Begin typing your search above and press return to search.

విదేశాల్లో భారత బైకుల హవా మామూలుగా లేదుగా

విదేశీ బైకులకు.. కార్లకు మన దేశంలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇవి అందరికి అందుబాటులో ఉండేవి కావు.

By:  Garuda Media   |   5 Feb 2026 10:47 AM IST
విదేశాల్లో భారత బైకుల హవా మామూలుగా లేదుగా
X

విదేశీ బైకులకు.. కార్లకు మన దేశంలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇవి అందరికి అందుబాటులో ఉండేవి కావు. సంపన్న వర్గాలకు మాత్రమే చేరువ అయ్యే పరిస్థితి. అందుకు భిన్నంగా కొన్ని దేశాల్లో భారతదేశానికి చెందిన మోటార్ బైకులకు యమా క్రేజ్ ఉండటమే కాదు.. జపాన్, చైనా దేశాల బైక్స్ ను మించిన ఆదరణ సొంతం చేసుకున్న ఆసక్తికర అంశంగా దీన్నిచెప్పాలి. అవును.. కొన్నిదేశాలు బుర్కినాఫోసో, ఐవరీ కోస్ట్, గ్వాటెమాలా, హోండురాస్ లాంటి దేశాల్లో సెకండ్ హ్యాండ్ బైక్ లైనప్పటికి ఫారిన్ వే వాడటం కనిపిస్తుంది. ఈ దేశాలతో పాటు బ్రెజిల్, నైజీరియా, కొలంబియాలోనూ భారత తయారీ బైకులకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో మన బజాజ్, హీరో, టీవీఎస్ లాంటి కంపెనీల టూవీలర్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. గత ఏడాది ఏకంగా 43 లక్షల టూవీలర్లను భారత్ ఆయా దేశాలకు ఎగుమతి చేసింది. నైజీరియా, కొలంబియా,బ్రెజిల్ లాంటి దేశాల్లో పౌరులు వాడే ప్రతీ పది బైకుల్లో ఏడు మన దేశానికే చెందినవి కావటం గమనార్హం. ఈ దేశాల్లో గతంలో జపాన్, చైనా టూవీలర్లకు అత్యధిక ఆదరణ ఉండేది. కానీ.. గడిచిన పదిహేనేళ్లలో ఆ తీరులో మార్పు వచ్చేలా చేయటంలో భారత్ కు చెందిన టూవీలర్ల కంపెనీలు సక్సెస్ అయ్యాయి.

ఎందుకిలా? అంటే.. జపాన్ బైక్ రేట్లు భారీగా పెరగటం.. చైనా బైకుల్లో నాణ్యతాపరమైన లోపాలు ఉండటం. అందుకు భిన్నంగా భారత్ బైకులు మాత్రం అటు నాణ్యత పరంగా.. ఇటు ధర పరంగా అందరికి అందుబాటులో ఉండటంతో వీటి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడీ దేశాల్లో ఎలక్ట్రిక్ బైకుల విషయంలో చైనా జోరు ఉన్నప్పటికి.. రానున్న రోజుల్లో ఈ మార్కెట్ లోనూ భారత్ తన సత్తా చాటుతుందని చెబుతున్నారు. ఈ దేశాల్లో జపాన్ బైక్ ధరలు 1500 డాలర్ల నుంచి 5 వేల డాలర్ల వరకు ఉంటే.. చైనా బైకులు 800 డాలర్ల నుంచి 1200 డాలర్లకు లభిస్తున్నాయి.

ఇందుకు భిన్నంగా భారత్ బైకులు మాత్రం 900డాలర్ల నుంచి 1500 డాలర్ల మధ్యలో ఉంటున్నాయి. అన్నింటికి మించి ఈ బైకులు నాణ్యత విషయంలో.. అమ్మకం తర్వాత సర్వీసు విషయంలోనూ.. స్పేర్ పార్ట్స్ విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించటాన్నిఇష్టపడుతున్నారు. ఈ దేశాల్లోనే కాదు.. అగ్రరాజ్యం అమెరికాలోనూ మన ఎన్ ఫీల్డ్ కు విపరీతమైన ఆదరణ ఉందని చెబుతున్నారు. అమెరికాలోని 47 రాష్ట్రాల్లో (మొత్తం 50 రాష్ట్రాలు ఉంటాయి) ఎన్ ఫీల్డ్ కు 152 డీలర్ షిప్ లు ఉండటం గమనార్హం. క్లాసిక్ 350, హిమాలయన్ 45, ఇంటర్ సెప్టార్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మెటియోర్ 650 లాంటి మోడళ్లను అమెరికన్లు ఆదరణిస్తున్నారు. అగ్రరాజ్యంలోనే కాదు యూరోప్ లోనూ మన బుల్లెట్లు అమెరికన్ ఫేమస్ టూవీలర్ హార్లే డేవిడ్సన్ కు గట్టి పోటీ ఇవ్వటం చూస్తే.. మన బైక్ లు ఎంతటి ఆదరణను మూటకట్టుకుంటున్నది అర్థమవుతుంది.