అవును.. ఈ ఆటోకు డ్రైవర్ ఉండరు.. మన మార్కెట్లోకి వచ్చేస్తోంది
ఈ స్వయంగతి ఆటోను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 120 కి.మీ. వరకు ప్రయాణించే వీలుంది. ఈ ఆటో 10.3కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఉంటుంది.
By: Garuda Media | 1 Oct 2025 5:00 PM ISTడ్రైవర్ లేని కారు గురించి విన్నాం.ఇప్పుడు దేశీయ మార్కెట్లో మరో సంచలనానికి తెర తీస్తూ.. ఒమోగా సంస్థ డ్రైవర్ లేని ఆటోలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఆ సంస్థ షేర్ చేస్తోంది. ఈ ఆటో ప్రత్యేకత ఏమంటే.. ఇది ఏఐ ఆధారితంగా పని చేసే ఎలక్ట్రికల్ వెహికిల్. రెండు వెర్షన్ లలో దీన్నిమార్కెట్లోకి తీసుకురానున్నారు. స్వయంగతి పేరుతో విడుదల కానున్న ఈ ఎలక్ట్రికల్ ఆటో ధరల విషయానికి వస్తే.. ప్యాసింజర్ వెర్షన్ ధర ఎక్స్ షోరూం రూ.4 లక్షలతో మొదలు కానుంది. అదే.. కార్గో వెర్షన్ అయితే రూ.4.15 లక్షల ఎక్స్ షోరూం ధరకు మొదలు కానున్నాయి.
ఈ డ్రైవర్ లేని ఆటోల ముందస్తు బుకింగ్ లు మొదలయ్యాయి. త్వరలోనే డెలివరీలు చేస్తామని పేర్కొన్న ఒమెగా కంపెనీ.. తమ ఆటో పని తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ స్వయంగతి ఆటోను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 120 కి.మీ. వరకు ప్రయాణించే వీలుంది. ఈ ఆటో 10.3కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఉంటుంది.
తమ ఆటోలకు ఏఐ ఆధారిత అటానమీ సిస్టం ఉందని పేర్కొంటూ లైడార్ టెక్నాలజీ.. జీపీఎస్.. ఆరు కిలోమీటర్ల దూరం వరకు ఉండే అడ్డంకుల్ని గుర్తించే సెన్సార్లు.. మల్టీ సెన్సర్ నావిగేషన్.. రిమోట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అయితే..ఈ వాహనానికి అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాల మీద మాత్రం కంపెనీ ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. డ్రైవర్ లేకుండా నడిచే ఈ ఆటో.. ముందుగా మ్యాప్ చేసిన మార్గంలో ప్రయాణిస్తుంది.
తాము నిర్వహించిన మొదటి దశ పరీక్షలు సక్సెస్ అయ్యాయని.. రెండో దశ పరీక్షల్ని త్వరలో నిర్వహిస్తామని సంస్థ వెల్లడించింది. ఈ డ్రైవర్ లెస్ ఆటోల్ని టెక్ పార్కులు.. గేటెడ్ కమ్యూనిటీలు.. పారిశ్రామిక ప్రాంతాలు.. స్మార్ట్ సిటీల్లో ఈ ఆటోల్ని తొలుత తీసుకొచ్చే ఆలోచనలో కంపెనీ ఉంది. మొత్తంగా రానున్న రెండేళ్లలో 1500 ఆటోలను ఉత్పత్తి చేయటం లక్ష్యంగా సంస్థ పెట్టుకుంది.
భారత రవాణా మార్కెట్లో సరికొత్త సంచలనంగా మారిన ఈ డ్రైవర్ లెస్ ఆటోలు రవాణా రంగంలో ఒక కొత్త తరహా మార్కెట్ కు తెర తీశాయని చెప్పాలి. దేశీయంగా డెవలప్ చేసిన ఈ ఆటో అందరికి అందుబాటు ధరలో ఉండేలా తీసుకొచ్చినట్లుగా ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఉదయ్ నారాంగ్ చెబుతున్నారు. స్వదేశీ టెక్నాలజీతో ప్రపంచానికి మార్గదర్శనం కావొచ్చన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే వేళలో హాట్ టాపిక్ గా మారిన ఈ డ్రైవర్ లెస్ ఆటోలు.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారతాయో చూడాలి.
