Begin typing your search above and press return to search.

ఫెయిల్ అయితే అంతే.. ఎలన్ మస్క్ భరించడు.. వదిలించుకుంటాడిలా..

టెస్లా సైబర్ ట్రక్ అమ్మకాలు అంచనాలను అందుకోకపోవడంతో 2027 నాటికి దాని తయారీని నిలిపివేయాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఏటా 2.5 లక్షల వాహనాల విక్రయ లక్ష్యానికి బదులుగా గతేడాది కేవలం 20,237 ట్రక్కులే అమ్ముడయ్యాయి. దీంతో మస్క్ ఇప్పుడు డ్రైవర్‌లెస్ సైబర్ టాక్సీపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

By:  A.N.Kumar   |   7 Nov 2026 8:03 AM IST
ఫెయిల్ అయితే అంతే.. ఎలన్ మస్క్ భరించడు.. వదిలించుకుంటాడిలా..
X

భవిష్యత్తు నుంచి ఊడిపడినట్లు ఉండే డిజైన్.. బుల్లెట్ తగిలినా ఏమీ కాదన్న బిల్డప్.. ఆటోమొబైల్ రంగాన్నే ఊపేస్తామని టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన హంగామా గుర్తుందిగా.. ఆ ‘సైబర్ ట్రక్’ ప్రయోగం ఇప్పుడు తుస్సుమంది.. రోడ్డు మీదకి వస్తే సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్లు ఉంటుందని డబ్బా కొట్టిన ఈ వింత వాహనం.. చివరకు మస్క్ జేబుకే కాస్త పెద్ద చిల్లు పెట్టింది. దీంతో "ఫెయిల్ అయితే నాకేంటి... కస్టమర్లకేంటి... పక్కన పడేయ్" అంటూ 2027 నాటికి దీని తయారీకి మంగళం పాడటానికి మస్క్ రెడీ అయిపోయారని టాక్.

2019లో డెమో ఇచ్చినప్పుడు ఏకంగా అద్దాలు పగిలిపోయినా సరే “డిజైన్ అద్భుతం” అంటూ టెస్లా ఫ్యాన్స్ భజన చేశారు. 2023లో మార్కెట్లోకి వచ్చాక లక్షల్లో బుకింగ్స్ వచ్చాయని గొప్పలు చెప్పుకున్నారు. మస్క్ మామ ఏకంగా ఏటా 2.50 లక్షల ట్రక్కులు అమ్ముతామని భారీ టార్గెట్ పెట్టారు. తీరా చూస్తే గతేడాది అమెరికా అంతటా కలిసి అమ్ముడైంది కేవలం 20,237 వాహనాలు మాత్రమే.. అనుకున్న దాంట్లో పదో వంతు కూడా దాటలేదన్నమాట. భారీ ఆశలు పెట్టుకుంటే మార్కెట్ గట్టిగా మొట్టికాయ వేసింది.

అసలు సమస్యల్లా ఈ ట్రక్ డిజైనే.. ఏరోడైనమిక్స్ పేరుతో ఇనుప పెనెటి లాంటి షేప్.. మెరిసిపోయే స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీని చూసి కొందరు మురిసిపోయినా సాధారణ జనాలు మాత్రం "ఇదేందయ్యా ఇది.. రోడ్డు మీద చూస్తే భయమేస్తోంది" అని దండం పెట్టేశారు. దానికి తోడు కొండంత ధర.. సందుల్లో తిప్పలేని సైజు.. రోజూ దాన్ని మెయింటెన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారడంతో కొనేనాథుడే కరువయ్యాడు. "డిజైన్ కొత్తగా ఉంటే సరిపోదు రాజా.. నడపడానికి వీలుగా ఉండాలి" అని కస్టమర్లు గట్టిగానే పాఠం చెప్పారు.

ఎలన్ మస్క్ నైజమే అంతేగా.. ఒక బొమ్మ క్లిక్ అవ్వకపోతే దాన్ని పక్కన పడేసి.. వెంటనే ఇంకో కొత్త బొమ్మతో మార్కెట్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు సైబర్ ట్రక్ కథ ముగిసిపోవడంతో దృష్టిని 'సైబర్ టాక్సీ' వైపు మళ్లించారు. డ్రైవర్ లేకుండా నడిచే రోబో టాక్సీలతో ప్రపంచాన్ని ఏలేస్తామని మళ్లీ కొత్త కబుర్లు చెప్తున్నారు. అయితే అక్కడా పర్మిషన్లు.. సేఫ్టీ రూల్స్ రూపంలో పెద్ద పెద్ద గుంతలే ఉన్నాయి.

సైబర్ ట్రక్ రూపంలో మస్క్ బాబుకి గట్టి షాకే తగిలింది. మరి ఈ సైబర్ టాక్సీ అయినా సరిగ్గా నడుస్తుందో లేక అదీ సైబర్ ట్రక్ దారినే పడుతుందో వేచి చూడాల్సిందే..