రెండుగా విడిపోతున్న టాటా మోటార్స్.. షేర్లపై క్లారిటీ!
వాహన దిగ్గజంగా పేరు సొంతం చేసుకున్న టాటా మోటార్స్ ఇప్పుడు రెండు భాగాలుగా విడిపోతోంది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
By: Madhu Reddy | 20 Sept 2025 11:52 AM ISTవాహన దిగ్గజంగా పేరు సొంతం చేసుకున్న టాటా మోటార్స్ ఇప్పుడు రెండు భాగాలుగా విడిపోతోంది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలా విడిపోవడానికి గల కారణాలు ఏంటి ? ఇందులోని షేర్ల వాటా సంగతి ఏంటి? అంటూ పలు విషయాలపై ఆరాతీస్తూ ఉండడం గమనార్హం.
అసలు విషయంలోకి వెళ్తే.. దిగ్గజ వాహన తయారీ సంస్థగా పేరు దక్కించుకున్న టాటా మోటార్స్ తన వ్యాపారాన్ని 2 కంపెనీలుగా విభజించే డీమెర్జర్ ప్లాన్ 2024 మార్చి20లోనే ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తవుతుంది అనే అంశంపై టాటా సన్స్, టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా గతంలోనే స్పష్టత ఇచ్చారు.
ఈ ఏడాది చివరి నాటికి టాటా మోటార్ సంస్థ రెండు కంపెనీలుగా మారబోతోందని తెలిపిన ఆయన అక్టోబర్ 1 నుండి ఈ కంపెనీ రెండు భాగాలుగా మారబోతోంది అంటూ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.." కమర్షియల్ వెహికల్ వ్యాపారం అభివృద్ధి చెందే విధానం, ప్యాసింజర్ వెహికల్ వ్యాపారం అభివృద్ధి చెందే విధానం.. రెండు వేరుగా ఉంటాయి.. గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ మూడు యూనిట్లు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. బలమైన బ్యాలెన్స్ షీటును కూడా కలిగి ఉన్నాయి" అంటూ గుర్తు చేశారు.
షేర్ విభజన విషయానికి వస్తే 1:1 నిష్పత్తిగా నిర్ణయించారు. అంటే టాటా మోటార్స్ కి చెందిన ప్రతి షేర్ కి వాటా దారులు కమర్షియల్ వ్యాపారాన్ని కలిగి ఉండే కొత్త కంపెనీలో కూడా ఒక షేర్ ను పొందుతారు అని రెండు కంపెనీల షేర్లు ఒక్కొక్కటి రూ.2 ముఖ విలువ కలిగి ఉంటాయని స్పష్టం చేశారు.
ఇకపోతే టాటా మోటార్స్ రెండుగా విభజించిన తర్వాత అంటే కమర్షియల్, ప్రయాణికుల వాహన వ్యాపారాలను విడదీస్తూ.. అక్టోబర్ 1 నుండి ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. అలా తాజాగా విడదీసిన కమర్షియల్ వెహికల్స్ కంపెనీకి.. "టాటా మోటార్స్ లిమిటెడ్ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్" అనే కొత్త కంపెనీగా పేరు పెట్టనున్నట్లు సమాచారం. అయితే కస్టమర్లు మాత్రం ప్రయాణికుల వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు అలాగే లగ్జరీ బ్రాండ్ జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి వెహికల్స్ ను ప్రస్తుత సంస్థతోనే కొనుగోలు చేయవచ్చు అని స్పష్టం చేశారు.
టాటా మోటార్స్ లిమిటెడ్ (TML) దాని వాణిజ్య వాహన వ్యాపారాన్ని ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు అలాగే సంబంధిత పెట్టుబడులన్నింటినీ కూడా టాటా మోటార్స్ లిమిటెడ్ కమర్షియల్ వెహికల్ గా విభజిస్తోంది. అలాగే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లోని వ్యాపారం ఇప్పటికే ఉన్న లిస్టెడ్ టాటా మోటార్స్ లిమిటెడ్ లో తిరిగి విలీనం అవుతుందని, అటు టాటా మోటార్స్ లిమిటెడ్ కింద వాణిజ్య వ్యవహార వ్యాపారం సంబంధిత పెట్టుబడులు వస్తే.. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారం, జే.ఎల్.ఆర్ సంబంధిత పెట్టుబడులతో సహా ప్యాసింజర్ వెహికల్స్ వ్యాపారం అందుబాటులో ఉంటుంది.
