'రీబర్త్ ఆఫ్ ఎ లెజెండ్'... సియారా వచ్చేసింది.. రికార్డ్స్ సృష్టించింది!
ఇటీవల నివేదికల ప్రకారం.. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ నవంబర్ 2025లో బలమైన పనితీరును నమోదు చేసిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 17 Dec 2025 7:21 PM ISTఇటీవల నివేదికల ప్రకారం.. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ నవంబర్ 2025లో బలమైన పనితీరును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మొత్తం దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు 25.6% పెరిగి 59,199 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ సమయంలో టాటా మోటార్స్ మరో రికార్డ్ ని నమోదు చేసింది. తన కొత్త కారు విడుదల చేయగా, ఒక్క రోజులో 70వేల బుక్కింగ్స్ వచ్చాయి.
అవును... టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సియెర్రాను భారత మార్కెట్ లో నవంబర్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బుక్కింగ్స్ ఇటీవల ప్రారంభించగా.. మొదటి రోజు (డిసెంబర్ 16) రికార్డ్ స్థాయిలో అన్నట్లుగా 70,000 బుక్కింగ్స్ వచ్చాయి. మరో వైపు అదనంగా 1.35 లక్షల మంది కస్టమర్లు తమకు నచ్చిన కాన్ఫిగరేషన్ ను సమర్పించారని సంస్థ ప్రకటించింది.
వాస్తవానికి టాటా మోటార్స్ సియారాను తొలిసారి 1991లో విడుదల చేసి, 2003లో నిలిపేసింది. ఈ క్రమంలో సుమారు రెండు దశాబ్ధాల తర్వాత ఇప్పటి అవసరాలు, హంగులను చేర్చి అప్ డేటెడ్ వెర్షన్ ను మళ్లీ తీసుకొచ్చింది. అయితే.. లుక్ విషయంలో అప్పటి రెట్రో లుక్ నే కొనసాగించిన టాటా మోటార్స్.. దీన్ని 'రీబర్త్ ఆఫ్ ఎ లెజెండ్'గా అభివర్ణించింది. దీని ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఇంజిన్ విషయానికొస్తే...
కొత్త సియారా పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ ఆప్షన్లలోనూ లభిస్తుంది. ఇందులో భాగంగా... 1.5 లీటర్ల నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.. 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్.. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమెటిక్, మాన్యువల్ ఆప్షన్స్ తో వస్తోండగా.. టర్బో డీజిల్ ఇంజిన్ కూడా 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ కు సపోర్ట్ చేస్తుంది.
భద్రతా విషయానికొస్తే...
ఇందులో మొత్తం 20 కంటే ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. స్టాండర్డ్ గా ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉన్నాయి. ఈ క్రమంలో.. సీటు బెల్టు, ఎయిర్ బ్యాగ్ లు మెరుగ్గా పనిచేసేందుకు సీట్ బెల్ట్ యాంకర్ ప్రీ టెన్షనర్లు అమర్చారు. దీని భద్రతను పరీక్షించేందుకు సియారాను, మరో సియారాతో రియల్ లైఫ్ లో ఢీకొట్టించగా.. ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ భద్రతను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.
అదనపు విషయాలు...
ఇక.. పనోరమిక్ సన్ రూఫ్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇదే సమయంలో... డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, ఇన్ బిల్ట్ 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చారు. జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్న ఈ సియారా కార్లు.. రెడ్, వైట్, ఎల్లో, సిల్వర్, గ్రీన్, మింటల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
