Begin typing your search above and press return to search.

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

‘రామాయణ పార్ట్-1’ విడుదలైన 14వ రోజున రూ.23.20 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు సాధించింది. అదే రోజున ‘ధురంధర్ 2’ సాధించిన రూ.20.10 కోట్లను అధిగమించింది. దీంతో సినిమా మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లు రూ.844.40 కోట్లకు చేరాయి.

By:  Srikanth Kontham   |   19 Nov 2026 10:38 AM IST
ధురంధర్ 2 డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!
X

దీపావళి కానుకగా రిలీజ్ అయిన `రామాయణ` పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం విడుదలైన రెండు వారాల తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అవుతోంది. ముఖ్యంగా 14వ రోజు కలెక్షన్ల విషయంలో `ధురంధర్ 2`ని మించి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది.

14వ రోజు `రామాయణ` దేశవ్యాప్తంగా 21 వేలకు పైగా షోలతో 23.20 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. దీంతో ఈ సినిమా మొత్తం ఇండియా నెట్ వసూళ్లు 844.40 కోట్లకు చేరుకున్నాయి. గతంలో `ధురంధర్: ది రివెంజ్` 14వ రోజున 20.10 కోట్లు రాబట్టగా.. ఇప్పుడా రికార్డును `రామాయణ` అధిగమించడం విశేషం. తొలి రెండు వారాల్లో `ధురంధర్ 2` 919 కోట్లకు పైగా వసూలు చేసినా? రెండవ‌ బుధవారం నాటి వసూళ్లలో మాత్రం `రామాయణ` పైచేయి సాధించడం సినిమా నిలకడకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ చిత్రాన్ని తెరకెక్కించిన స్థాయి గురించి నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షి స్తున్నాయి. రామాయణ కథ అందరికీ తెలిసిందే అయినా? ఇంత భారీ స్కేల్‌తో హాలీవుడ్ విజువల్ వండర్స్ అయిన `అవతార్`, `అవెంజర్స్` స్థాయిలో కథను ఎప్పుడూ చూడలేదన్నారు. భారతీయ సినిమాలు కూడా అంతర్జాతీయ స్థాయి విజువల్ గ్రాండియర్‌తో తీయగలవని నిరూపించడమే తమ ప్రధాన లక్ష్యమని.. హాలీవుడ్‌తో ఉన్న అంతరాన్ని తగ్గించే ప్రయత్నమే ఇదని పేర్కొన్నారు.

రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటన చిత్రానికి ప్రధాన బలంగా మారాయి. అసోంకు చెందిన చేతితో తయారు చేసిన కేన్-రబ్బర్ కవచంలో రణ్‌బీర్ కనిపించిన తీరు.. పాత్రల కోసం నటీనటులు పడిన కష్టం తెరపై కనిపిస్తోందని ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందిన ప్రాజెక్ట్‌కు ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌తో పాటు యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామ్యం వహించాయి.

రెండు వారాలు గడిచినా వసూళ్ల వేగం ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్న `రామాయణ` మ‌రికొన్ని రోజుల్లో ఇంకెన్ని మైలురాళ్లను దాటుతుందా? అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి భాగం ఇచ్చిన ఊపుతోనే 2027 దీపావళికి రెండో భాగంపై అంచనాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి.