తెలుగు రైట్స్‌లో టాప్ సినిమాలు.. 'వారణాసి' ఎంత తేవాలి?
‘వారణాసి’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.290 కోట్లకు మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ‘RRR’ రూ.225 కోట్ల రికార్డును అధిగమిస్తుంది. అయితే ఈ భారీ ధరను రికవరీ చేయాలంటే తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.500 కోట్ల గ్రాస్ అవసరమని ట్రేడ్ అంచనా. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఇక్కడ ఈ స్థాయి వసూళ్లు సాధించలేదు.
By: M Prashanth | 14 Nov 2026 9:50 AM ISTపాన్ ఇండియా సినిమాలకు వందల కోట్ల వసూళ్లు వస్తున్నా, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ప్రతిసారీ లాభాలు రావడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ధరలకు రైట్స్ కొనుగోలు చేసిన సినిమాల్లో కొన్ని బాగా ఆడితే, మరికొన్ని నష్టాలు మిగిల్చాయి. అందుకే పెద్ద సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందనే దానితో పాటు చివరకు ఎంత రికవరీ అయిందనేది కూడా ముఖ్యం. ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి 'వారణాసి'తో ఈ లెక్కలు మరో స్థాయికి వెళ్లేలా ఉన్నాయి.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌లో 'RRR' అగ్రస్థానంలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా హక్కులు దాదాపు రూ.225 కోట్లకు అమ్ముడయ్యాయి. విడుదల తర్వాత ఏపీ, తెలంగాణలో రూ.269 కోట్లకు పైగా షేర్ సాధించింది. దీంతో భారీ పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్లకు మంచి రికవరీ దక్కింది. రాజమౌళి గత సినిమా కావడంతో ఇప్పుడు 'వారణాసి' బిజినెస్‌ను కూడా దీనితోనే పోలుస్తున్నారు.
ఇక 'పుష్ప 2' తెలుగు రాష్ట్రాల హక్కులు రూ.200 కోట్లకు పైగా పలికాయి. కొన్ని ట్రేడ్ రిపోర్ట్స్‌లో రూ.220 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి వేరుగా ఉంది. ఇక్కడ దాదాపు రూ.213 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రాలో కొందరు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోగా, సీడెడ్‌లో లాభాలు వచ్చాయి.
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' తెలుగు రాష్ట్రాల బిజినెస్ దాదాపు రూ.168 కోట్లు. చివరకు రూ.182 కోట్లకు పైగా షేర్ సాధించడంతో పెట్టుబడి రికవరీ అయింది. మరోవైపు 'సలార్' హక్కులు దాదాపు రూ.160 కోట్లకు అమ్ముడవగా, రూ.147 కోట్ల వరకు షేర్ వచ్చింది. దీంతో కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పలేదు. ఎన్టీఆర్ 'దేవర' మాత్రం దాదాపు రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో వచ్చి రూ.150 కోట్ల షేర్ అందుకుంది.
ఇక 'బాహుబలి 2' విషయానికొస్తే అప్పట్లో తెలుగు రాష్ట్రాల హక్కులు దాదాపు రూ.122 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆ సినిమా ఏకంగా రూ.198 కోట్లకు పైగా షేర్ సాధించింది. పెట్టుబడితో పోలిస్తే భారీ లాభాలు అందించిన సినిమాల్లో ఇదొకటి. అయితే ఆ తర్వాత టికెట్ ధరలు, హీరోల మార్కెట్ పెరగడంతో రైట్స్ ధరలు కూడా భారీగా పెరిగాయి. అదే స్థాయిలో ప్రతి సినిమాకు లాంగ్ రన్ రావడం లేదు.
ఇప్పుడు 'వారణాసి' తెలుగు రాష్ట్రాల హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.290 కోట్లకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ నిజమైతే 'RRR' రికార్డును రూ.65 కోట్ల తేడాతో దాటినట్లే. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ ధర రికవరీ కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ అవసరం కావచ్చు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఇక్కడ అంత గ్రాస్ సాధించలేదు. రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌తో ఇంత పెద్ద ధర పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నా, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం గత రికార్డులన్నింటినీ మించిన వసూళ్లు కావాల్సి ఉంటుంది.
