నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!
శర్వానంద్ నటిస్తున్న ‘భోగి’, రష్మిక మందన్న లీడ్ రోల్‌లో వస్తున్న ‘మైసా’ నవంబర్ 27న ఒకేరోజు విడుదల కానున్నాయి. 1960ల తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ‘భోగి’ తెరకెక్కగా, గిరిజన పోరాటం ఆధారంగా ‘మైసా’ రూపొందుతోంది. రెండు యాక్షన్ చిత్రాల బాక్సాఫీస్ పోటీపై ఆసక్తి నెలకొంది.
By: Srikanth Kontham | 21 Nov 2026 2:05 PM ISTడిసెంబర్- జనవరి నెలల్లో భారీ చిత్రాల తాకిడికి ముందే బాక్సాఫీస్ వద్ద సెగ పుట్టించేందుకు `భోగి`, `మైసా` సినిమాలు నవంబర్ 27న ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి. గంగ అనే ఊరమాస్ పాత్రలో శర్వానంద్ కనిపిస్తుంటే.. మరోవైపు గిరిజన నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక మందన్న ఉగ్రరూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒకే రోజు రెండు భిన్నమైన యాక్షన్ డ్రామాలు బరిలోకి దిగడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది.
సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తోన్న `భోగి` కథ 1960ల ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం చుట్టూ తిరుగుతుంది. ముందుగా అనుకున్న తేదీ కంటే కాస్త ఆలస్యంగా వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ లుక్.. ఫిజిక్ పరంగా పూర్తిగా మారిపోయారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `మైసా` పాన్-ఇండియా స్థాయిలో గిరిజన భూముల నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రష్మిక శరీరాన్ని ఎంతో శ్రమకు గురిచేసి యాక్షన్ సన్నివేశాల్లో నటించారని.. షూటింగ్ సమయంలో గాయపడినా? పట్టుదలతో పూర్తి చేసారు. చేతిలో ఆయుధం పట్టి రష్మిక కనిపించిన పోస్టర్లు ఇప్పటికే సినిమాపై అంచనాలు తారా స్థాయికి తీసుకెళ్తున్నాయి.
ఇద్దరు వేర్వేరు జోనర్లలో పక్కా మాస్, యాక్షన్ ఎలిమెంట్లతో వస్తుండటంతో ఈ క్లాష్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే చర్చ మొదలైంది. ఒకటి సరిహద్దు గ్రామాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా కాగా.. మరొకటి అడవి బిడ్డల పోరాటంతో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఏ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా కట్టిపడేస్తుందో చూడాలి.
నవంబర్ 27న వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా రేసులో ఉన్నా? శర్వానంద్-రష్మిక చిత్రాల మధ్య జరిగే పోటీపైనే అందరి దృష్టి నిలిచింది. పండుగ సీజన్ ముగిసిన తర్వాత వస్తున్న వారాంతంలో మాస్ ఆడియన్స్ ఏ వైపు మొగ్గు చూపుతారో చూడాలి. అయితే రష్మిక కెరీర్ లో తొలిసారి నటిస్తోన్న లేడీ ఓరియేంటెడ్ చిత్చమిది. ఇంత వరకూ గ్లామర్ పాత్రల్లోనే అలరించిన అమ్మడు తొలిసారి పాన్ ఇండియాలో సోలోగా సత్తా చాటడానికి సిద్దమైంది. కమర్శియల్ కనాయికగానూ రష్మికకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇప్పుడున్న యువ నాయికల్లో రష్మికదే నెంబర్ వన్ స్థానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. `పుష్ప`..`ఛావా` లాంటి సినిమాలతో ఇండియావైడ్ ఎంత సంచలనమైందో తెలిసిందే.
