డబ్బింగ్ సినిమాల జోరు.. తెలుగు చిన్న సినిమాలకు థియేటర్లలో కష్టాలు!
ఈ వారం విడుదలైన చిన్న తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్నాయి. సాయి అనీష్ రెడ్డి నటించిన ‘ఇట్లు అర్జున’ రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌కు గానూ ఇప్పటివరకు సుమారు రూ.3 కోట్లే వసూలు చేసింది. ‘డీఎన్‌కే’, ‘గోట్’, ‘మాయ లేడీ’, ‘డార్క్ చాక్లెట్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మరోవైపు ‘రామాయణ’, ‘సీన్’ వంటి డబ్బింగ్ చిత్రాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 17 Nov 2026 9:30 AM ISTఈ వారం తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇతర భాషల నుంచి డబ్బింగ్ అయి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రామాయణ, సీన్ వంటి చిత్రాలు మంచి వసూళ్లతో ముందుకు వెళ్తున్నాయి.
మరోవైపు మన తెలుగులో విడుదలైన చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. గత శుక్రవారం ఒకేసారి పలు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో చాలా చిత్రాలకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నిరాశకు గురవుతున్నారు.
ఈ వారం విడుదలైన తెలుగు సినిమాల్లో ఇట్లు అర్జునపై భారీ అంచనాలు ఉన్నాకానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బోల్తా పడింది. సాయి అనీష్ రెడ్డి హీరోగా నటించగా, అనస్వర రాజన్ హీరోయిన్గా కనిపించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.10 కోట్లుగా ప్రచారం జరిగితే ఇప్పటికి కేవలం మూడు కోట్లు మాత్రమే సంపాదించింది. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకా భారీ వసూళ్లు సాధించాల్సి ఉంది. మరోవైపు డీఎన్‌కే సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సుడిగాలి సుధీర్ నటించిన గోట్ సినిమాకు కూడా కలెక్షన్లు కనీసం యావరేజ్ గా కూడా రాలేదు.
మాయ లేడీ సినిమా కూడా థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. డార్క్ చాక్లెట్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ సినిమా విడుదలైన విషయం కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు.
మొత్తం పైన ఈనెల డబ్బింగ్ సినిమాలో హవా చూపిస్తూ ఉండగా.. మన తెలుగు సినిమాలు మాత్రం.. అసలు ఎప్పుడు వస్తున్నాయి..ఎప్పుడు వెళ్తున్నాయి అనేది తెలియకుండా విడుదలై వెళ్ళిపోయాయి.
