపించడం విశేషంగా మారింది. మరోవైపు సామాజిక అంశాలపై ఎప్పుడూ చురుగ్గా స్పందించే మనోజ్, వ్యాపార రంగంలోకి రావడం పట్ల విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరి ఈ అడుగు భవిష్యత్తులో మరికొందరు సినీ ప్రముఖులు, యువ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.
పారిశ్రామికవేత్తగా కొత్త బాధ్యతలు చేపడుతూనే, మంచు మనోజ్ తన సినీ కెరీర్‌ను కూడా అంతే వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ‘భైరవం’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన మనోజ్, తేజ సజ్జ హీరోగా వచ్చిన ‘మిరాయ్’ చిత్రంలో శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రతో మెప్పించారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ చిత్రంలోనూ విలన్ పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో మనోజ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మలాదేవితో కలిసి మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నారు. వెండితెరపై నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్న మంచు మనోజ్, ఇప్పుడు జీవిత భాగస్వామి భూమా మౌనికతో కలిసి పారిశ్రామిక రంగంలోనూ విజయం సాధించాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.
