Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

సర్కారు కాస్త ట్యాక్స్ బాదుడు తగ్గించిందో లేదో... మనోళ్లు ఆ రోడ్లు ఖాళీగా ఉంటే ఒట్టు అన్నట్లు షోరూమ్‌లపై పడి ఎగబడి పడిపోతున్నారు

By:  A.N.Kumar   |   24 Sept 2026 8:00 AM IST
మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో కార్లను ఎగబడి కొనేలా చేస్తోంది..
X

సర్కారు కాస్త ట్యాక్స్ బాదుడు తగ్గించిందో లేదో... మనోళ్లు ఆ రోడ్లు ఖాళీగా ఉంటే ఒట్టు అన్నట్లు షోరూమ్‌లపై పడి ఎగబడి పడిపోతున్నారు. జీఎస్టీ 2.0 దెబ్బకి పన్ను రేట్లు కాస్త దిగొచ్చేసరికి, ఇంట్లో కనీసం కాఫీ పొడి ఉందో లేదో పట్టించుకోని బాపతు కూడా ఏకంగా నాలుగేసి చక్రాల ఎస్.యూవీలను గేటు ముందుకు తెచ్చి పడేస్తున్నారు. ఈ అమాంతం పెరిగిన మోజు చూస్తుంటే "లీటరు పెట్రోల్ వంద దాటినా పర్లేదు బాబోయ్.. పక్కింటోడి కంటే మన కారే పొడవుండాలి" అనే కాన్సెప్ట్ ఇండియన్ కుర్రోళ్లలో గట్టిగా నాటుకుపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో జీఎస్టీ 2.0 సంస్కరణలు సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చాయి. వాహనాలపై పన్ను భారం తగ్గడంతో కార్ల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రావడమే కాకుండా వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. దీని ఫలితంగా ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ ఊహించని స్థాయిలో పుంజుకుంది. ముఖ్యంగా ఎస్.యూవీలు, ఎంపీవీలతో కూడిన యుటిలిటీ వెహికల్ విభాగం ఈ చారిత్రాత్మక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌లా నిలిచింది.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. దేశీయ కార్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అక్టోబర్ 2024 నుంచి ఆగస్టు 2025 మధ్య కాలంలో 38,95,262 యూనిట్లుగా ఉన్న ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు.. అక్టోబర్ 2025 నుంచి ఆగస్టు 2026 నాటికి ఏకంగా 22.28 శాతం పెరిగి 47,63,285 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే ఒక్క ఏడాది వ్యవధిలోనే మార్కెట్‌లోకి కొత్తగా 8,68,023 వాహనాలు చేరడం విశేషం. గతంలో నెలకు సగటున 3.54 లక్షల యూనిట్లు అమ్ముడవగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 4.33 లక్షల యూనిట్లకు పెరిగింది. జీఎస్టీ సంస్కరణల తర్వాత గడిచిన 11 నెలల్లో దాదాపు 9 నెలలు నెలవారీ విక్రయాలు 4 లక్షల మార్కును దాటడం మార్కెట్ బలానికి నిదర్శనం.

ఈ మొత్తం వృద్ధిలో యుటిలిటీ వెహికల్స్‌దే అగ్రభాగం కావడం గమనార్హం. వినియోగదారులు సాధారణ కార్ల కంటే ఎస్.యూవీల వైపు ఎక్కువుగా మొగ్గు చూపుతున్నారు. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 24,96,302 యూనిట్ల నుంచి 24.69 శాతం పెరిగి 31,12,650 యూనిట్లకు చేరాయి. మార్కెట్‌లో పెరిగిన మొత్తం అదనపు అమ్మకాలలో దాదాపు 75 శాతం వాటా ఒక్క ఎస్.యూవీలు, ఎంపీవీలు రంగానిదే కావడం విశేషం. మరోవైపు ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 15.71 శాతం పెరిగి 13,68,853 యూనిట్లకు చేరుకోగా.. వ్యాన్ అమ్మకాలు 13.67 శాతం పెరిగి 1,53,918 యూనిట్లుగా నమోదయ్యాయి.

జీఎస్టీ 2.0 కింద చిన్న కార్లపై పన్ను రేటును 18 శాతానికి తగ్గించగా.. మధ్యస్థ , పెద్ద కార్లకు 40 శాతం ఫ్లాట్ జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలకు 5 శాతం పన్ను కొనసాగిస్తున్నారు. దీనివల్ల వాహనాల ఆన్-రోడ్ ధరలు తగ్గి కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. కేవలం పన్ను తగ్గింపు మాత్రమే కాకుండా పండుగ సీజన్ డిమాండ్.. బ్యాంకింగ్ రంగంలో తగ్గిన ఫైనాన్సింగ్ వడ్డీ రేట్లు.. ప్రముఖ సంస్థలైన మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా నుంచి వచ్చిన కొత్త మోడళ్లు ఈ అమ్మకాల జోరుకు మరింత బలాన్నిచ్చాయి. తక్కువ పన్ను భారం, సులభమైన ఫైనాన్స్ సౌకర్యాల వల్ల రాబోయే రోజుల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆటో పరిశ్రమ నిపుణులు విశ్వసిస్తున్నారు.

‘4 లక్షలు’ దాటిన నెలవారీ మార్కెట్

జీఎస్టీ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత 11 నెలల కాలంలో తొమ్మిది నెలలు ప్యాసింజర్ వెహికల్ హోల్‌సేల్ అమ్మకాలు 4 లక్షల యూనిట్ల మార్కును దాటాయి. గత కాలంలో ఈ స్థాయి అమ్మకాలు కనిపించకపోవడం గమనార్హం. దీంతో నెలకు 4 లక్షలకు పైగా ప్యాసింజర్ వాహనాల విక్రయాలు మార్కెట్‌లో కొత్త స్థాయిగా మారుతున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలు కూడా మెరుగైన ధరల అందుబాటు.. పెరిగిన డిమాండ్‌ను ప్రస్తావించాయి. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ వాహనాలపై డిమాండ్ పెరగడం.. ఎస్.యూవీ అమ్మకాలు కొనసాగడం ఆటో రంగానికి కీలక సంకేతాలుగా మారాయి.

అంటే జీఎస్టీ 2.0 తర్వాత భారత కార్ల మార్కెట్‌లో కేవలం అమ్మకాల సంఖ్య పెరగడం మాత్రమే కాదు.. కొనుగోలుదారుల ఎంపికలో కూడా మార్పు కనిపిస్తోంది. తక్కువ పన్ను భారం, కొత్త మోడళ్లు, సులభమైన ఫైనాన్సింగ్ కలిసి ఎస్.యూవీలు, ఎంపీవీల వైపు డిమాండ్‌ను మరింతగా మళ్లిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ ధోరణి కొనసాగుతుందా అనేది ఆటో రంగం గమనించాల్సిన కీలక అంశంగా మారింది.