మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!
మరి, మన పాత మారుతి 800 కారు లంబోర్గినిలా మారి ఎదురుగా వస్తే? వినడానికి మ్యాజిక్‌లా ఉన్నా, దీన్ని నిజం చేసి చూపించాడు ఝార్ఖండ్‌కు చెందిన ఒక సామాన్య మెకానిక్
By: Madhu Reddy | 4 March 2026 10:40 AM ISTకోట్ల రూపాయలు విలువ చేసే లంబోర్గిని కారును రోడ్డు మీద చూస్తేనే మనం ఆశ్చర్యపోతాం. మరి, మన పాత మారుతి 800 కారు లంబోర్గినిలా మారి ఎదురుగా వస్తే? వినడానికి మ్యాజిక్‌లా ఉన్నా, దీన్ని నిజం చేసి చూపించాడు ఝార్ఖండ్‌కు చెందిన ఒక సామాన్య మెకానిక్. కేవలం నాలుగు లక్షల ఖర్చుతో, తన రెండేళ్ల కష్టాన్ని రంగరించి సృష్టించిన ఈ 'దేశీ లంబోర్గిని' ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఆరిఫ్ చేసిన ఈ క్రేజీ ప్రయోగం విశేషాలు ఓ లుక్ వేద్దాం ..
సామాన్యుడి అసాధారణ కల - మారుతి టూ లంబోర్గిని:
ఝార్ఖండ్‌లోని చాండిల్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్ పదేళ్లుగా ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తున్నాడు. ఎప్పటికైనా ఒక లగ్జరీ కారును సొంతం చేసుకోవాలనేది అతని కోరిక. కానీ కోట్లు ఖరీదు చేసే లంబోర్గిని కొనడం కష్టమని తెలిసి, తన దగ్గరున్న మారుతి 800 కారునే అలా మార్చాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఎక్కడా వెనకడుగు వేయకుండా, దాదాపు రెండేళ్ల పాటు పగలు రాత్రి కష్టపడి కారు రూపురేఖలనే మార్చేశాడు. ఇక పాత మారుతి ఇంజిన్‌ను అలాగే ఉంచుతూ, బాడీని మాత్రం లంబోర్గిని అవెంటడోర్ మోడల్‌కు ఏమాత్రం తీసిపోకుండా డిజైన్ చేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాడు.
సొంత తెలివితేటలతో అద్భుత సృష్టి:
ఈ కారును తయారు చేయడానికి ఆరిఫ్ బయట కంపెనీలపై ఆధారపడలేదు. బాడీ డిజైన్ చేయడం నుంచి, ఐరన్ షీట్లను కట్ చేయడం, వెల్డింగ్ చేయడం వరకు అన్ని పనులు తనే స్వయంగా చేసుకున్నాడు. ఇక దాదాపు ₹4 లక్షల బడ్జెట్‌లో దీనిని పూర్తి చేశాడు. అయితే కారుకు ప్రీమియం లుక్ రావడం కోసం మ్యూజిక్ సిస్టమ్, పవర్‌ఫుల్ LED లైట్లు, ఫ్రంట్ గ్లాస్ వంటి కొన్ని విడిభాగాలను మాత్రం బయటి నుంచి తెప్పించుకున్నాడు. చూసేవారికి ఇది మారుతి కారు అంటే నమ్మలేనంతగా, లంబోర్గిని సిగ్నేచర్ స్టైల్ అయిన 'సిజర్ డోర్స్' కూడా ఇందులో అమర్చడం మరో విశేషం.
ప్రతిభకు నీరాజనాలు.. సోషల్ మీడియాలో వైరల్:
ఇక ఆరిఫ్ తయారు చేసిన ఈ కారు ఇప్పుడు స్థానికంగానే కాకుండా ఇంటర్నెట్‌లో కూడా తెగ వైరల్ అవుతోంది. రోడ్డు మీద ఈ కారు వెళ్తుంటే జనం ఆగి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. "మ్యాజిక్ చేసిన మెకానిక్" అంటూ నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సరైన వనరులు, బడ్జెట్ ఉంటే మన దేశీ ప్రతిభ ప్రపంచ స్థాయి కార్లను కూడా సవాలు చేయగలదని ఆరిఫ్ నిరూపించాడు. ఖరీదైన కార్లు కొనలేకపోయినా, తనకున్న నైపుణ్యంతో కలల కారును సాకారం చేసుకున్న ఆరిఫ్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
