100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!
నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో వస్తున్న ‘వృషకర్మ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మిస్టిక్ థ్రిల్లర్‌కు రూ.200 కోట్ల గ్రాస్ టార్గెట్ అవసరమనే చర్చ జరుగుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.
By: M Prashanth | 20 Nov 2026 9:46 AM ISTనాగచైతన్య 'వృషకర్మ' విషయంలో మామూలు కాన్ఫిడెన్స్‌తో లేరు. ఇటీవల ఓ కాలేజీ ఈవెంట్లో అంచనాలు ఎక్కువగానే పెట్టుకుని థియేటర్లకు రావాలని స్వయంగా చెప్పారు. నార్మల్ గా తన సినిమాల గురించి మరీ ఎక్కువగా గొప్పలు చెప్పుకోని చైతూ ఈసారి మాత్రం గట్టిగానే హామీ ఇస్తున్నారు. పైగా ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు కూడా భారీగా ఖర్చు చేశారు. దీంతో 'వృషకర్మ'పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద పెద్ద టార్గెట్టే కనిపిస్తోంది.
నిజానికి ఈ సినిమా హీరో, దర్శకుడు ఇద్దరూ గత చిత్రాలతో వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినవాళ్లే. నాగచైతన్య 'తండేల్'తో కెరీర్లో తొలిసారి వంద కోట్ల గ్రాస్ అందుకున్నారు. మరోవైపు దర్శకుడు కార్తీక్ దండు 'విరూపాక్ష'తో అదే మార్కును దాటేశారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో గత విజయాలను మించిన కలెక్షన్లు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా 'విరూపాక్ష'తో కార్తీక్ దండు మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. సాయి దుర్గా తేజ్ కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచిన ఆ సినిమాలో మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'వృషకర్మ' కోసం కూడా మిస్టిక్ థ్రిల్లర్ కథనే ఎంచుకున్నారు. అయితే ఈసారి మరింత భారీ స్కేల్లో సినిమా తెరకెక్కించారు. గుహల నేపథ్యంలో సాగే కథ కోసం ప్రత్యేకంగా సెట్స్ నిర్మించడంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక 'వృషకర్మ' బడ్జెట్ దాదాపు వంద కోట్ల వరకు వెళ్లినట్లు సమాచారం. అదే నిజమైతే నాగచైతన్య కెరీర్లో అత్యంత ఖరీదైన సినిమా ఇదే అవుతుంది. 'తండేల్' మొత్తం వసూళ్ల స్థాయిలోనే కొత్త సినిమాకు పెట్టుబడి పెడుతున్నారన్నమాట. పైగా వంద కోట్ల గ్రాస్ వస్తే నిర్మాతకు అంత మొత్తం తిరిగి రాదు. దీంతో గత సినిమాల తరహాలో వంద కోట్ల మార్కు అందుకుంటే సరిపోదు. థియేట్రికల్ బిజినెస్‌కు తగ్గట్టుగా ఇంకా పెద్ద వసూళ్లు అవసరమవుతాయి. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల గ్రాస్ రాబడితేనే రిస్క్ కు తగ్గ ఫలితం అందినట్లు.
మరోవైపు చైతూకు ఇప్పటివరకు మంచి విజయాలు అందించిన సినిమాల్లో లవ్, ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉంది. 'మజిలీ', 'లవ్ స్టోరీ', 'తండేల్' అదే కోవలోకి వస్తాయి. అయితే 'దూత' వెబ్ సిరీస్‌తో థ్రిల్లర్ జానర్లోనూ మెప్పించారు. ఇప్పుడు అలాంటి కథనే భారీ బడ్జెట్‌తో థియేటర్లకు తీసుకొస్తున్నారు. కార్తీక్ దండు గత సినిమాకు ఉన్న క్రేజ్ కూడా తోడైతే చైతూ రెగ్యులర్ మార్కెట్‌ను మించి వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది.
ఇక 'వృషకర్మ' కథ ఒక గుహలో మొదలై ఊహించని ప్రాంతాలకు తీసుకెళ్తుందని చైతూ వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త థియేట్రికల్ అనుభూతి ఇస్తామని కూడా చెప్పారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా ఉంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
