Begin typing your search above and press return to search.

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

రాబోయే సంక్రాంతికి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి అరడజనుకు పైగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. చిరంజీవి, వెంకటేష్, శర్వానంద్, సాయి దుర్గ తేజ్ చిత్రాలతో పాటు తమిళ సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కులు కలిపి ఈ సీజన్‌లో రూ.1000 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   5 Nov 2026 12:51 PM IST
సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!
X

అత్యంత లాభదాయకమైన సీజన్ ఏదైనా ఉందంటే? అది కచ్చితంగా సంక్రాంతి పండుగే. ఏటా ఈ పండగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుంటుంది. అయితే రాబోయే సంక్రాంతి రేసు మాత్రం మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. టాలీవుడ్ .. కోలీవుడ్ పరిశ్రమల నుంచి మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లలోకి క్యూ కడుతుండటంతో ఈ ఒక్క పండగ సీజన్‌లోనే 1000 కోట్ల థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే సీనియర్ స్టార్లతో పాటు యంగ్ హీరోలు కూడా సంక్రాంతినే తమ ప్రధాన టార్గెట్‌గా ఎంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెర‌కెక్క‌తున్న‌ `కాకా` చిత్రం సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న `జనవరి 12న విడుదల` చిత్రం పక్కాగా పండగ రోజే విడుదల కానుంది. వీటితో పాటు శర్వానంద్-శ్రీను వైట్ల కలయికలో వస్తున్న `జార్జ్ క్రిష్`, సాయి దుర్గా తేజ్ నటించిన `సంబరాల ఏటిగట్టు`, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న `మహాకాళి` వంటి చిత్రాలు కూడా ఈ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి.

మరోవైపు కోలీవుడ్ నుంచి కూడా భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. కోలీవుడ్ మేకర్స్ తమ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లను పండగ సెలవులను క్యాష్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళ చిత్రసీమకు చెందిన పా. రంజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా `వేట్టువం` వంటి భారీ ప్రాజెక్ట్‌లు సంక్రాంతి రేసులోకి రావడంతో ఈ పోరు ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా నేషనల్ వైడ్‌గా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు, తమిళ భాషల నటీనటుల కలయికతో వస్తున్న ఈ చిత్రాలు రెండు రాష్ట్రాల్లోనూ భారీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.

బిజినెస్ పరంగా చూస్తే.. థియేట్రికల్ హక్కులు, డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్, ఆడియో హక్కులు అన్నీ కలిపి ఒక్కో భారీ చిత్రానికి వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. పెద్ద సినిమాల బడ్జెట్‌లతో పాటు ప్రమోషనల్ కాస్ట్, డిజిటల్ రైట్స్ డిమాండ్ భారీగా పెరగడమే ఈ సంక్రాంతి బిజినెస్ 1000 కోట్ల మార్కును తాకడానికి ప్రధాన కారణం. పండగ రోజుల్లో సెలవులు, థియేటర్లకు వచ్చే కుటుంబ ప్రేక్షకుల సంఖ్య ఈ భారీ వసూళ్లకు ప్రధాన హామీగా నిలుస్తోంది. ఒకేసారి అరడజనుకు పైగా సినిమాలు రేసులో ఉండటంతో థియేటర్ల కేటాయింపు నిర్మాతలు .. పంపిణీదారులకు అతిపెద్ద సవాల్‌గా మారనుంది. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో ఏ సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కుతాయి? ఏ రోజు ఏ సినిమా రిలీజ్ అవుతుందనే? అంశంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

అయితే కంటెంట్ బాగుంటే రెండు మూడు సినిమాలు కూడా పండగ సీజన్‌లో సమాంతరంగా వందల కోట్ల వసూళ్లను రాబట్టగలవని గత అనుభవాలు నిరూపించాయి. ఏదేమైనా? ఈ సరికొత్త సంక్రాంతి పోరు బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్-కోలీవుడ్ సినిమాల సమ్మేళనం, విభిన్న కథాంశాలు, స్టార్ హీరోల ఇమేజ్ కలగలిపి బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను నెలకొల్పనున్నాయి. రాబోయే పండగ సీజన్ ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందిస్తూనే నిర్మాతలు ..డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తుందని పరిశ్రమ భావిస్తోంది.