1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి
కన్నడ స్టార్ యష్ అరుదైన వెయ్యి కోట్ల క్లబ్లో చోటు సంపాదించాడు. గతంలో హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2’, ఇప్పుడు విలన్‌గా కనిపించిన ‘రామాయణం’ రెండూ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా రూ.1,033 కోట్ల గ్రాస్ దాటడంతో హీరోగా, ప్రతినాయకుడిగా యష్ మరో రికార్డు అందుకున్నాడు.
By: M Prashanth | 13 Nov 2026 12:17 PM ISTఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడమే ఒక అరుదైన రికార్డు. అలాంటిది ఒకసారి హీరోగా, మరోసారి విలన్ గా పూర్తి భిన్నమైన పాత్రలతో ఆ క్లబ్లో చేరడం అంటే మామూలు విషయం కాదు. కన్నడ స్టార్ యష్ ఇప్పుడు అదే రికార్డు అందుకున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన 'రామాయణం' లేటెస్ట్ గా వెయ్యి కోట్ల వసూళ్లను దాటడంతో, యష్ ఖాతాలో మరో భారీ బ్లాక్‌బస్టర్ చేరింది.
విడుదలైన ఎనిమిది రోజుల్లోనే 'రామాయణం' ప్రపంచవ్యాప్తంగా రూ.1033 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన ఈ చిత్రంలో యష్ రావణుడిగా కనిపించారు. ముఖ్యంగా ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు జటాయువుతో సాగే పోరాట సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.
గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్ 2' దాదాపు రూ.1215 కోట్లు వసూలు చేసి యష్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. అయితే ఆ సినిమా పూర్తిగా రాకీ భాయ్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే మాస్ ఎలివేషన్లతో నడిచింది. కానీ 'రామాయణం' విషయానికి వస్తే కథ అందరికీ తెలిసిందే, పైగా ఇతర ప్రధాన పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. అయినా రాకీ భాయ్ ఛాయలు ఎక్కడా కనిపించకుండా రావణుడి పాత్రలో యష్ తనదైన ముద్ర వేశారు.
హిందీ మార్కెట్‌కే పరిమితం కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా గట్టిగా వసూళ్లు రాబడుతోంది. యూకే, థాయ్‌లాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో మంచి బిజినెస్ జరుగుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అటు కన్నడ డబ్బింగ్ వెర్షన్‌కు కూడా ఊహించని రెస్పాన్స్ వస్తోంది. పౌరాణిక కథాంశంతో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
భారతీయ సినీ చరిత్రలో రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న నటుల లిస్టు చాలా చిన్నది. ఇప్పటివరకు బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ (పఠాన్, జవాన్), రణవీర్ సింగ్ (ధురంధర్ సిరీస్), టాలీవుడ్ నుంచి ప్రభాస్ (బాహుబలి 2, కల్కి) మాత్రమే ఈ ఫీట్ సాధించారు. లేటెస్ట్ కలెక్షన్లతో శాండల్‌వుడ్ నుంచి యష్ కూడా ఆ ఎలైట్ క్లబ్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
మొదటి భాగంలో రావణుడి పాత్రను పరిచయం చేశారు, కొన్ని ఘట్టాలకే మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. 'రామాయణం' రెండో భాగంలో రాముడు, రావణుడి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను మరింత గ్రాండ్ గా చూపించనున్నారు. హీరోగా, ప్రతినాయకుడిగా బాక్సాఫీస్ లెక్కలు మారుస్తున్న యష్, రాబోయే సినిమాలతో ఇంకెన్ని రికార్డులు అందుకుంటారో చూడాలి.
