Begin typing your search above and press return to search.

27 దేశాల్లో రికార్డ్..రామాయణం విశ్వవ్యాప్త కలెక్షన్లు!

రామాయణ సినిమా 22 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,777 కోట్ల వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో 64 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి 27 దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. భారత్‌లో రూ.992 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా, త్వరలోనే రూ.1,000 కోట్ల మార్కును చేరే అవకాశం ఉంది.

By:  Srikanth Kontham   |   27 Nov 2026 3:00 PM IST
27 దేశాల్లో రికార్డ్..రామాయణం విశ్వవ్యాప్త కలెక్షన్లు!
X

మూడో వారం ముగిసే సమయానికి `రామాయణ` మొద‌టి భాగం సినిమా బాక్సాఫీస్ లెక్కలను మరో మలుపు తిప్పింది. ఆరంభంలో అంచనాలకు తగ్గ వేగం చూపించకపోయినా? ఓవర్సీస్ మార్కెట్లో పుంజుకోవడంతో చిత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏకంగా 27 దేశాల్లో ఆల్‌టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలవడం విశేషం. విడుదలైన 22వ రోజు గురువారం కూడా విదేశాల్లో రోజుకు 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తొలినాళ్లలో వరుసగా ఏడు రోజుల పాటు రోజుకు 100 కోట్ల గ్రాస్ దాటిన వేగం ఇప్పుడు స్వదేశంలో కాస్త నెమ్మదించింది.

దేశీయంగా రోజువారీ నెట్ వసూళ్లు 10 కోట్ల లోపు ప‌డిపోయినా? ఇప్పటి వరకు ఇండియాలో 992 కోట్ల నెట్ (1185 కోట్ల గ్రాస్) సాధించింది. శుక్రవారంతో 1000 కోట్ల నెట్ మార్క్‌ను అందుకుని `ధురంధర్ ద రివెంజ్` తర్వాత ఆ ఘనత సాధించిన రెండో హిందీ సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. విదేశీ బాక్సాఫీస్ వద్ద `రామాయణ` సాధించిన పురోగతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా, యూకే, ఇండోనే షియా, థాయ్‌లాండ్‌తో పాటు వియత్నాం, కంబోడియా, నేపాల్ వంటి మార్కెట్లలో సినిమా మంచి ఆదరణ పొందుతోంది.

ముఖ్యంగా రామాయణ కథాంశంతో అనుబంధం ఉన్న కంబోడియా, సింగపూర్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. 22 రోజుల్లో ఓవర్సీస్‌లో 64 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు 1777 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. సోనీ పిక్చర్స్ ద్వారా విడుదలవ‌డంతో భారతీయ సినిమాలకు కొత్త మార్కెట్లు కూడా తెరుచుకున్నాయి. స్లోవేకియా, ఉక్రెయిన్, లాట్వియా, జార్జియా, అర్మేనియా, కరేబియన్ దీవుల వంటి దేశాల్లోనూ `రామాయణ` రికార్డు స్థాయి వసూళ్లతో సత్తా చాటింది. 27 దేశాల్లో నంబర్ వన్ భారతీయ చిత్రంగా నిలవడం ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయికి చేరిన తీరును స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం ఆల్‌టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న `రామాయణ` ఇదే జోరు కొనసాగిస్తే వచ్చే వారంలోనే రెండో స్థానానికి చేరుకునే అవకాశాలున్నాయి. `బాహుబలి 2`, `ధురంధర్ 2` వంటి భారీ చిత్రాలను అధిగమించే దిశగా రామాయ‌ణ‌ వసూళ్ల ప్రయాణం సాగుతోంది.

నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో నమిత్ మల్హోత్రా- యశ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా న‌టించారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న‌ ద్విభాగ చిత్రంలో రెండో భాగం 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది.