Begin typing your search above and press return to search.

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

రణ్‌బీర్ కపూర్ పాన్ ఇండియా స్టార్‌డమ్ దిశగా దూసుకెళ్తున్నారు. రామాయణ పార్ట్ 1 ఐదు రోజుల్లోనే రూ.750 కోట్ల వసూళ్లు సాధించగా, ఆయన కెరీర్‌లో అత్యధిక గ్రాసర్‌గా నిలిచిన యానిమల్ (రూ.917.76 కోట్లు) రికార్డుపై దృష్టి పడింది. రామాయణ పార్ట్ 2, యానిమల్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులతో దక్షిణాది మార్కెట్‌లోనూ తన క్రేజ్‌ను మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు.

By:  Sivaji Kontham   |   11 Nov 2026 9:28 AM IST
ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?
X

భార‌త‌దేశంలో పాన్ ఇండియ‌న్ స్టార్ అంటే ప్ర‌భాస్ పేరు తొలిగా వినిపిస్తుంది. ఆ త‌ర్వాత కూడా టాలీవుడ్ నుంచి అర‌డ‌జ‌ను మంది స్టార్లు ఉన్నారు. అయితే బాలీవుడ్ నుంచి యువహీరోల‌లో ఈ రేసులో ఎవ‌రెవ‌రు ఉన్నారు? ఇటీవ‌ల ర‌ణ్‌వీర్ సింగ్ దురంధ‌ర్ ఫ్రాంచైజీతో 3000 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ స్టార్ గా రేసులోకి వ‌చ్చాడు. ఇప్పుడు ర‌ణ‌బీర్ క‌పూర్ దీనిని బ్రేక్ చేసే దిశ‌గా సాగుతున్నాడు. అత‌డు న‌టించిన రామాయ‌ణ ఫ్రాంఛైజీ, అత‌డి కెరీర్ లో రికార్డ్ బ్రేకింగ్ మైలురాయి చిత్రంగా నిల‌వ‌నుంది.

రామాయ‌ణ పార్ట్ -1 విడుద‌లైన 5 రోజుల్లోనే దాదాపు 750 కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డి కెరీర్ లో రికార్డ్ బ్రేకింగ్ చిత్రంగా నిలిచిన సందీప్ వంగా యానిమ‌ల్ దాదాపు 900 కోట్ల వ‌సూళ్లతో అగ్ర స్థానంలో నిల‌వ‌గా దీనిని రామాయ‌ణ బ్రేక్ చేయ‌నుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన రణ్‌బీర్ కపూర్ టాప్ 5 చిత్రాల జాబితాను పరిశీలిస్తే అత‌డి కలెక్షన్ల స్టామినా స్పష్టంగా అర్థమవుతుంది. యానిమల్ చిత్రం 917.76 కోట్ల భారీ వసూళ్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఇప్ప‌టికి`రామాయణ్ -పార్ట్ 1` 750 కోట్ల మార్కును అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. వీటితో పాటు రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన `సంజు` 586.85 కోట్లు, అయాన్ ముఖర్జీ `బ్రహ్మాస్త్ర- పార్ట్ వన్: శివ` 418.80 కోట్లు, రోమాంటిక్ లవ్ డ్రామా `యే జవానీ హై దీవానీ` 319.60 కోట్లు వసూలు చేసి ర‌ణ‌బీర్ కెరీర్‌లో అత్యుత్తమ గ్రాసర్లుగా నిలిచాయి.

ఇప్పుడు ఈ రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తూ రామాయణ ఫ్రాంఛైజీ ర‌ణ‌బీర్ ని సిస‌లైన పాన్ ఇండియన్ స్టార్ గా ఆవిష్క‌రించ‌నుంది. అత‌డు దురంధ‌ర్ రికార్డుల‌ను బ్రేక్ చేసేందుకు ఛాన్స్ లేక‌పోలేద‌ని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. రామాయ‌ణ చిత్రం తొలి 5 రోజుల్లో అద్భుత వ‌సూళ్లను సాధించింది. హౌస్ ఫుల్స్ తో న‌డుస్తోంది. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ నుంచి భారీ క‌లెక్ష‌న్స్ తేవ‌డ‌మే కాకుండా, సౌతిండియా బాక్సాఫీస్ వ‌ద్ద రామాయ‌ణ హ‌వా కొన‌సాగుతోంద‌ని ట్రేడ్ చెబుతోంది.

ర‌ణ‌బీర్ ఇప్ప‌టికి మూడు సార్లు 500 కోట్ల క్ల‌బ్ లు అందుకున్నాడు. తాజాగా విడుద‌లైన రామాయ‌ణం పార్ట్ 1 కంటే ముందు యానిమ‌ల్, సంజు చిత్రాల‌తో 500 కోట్ల క్ల‌బ్ ల‌లో అడుగుపెట్టాడు. త‌దుప‌రి రామాయ‌ణ పార్ట్ 2 కూడా 500 కోట్ల క్ల‌బ్ ని సులువుగా అధిగ‌మిస్తుంది. ఆ త‌ర్వాత కూడా రానున్న `యానిమ‌ల్ పార్క్` చిత్రానికి ఆ అవ‌కాశం ఉంటుంది. సందీప్ వంగా క్రేజ్ తో `యానిమల్ పార్క్` సులభంగా 500 కోట్ల నుండి ఏకంగా 1000 కోట్ల క్లబ్‌ను తాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ర‌ణ‌బీర్ లైన‌ప్ ప్ర‌కారం.. మునుముందు అత‌డు మ‌రిన్ని అరుదైన పాన్ ఇండియ‌న్ విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌భాస్, అల్లు అర్జున్, ర‌ణ్ వీర్ సింగ్ త‌ర‌హాలోనే అత‌డి పేరు కూడా మునుముందు మ‌రింత‌గా మార్మోగుతుంద‌న‌డంలో సందేహం లేదు. అత‌డు పొరుగు భాష‌ల నుంచి ప్రతిభావంతులైన దర్శకులతో పనిచేస్తూ.. పౌరాణిక ఫాంటసీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు వైవిధ్యమైన భారీ బడ్జెట్ చిత్రాలను ఎంచుకుంటున్నారు. భారతీయ సినీ ప్రేక్షకులందరినీ థియేటర్లకు రప్పించగల అరుదైన నటులలో ఒకరిగా నిలుస్తున్నారు.

అందుకే బాలీవుడ్ నుంచి ఆవిర్భవించే బిగ్గెస్ట్ పాన్-ఇండియన్ సూపర్ స్టార్‌గా అత‌డు రికార్డుకెక్కుతాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ మార్కెట్‌లో కూడా బలమైన పునాదిని వేసుకుంటూ..రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తున్న రణ్‌బీర్ భారతీయ సినిమా బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోనున్నారు.