Begin typing your search above and press return to search.

రోజుకు లక్ష కోట్లు.. భారత యూపీఐ పవర్ ఇదీ

భారతదేశంలో ఆర్థిక లావాదేవీల స్వరూపం వేగంగా మారుతోంది. ఒకప్పుడు జేబులో నగదు ఉంటేనే ఏదైనా కొనగలమనే పరిస్థితి ఉండేది.

By:  A.N.Kumar   |   1 Nov 2026 8:35 PM IST
రోజుకు లక్ష కోట్లు.. భారత యూపీఐ పవర్ ఇదీ
X

భారతదేశంలో ఆర్థిక లావాదేవీల స్వరూపం వేగంగా మారుతోంది. ఒకప్పుడు జేబులో నగదు ఉంటేనే ఏదైనా కొనగలమనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చిన్న టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్‌లే దర్శనమిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌తో క్షణాల్లో చెల్లింపులు చేస్తూ భారతీయులు ప్రపంచానికే డిజిటల్ చెల్లింపుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే యూపీఐ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పును తెచ్చి సరికొత్త చరిత్ర సృష్టించింది. తాజాగా వెలువడిన గణాంకాలు భారత డిజిటల్ శక్తి సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీసీఐ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఏకంగా 25.47 బిలియన్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. ఈ చెల్లింపుల మొత్తం విలువ రూ.31.53 లక్షల కోట్లకు చేరగా.. గత ఏడాదితో పోలిస్తే విలువ పరంగా 16 శాతం వృద్ధి నమోదైంది. కేవలం చిరు వ్యాపారాలకే కాకుండా భారీ కొనుగోళ్లకు కూడా ప్రజలు డిజిటల్ పద్ధతినే ఎంచుకుంటున్నారనడానికి ఇది నిదర్శనం.

ఈ డిజిటల్ జోరులో అత్యంత ఆసక్తికరమైన అంశం రోజువారీ సగటు లావాదేవీల విలువ. అక్టోబర్‌లో సగటున ప్రతిరోజూ 822 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. ముఖ్యంగా సగటు రోజువారీ లావాదేవీల విలువ తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును దాటి రూ.1.01 లక్షల కోట్లకు చేరుకోవడం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. అక్టోబర్ 9న ఒక్కరోజే 873 మిలియన్ల లావాదేవీలు జరగడం ఈ ఉత్సాహానికి అద్దం పడుతోంది.

అక్టోబర్‌లో నవరాత్రులు, దుర్గాపూజ, దసరా వేడుకలు, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల ప్రత్యేక సేల్స్ డిజిటల్ చెల్లింపులకు భారీ ఊతమిచ్చాయి. వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలతో పాటు రోజువారీ అవసరాల కోసం ప్రజలు యూపీఐని విరివిగా వాడారు. నగదు వెంట తీసుకెళ్లాల్సిన పనిలేకుండా తక్షణమే సురక్షితంగా బదిలీ అయ్యే సౌలభ్యం ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు దీనికి అలవాటుపడ్డారు.

అక్టోబర్ రికార్డుల తర్వాత దీపావళి, ధంతేరస్ పండుగల నేపథ్యంలో నవంబర్‌లోనూ ఇదే జోరు కొనసాగుతుందని ఫిన్‌టెక్ నిపుణులు భావిస్తున్నారు. బంగారం, వెండి, ఆభరణాల కొనుగోళ్లతో అధిక విలువ కలిగిన లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంది. నగదు రహిత సమాజం వైపు భారత్ వేస్తున్న ఈ అడుగులు దేశ ఆర్థిక ప్రగతికి.. టెక్నాలజీ పురోగతికి అద్దం పడుతున్నాయి.