3300 కోట్ల సంపద సృష్టి వెనక సీక్రెట్.. ఈ నటుడు ఒక బ్యాడ్ బిజినెస్మేన్!
తమిళ చిత్రసీమలో 1990లలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన అరవింద్ స్వామి ప్రయాణం ఎంతో వైవిధ్యమైనది.
By: Sivaji Kontham | 16 Oct 2026 3:00 PM ISTఅతడు తనను తాను బ్యాడ్ బిజినెస్మేన్ అని ఒప్పుకున్నాడు. డాక్టర్ కాబోయి వ్యాపారి అయ్యాడు. తర్వాత నటుడు అయ్యాడు. నటనలో కొనసాగుతుండగానే అనుకోని పరిణామంతో తిరిగి వ్యాపారంలోకి అడుగుపెట్టి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు. మళ్లీ నటనలోకి రీఎంట్రీ ఇచ్చాడు. స్టార్ గా ఏల్తున్నాడు. అతడు మరెవరో కాదు .. ది గ్రేట్ అరవింద స్వామి.
తమిళ చిత్రసీమలో 1990లలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన అరవింద్ స్వామి ప్రయాణం ఎంతో వైవిధ్యమైనది. సినిమాల్లో అగ్రకథానాయకుడిగా రాణిస్తున్న సమయంలోనే అనూహ్యంగా నటనకు తాత్కాలికంగా దూరమై వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్తగా `టాలెంట్ మాక్సిమస్ ఇండియా` అనే సంస్థను స్థాపించి, 2022 నాటికి దాని విలువను సుమారు రూ. 3,300 కోట్లకు తీసుకెళ్లడం ద్వారా అతడు తనలోని నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.
వాస్తవానికి అరవింద్ స్వామికి నటుడు కావాలనేది మొదటి కోరిక కాదు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారి ప్రేరణతో అతడు డాక్టర్ కావాలనుకున్నారు. కానీ పారిశ్రామికవేత్త అయిన తండ్రి వి.డి. స్వామి పట్టుబట్టడంతో వ్యాపార విద్యను అభ్యసించారు. ఆ తర్వాత 1991లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `దళపతి` చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన అరవిందస్వామి ఆ తర్వాత రోజా, బొంబాయి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో రొమాంటిక్ హీరోగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.
2000వ దశకం ప్రారంభంలో కొత్త సవాళ్లను స్వీకరించాలనే ఉద్దేశంతో అతడు తిరిగి నటనకు విరామం ఇచ్చి.. వ్యాపార కార్యకలాపాలపై పూర్తి దృష్టి సారించారు. అయితే అదే సమయంలో ఆయన జీవితంలో ఊహించని మలుపు. అతడు ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయమై కాలు పక్షవాతానికి గురికావడంతో దాదాపు 4 నుండి 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ చికిత్స పొంది.. తీవ్ర శ్రమతో తిరిగి కోలుకున్నారు.
ఆరోగ్య సమస్యల నుంచి బయటపడిన తర్వాత మళ్లీ దర్శకుడు మణిరత్నం ప్రోత్సాహంతో 2013లో `కడల్` (తెలుగులో కడలి) చిత్రం ద్వారా అరవింద్ స్వామి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2015లో వచ్చిన `తని ఒరువన్` (తెలుగులో ధ్రువ) చిత్రంలో అతడు పోషించిన విలన్ పాత్ర ఆయన సెకండ్ ఇన్నింగ్స్కు ఒక మైలురాయిగా నిలిచింది. నాటి నుండి నేటివరకు వరుస సినిమాలు, వెబ్ సిరీస్లలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించినా కానీ.. అరవింద్ స్వామి తనను తాను ఒక `బ్యాడ్ బిజినెస్ మ్యాన్` అని పిలుచుకుంటారు. కేవలం లాభాలు ఆర్జించడం కంటే.. ఒక సమస్యకు సరైన పరిష్కారం కనుగొనడమే వ్యాపారంలో తనకు ఆసక్తి కలిగిస్తుందని అతడు స్పష్టం చేశారు. అలాగే అప్పులు చేసి వ్యాపారాన్ని విస్తరించడం తనకు నచ్చదని తెలిపిన ఆయన ప్రస్తుతం తన కుమారుడు రుద్రతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టెక్నాలజీ వెంచర్ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
