భారత్ లో టెస్లా డిజాస్టర్? బుకింగ్స్ చెబుతోంది ఇదేనా?
ఎన్నో అంచనాలు.. మరెన్నో లెక్కలతో భారత మార్కెట్ లోకి వచ్చిన టెస్లాకు షాక్ తగిలిందా? ఏదో అనుకుంటే మరేదో అయ్యిందా?
By: Garuda Media | 3 Sept 2025 9:47 AM ISTఎన్నో అంచనాలు.. మరెన్నో లెక్కలతో భారత మార్కెట్ లోకి వచ్చిన టెస్లాకు షాక్ తగిలిందా? ఏదో అనుకుంటే మరేదో అయ్యిందా? జులై మధ్యలో అమ్మకాలు మొదలు పెట్టిన టెస్లా.. భారతీయుల్ని పెద్దగా ఆకట్టుకోలేదా? అర్భాటంగా అమ్మకాలు షురూ చేసినప్పటికీ.. ఇప్పటివరకు టెస్లా కార్లు బుక్ అయ్యింది కేవలం ఆరువందలే కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రేజీ వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయంటే చాలు.. ఎగబడిపోయి కొనుగోలు చేసే భారతీయులు టెస్లా విషయంలో పెద్దగా రియాక్టు కాకపోవటం ఆసక్తికరంగా మారింది.
జులై మధ్యలో మొదలైన బుకింగ్స్ ఇప్పటివరకు కేవలం 600 మాత్రమే అయినట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది 350 నుంచి 500 వరకు మాత్రమే కార్లను డెలివరీ చేయాలని టెస్లా భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొదటి బ్యాచ్ ఈ నెలలో షాంఘై నుంచి వస్తుందని చెబుతున్నారు. తొలుత తమ కార్లను పరిమిత నగరాల్లో మాత్రమే డెలివరీ చేయాలని టెస్లా భావిస్తోంది.
ఆ సంస్థ తమ కార్లను ముంబయి.. ఢిల్లీ.. ఫూణే.. గురు గ్రామ్ నగరాల్లో మాత్రమే తొలుత డెలివరీ ఇవ్వనున్నారు. ఆ తర్వాతి కాలంలో దేశ వ్యాప్తంగా ఇతర నగరాలకు విస్తరించాలన్న యోచనలో ఉననట్లు చెబుతున్నారు. ఇప్పటికే టెస్లా దేశంలో రెండు డీలర్ షిప్ లను ప్రారంభించింది. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయటంపై ఫోకస్ చేస్తోంది. ఎన్నో అంచనాలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టెస్లా నెలన్నరలో కేవలం 600 కార్లు మాత్రమే బుక్ అయ్యాయి.
సాధారణంగా పరిమితంగా డబ్బులు కట్టి.. కార్లను అడ్వాన్స్ గా బుక్ చేసుకోవటం మొదట్నించి ఉన్నదే. ఇటీవల కాలంలో హైఎండ్ కార్లను సైతం బుకింగ్ స్టార్ట్ చేశారో లేదో.. వేలాది కార్లకు అడ్వాన్స్ బుకింగ్ లు కట్టే ధోరణి చూస్తున్నాం. అందుకు భిన్నంగా కేవలం 600 కార్లు మాత్రమే బుక్ కావటం.. డెలివరీ సమయానికి ఇందులో ఎన్ని పక్కాగా డెలివరీ అవుతాయి? మరెన్ని క్యాన్సిల్ అవుతాయన్నది ఇప్పుడో ప్రశ్నగా చెప్పాలి.
ఇంతకూ టెస్లాకు భారత్ లో స్పందన అంతంతమాత్రంగా ఎందుకు ఉంది? అన్నప్రశ్నలోకి వెళితే.. భారత్ మార్కెట్ లోకి ఎంట్రీ వేళ.. కేవలం ఒక్క కారును మాత్రమే అందుబాటులో ఉంచటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఎంట్రీ లెవల్ మోడల్ అయిన వై రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ను మాత్రమే అందుబాటులో ఉంచారు. దీని ఎక్స్ షోరూం ధర రూ.59.89 లక్షలు. రెండో వేరియంట్ లాంగ్ రేంజ్ ఆర్ డబ్ల్యూడీ. దీని ధర రూ.67.89 లక్షలు. ఈ రెండు వేరియంట్ ను ఈ నెల మూడో వారం నుంచి డెలివరీ చేయనున్నారు.
వై సిరీస్ లో మొదటి వేరియంట్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 500కి.మీ. రేంజ్ అందిస్తుంది. రెండో వేరియంట్ మీద ఒకసారి ఛార్జ్ చేస్తే 622కి.మీ. రేంజ్ ను అందిస్తుంది. ఈ రెండు మోడళ్ల టాప్ స్పీడ్ గంటకు 201కి.మీ. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తాయని చెబుతున్నారు. ఒకే మోడల్ ను మార్కెట్లోకి తీసుకురావటం.. ఎలక్ట్రిక్ కారు కావటం.. ఇటీవల కాలంలో అమెరికా ఉత్పత్తుల విషయంలో భారతీయుల్లో వస్తున్న మార్పు టెస్లా బుకింగ్ లలో కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనపై త్వరపడి వ్యాఖ్య చేసే కన్నా.. కాస్తంత వెయిట్ చేస్తేనే మంచిదని చెప్పకతప్పదు.
