Begin typing your search above and press return to search.

రూ.99 ఆఫ‌ర్‌ : 'రామాయ‌ణ' కాకుండా టాప్-10 సినిమాలు!

భారీ సినిమాలకు రూ.99 టికెట్ ఆఫర్ కొత్త మార్కెటింగ్ వ్యూహంగా మారింది. తాజాగా ‘రామాయణం-1’ నవంబర్ 24న గురుపురబ్ సందర్భంగా ఒక్కరోజు రూ.99 ప్రారంభ ధరతో టికెట్లు అందిస్తోంది. గతంలో ‘కల్కి 2898 ఏడీ’, ‘బ్రహ్మాస్త్ర’, ‘జవాన్’, ‘స్త్రీ 2’ వంటి సినిమాలు కూడా ఈ ఆఫర్‌ను ఉపయోగించుకున్నాయి. తగ్గిన ఆక్యుపెన్సీ పెంచడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకు నిర్మాతలు ఈ ఫార్ములాను అనుసరిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   24 Nov 2026 9:17 AM IST
రూ.99 ఆఫ‌ర్‌ : రామాయ‌ణ కాకుండా టాప్-10 సినిమాలు!
X

ఇటీవ‌లి కాలంలో రూ.99 ఆఫ‌ర్ అంటూ కొత్త ట్రెండ్ ఊరిస్తోంది! బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలైన పెద్ద సినిమాలు సైతం ప్రేక్షకులను రెండు మూడు వారాల్లో థియేటర్లకు రప్పించేందుకు.. లేదంటే విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో రూ.99 టికెట్ ఆఫర్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. తాజాగా నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ `రామాయణం` చిత్రబృందం కూడా గురుపురబ్ పండ‌గ‌ సందర్భంగా నేడు (మంగళవారం, నవంబర్ 24) ఒక్కరోజు పాటు రూ.99 ప్రారంభ ధరతో టికెట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది.

రామాయ‌ణం-1 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్ల గ్రాస్ వసూళ్లను తాక‌గా.. మూడో వారంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో .. నార్త్ అమెరికా సహా పలు చోట్ల స్క్రీన్ల సంఖ్య తగ్గుతున్న క్రమంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మరింతగా ఆకర్షించేందుకు ఈ స్పెషల్ ఆఫర్ ప్రకటించారు. థియేటర్ తో పాటు ఫార్మాట్‌ను బట్టి టికెట్ రేట్లలో మార్పులు ఉన్నా.. ఈ వన్-డే ఆఫర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

భారతీయ సినీ చరిత్రలో రూ.99 టికెట్ ఆఫర్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాలలో ప్రభాస్ `కల్కి 2898 AD` ముందు వరుసలో ఉంటుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన తర్వాత.. మేకర్స్ కొద్దిరోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మల్టీప్లెక్సుల్లో కేవలం రూ.99 - రూ.100 ధరకే టికెట్లు అందించారు. సినిమా విడుదలైన కొన్ని వారాల తర్వాత ప్రకటించిన ఈ ఆఫర్ రిపీట్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో కల్కి లాంగ్ రన్ కలెక్షన్లను మరింత పెంచడంలో అద్భుతంగా పనిచేసింది.

మరోవైపు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన భారీ బడ్జెట్ చిత్రాలు సైతం వీక్ డేస్‌లో ఆక్యుపెన్సీ పెంచుకోవడానికి ఈ రూ.99 ఫార్ములాను ఉప‌యోగించాయి. ముఖ్యంగా 2024లో విడుదలైన అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ `బడే మియాన్ ఛోటే మియాన్`, అజయ్ దేవగణ్ నటించిన `మైదాన్` చిత్రాలకు మంగళవారం, బుధవారం వంటి వీక్ డేస్‌లో రూ.99కే టికెట్లు విక్రయించారు. భారీ ఓపెనింగ్స్ రాని నేపథ్యంలో కనీసం తక్కువ ధరతోనైనా సామాన్య ప్రేక్షకులను థియేటర్ల వైపు మళ్లించేందుకు నిర్మాతలు ఈ తరహా డిస్కౌంట్లను ప్రకటించారు.

మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎం.ఐ.ఏ) నిర్వహించే `నేషనల్ సినిమా డే` సందర్భంగా కూడా అప్పట్లో థియేటర్లలో ఆడుతున్న అతిపెద్ద హిట్ సినిమాలన్నీ రూ.99కే అందుబాటులోకి వచ్చి రికార్డులు తిరగరాశాయి. రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమాకు రూ.75 - రూ.99 ఆఫర్ ప్రకటించిన రోజున దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడై వసూళ్లు అమాంతం పెరిగాయి. అదేవిధంగా షారుఖ్ ఖాన్ జవాన్, శ్రద్ధా కపూర్ స్త్రీ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన తర్వాత రూ.99 ఆఫర్ రోజున హౌస్‌ఫుల్ బోర్డులతో మరోసారి సత్తా చాటాయి.

వీటితో పాటు సూర్య నటించిన భారీ చిత్రం `కంగువ` సహా పలు తమిళ, కన్నడ పాన్-ఇండియా డబ్బింగ్ చిత్రాలు నార్త్ ఇండియా మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకులను ఆకర్షించేందుకు రూ.99 టికెట్ ఆఫర్‌ను ప్రయోగించాయి. సాధారణంగా సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో భారీ టికెట్ ధరలతో పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునే మేకర్స్.. ఆ తర్వాత థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గకుండా ఉండేందుకు ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తుంటారు. తక్కువ ధర ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడమే కాకుండా.. మల్టీప్లెక్సుల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ (ఎఫ్ అండ్ బీ) ద్వారా థియేటర్ యాజమాన్యాలకు కూడా అదనపు ఆదాయం సమకూరుతుండటంతో ఈ రూ.99 ట్రెండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సక్సెస్‌ఫుల్ మార్కెటింగ్ స్ట్రాటజీగా మారిపోయింది.