Begin typing your search above and press return to search.

దేశంలో మరెక్కడా లేని ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో!

తెలుగోళ్ల అభిరుచిని తెలియజేసే ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. లగ్జరీ కార్లు.. అందునా ఎలక్ట్రిక్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తెగ మోజు పడుతున్నారట.

By:  Garuda Media   |   19 Nov 2025 1:57 PM IST
దేశంలో మరెక్కడా లేని ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో!
X

తెలుగోళ్ల అభిరుచిని తెలియజేసే ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. లగ్జరీ కార్లు.. అందునా ఎలక్ట్రిక్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తెగ మోజు పడుతున్నారట. అంతకంతకూ వీటి డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని ప్రఖ్యాత లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా వెల్లడించింది. బెంజ్ కార్ల అమ్మకాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఆ కంపెనీకి ఎంతో కీలకంగా చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు.

టాప్ ఎండ్ లగ్జరీ కార్లు.. బీఈవీ విభాగంలో ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలు టాప్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. దేశంలో ప్రతి ఏడాది 50 వేలకు పైగా లగ్జరీ కార్ల అమ్మకాలు నమోదు అవుతుంటే.. ఇందులో బెంజ్ కార్ల వాటా 45 శాతంతో టాప్ బ్రాండ్ గా కొనసాగుతోంది. ఇక.. లగ్జరీ కార్ల అమ్మకాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 15 శాతంగా ఉంది. ఇక.. ఎలక్ట్రిక్ కార్ల వాటా సగటున ఎనిమిది శాతంతో ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంతకు మించి ఉండటం ఆసక్తికర అంశంగా చెబుతున్నారు.

టాప్ ఎండ్ లగ్జరీ కార్లకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదరణ నేపథ్యంలో దేశంలోనే తొలిసారి హైదరాబాద్ లో స్పెషల్ గా మేబాక్ లాంజ్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా బెంజ్ కార్ల సంస్థ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన సానుకూల పన్ను విధానాలు.. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలతో పాటు అధిక ఆదాయ వర్గాల వారు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ అమ్మకాలు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు.

మెర్సిడెస్ బెంజ్ కార్ల విషయానికి వస్తే.. ప్రతి ఏడాది మహారాష్ట్ర.. ఫూణె సమీపంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ లో ప్రతి ఏడాది 20 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లుగా బెంజ్ సంస్థ తెలియజేస్తోంది. గత ఏడాది బెంజ్ కార్ల అమ్మకాలు 19,500 యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది అంతే స్థాయిలో ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే.. వచ్చే ఏడాది జనవరి నుంచి మాత్రం బెంజ్ కార్ల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.మారకం ధరల్లో వచ్చిన మార్పులు.. రూపాయి బలహీనంగా ఉండటం కూడా దీనికి కారణంగా చెప్పక తప్పదు.