Begin typing your search above and press return to search.

2027లో క్రేజీ సీక్వెల్స్..ద‌డ పుట్టిచేదెవ‌రు?

2027లో టాలీవుడ్‌లో సీక్వెల్స్ సందడి చేయనున్నాయి. జై హనుమాన్, మిరాయ్ 2, గూఢచారి 2, పొలిమేర 3, జాంబీ రెడ్డి 2, మ్యాడ్ జూనియర్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మైథాలజీ, హారర్, స్పై థ్రిల్లర్, కామెడీ జానర్లలో తెరకెక్కుతున్న ఈ ఆరు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా విజయం సాధిస్తుందో ఆసక్తిగా మారింది.

By:  Srikanth Kontham   |   20 Nov 2026 10:58 PM IST
2027లో క్రేజీ సీక్వెల్స్..ద‌డ పుట్టిచేదెవ‌రు?
X

టాలీవుడ్‌లో ఎప్పుడూ లేనంతగా సీక్వెల్స్ హవా నడుస్తున్న వేళ 2027 సంవత్సరం ప్రేక్షకులకు అసలైన సినిమా పండుగను తీసుకురాబోతోంది. ఇప్పటికే సూపర్ హిట్ అయిన సినిమాల కొనసాగింపుగా వస్తున్న క్రేజీ ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాదే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. మైథాలజీ నుంచి హారర్, స్పై థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ వరకు అన్ని జానర్లలో ఈ సీక్వెల్స్ రావ‌డంతో బాక్సాఫీస్ వద్ద వీటిలో ఏది అసలైన విధ్వంసం సృష్టిస్తుందనే చర్చ మొదలైంది.

ఈ భారీ సీక్వెల్స్ జాబితాలో అందరి చూపు ముందుగా `జై హనుమాన్` మీదే ఉంది. `హనుమాన్` సృష్టించిన సంచలనం తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనుండటంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు తేజ సజ్జా హీరోగా `మిరాయ్` సక్సెస్ తర్వాత రాబోతున్న `మిరాయ్ 2` కూడా మరో భారీ విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి పోటీ పడుతున్నాయి.

మరోవైపు స్పై థ్రిల్లర్.. సస్పెన్స్ జానర్లలో `గూడచారి 2`, `పొలిమేర 3` చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అడివి శేష్ తనదైన స్టైలిష్ మేకింగ్‌తో `గూడచారి`కి కొనసాగింపుగా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు. ఒక‌ ఊహించని మలుపులతో ఓటీటీలో.. థియేటర్లలో సంచలనం సృష్టించిన `పొలిమేర` సిరీస్ నుంచి వస్తున్న మూడో భాగం `పొలిమేర 3` చేతబడి నేపథ్యంలో మరింత ఉత్కంఠను రేపడానికి రెడీ అవుతోంది.

వినోదం విషయానికి వస్తే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడానికి `జాంబీ రెడ్డి 2`, `మ్యాడ్ జూనియర్స్` సిద్ధమవుతున్నాయి. తెలుగులో తొలి జాంబీ సినిమాగా విజయం సాధించిన చిత్రానికి కొనసాగింపుగా ప్రశాంత్ వర్మ మార్క్ కథతో `జాంబీ రెడ్డి 2` రాబోతోంది. అలాగే `మ్యాడ్`, `మ్యాడ్ స్క్వేర్` సినిమాలతో యూత్‌ను కడుపుబ్బా నవ్వించిన బృందం మ‌రోసారి `మ్యాడ్ జూనియర్స్` పేరుతో కాలేజీ అల్లరిని తెరపైకి తీసుకురానుంది.

2027లో విడుదల కానున్న ఈ ఆరు క్రేజీ సీక్వెల్స్ ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. భారీ బడ్జెట్ మైథాలజీ చిత్రాలు ఒకవైపు కంటెంట్ ఉన్న థ్రిల్లర్లు.. యూత్‌ఫుల్ కామెడీ సినిమాలు మరోవైపు పోటీపడుతుండటంతో వచ్చే ఏడాది థియేటర్ల వద్ద రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సీక్వెల్స్ జాతరలో ప్రేక్షకుల మనసు గెలిచి బాక్సాఫీస్‌కు అసలైన దడ పుట్టించే సినిమా ఏదవుతుందో చూడాలి.