పండుగ నెలలో అమ్మకాల్లో అదరగొట్టిన టాప్ 5 కార్ల కంపెనీలు ఇవే
ఓవైపు పండుగ నెల.. మరోవైపు జీఎస్టీ తగ్గింపు. ఈ డబుల్ థమాకా కార్ల అమ్మకాలు భారీగా సాగాయి.
By: Garuda Media | 2 Nov 2025 9:41 AM ISTఓవైపు పండుగ నెల.. మరోవైపు జీఎస్టీ తగ్గింపు. ఈ డబుల్ థమాకా కార్ల అమ్మకాలు భారీగా సాగాయి. ఏడాది మొత్తంలో అక్టోబరు నెలలో కార్ల అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. ఈసారి జీఎస్టీ తగ్గింపు కూడా తోడు కావటంతో.. రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగాయి. అయితే.. ఈ పండుగ నెలలో కార్ల అమ్మకాల్లో టాప్ 5 అమ్మకాలు సాగించిన కంపెనీలు.. గత ఏడాది ఇదే అక్టోబరులో వాటి అమ్మకాల మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తే.. ఈసారి అమ్మకాల జోరు ఏ రేంజ్ లో సాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఈసారి పండుగ నెలలో ఎప్పటిలానే మారుతి సుజుకీ చార్ట్లో టాప్ పొజిషన్ లో నిలిచింది. 2024 అక్టోబరులో 2,06,434 కార్లను అమ్మితే.. ఈసారి 2,20,894 కార్లను అమ్మింది. కంపెనీ చరిత్రలో అక్టోబరు నెలలో ఇంత భారీగా అమ్మకాలు సాగించింది ఇదేనని చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్రద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. ఇక.. తర్వాతి స్థానంలో మహీంద్రా అండ్ మహీంద్రా నిలిచింది. గత ఏడాది 95,350 వాహనాల్ని అమ్మితే ఈసారి ఏకంగా 1,20,142 వాహనాల్ని అమ్మింది. వ్రద్ధి రేటు ఏకంగా 26 శాతంగా నమోదు చేసింది. ఇందులో కమర్షియల్ వాహనాల సంఖ్యను తీసేసినా.. రెండో స్థానంలో మహీంద్రా నిలిచింది. 71,624 ప్రయాణికుల వాహనాల్ని విక్రయించింది.
సంఖ్యా పరంగా చూసినప్పుడు హ్యుందయ్ మోటార్ మూడో స్థానంలో నిలిచింది. 2024 అక్టోబరులో 53,792 వాహనాల్ని అమ్మితే.. ఈసారి69,894 వాహనాల అమ్మకాలు జరిపింది. వ్రద్ధి శాతం 30శాతంగా నిలిచింది. టాటా మోటార్స్ అమ్మకాలు జోరుగా సాగినప్పటికి.. ప్యాసింజర్ వెహికిల్స్, కమర్షియల్ వెహికల్స్ ను వేర్వేరుగా చూస్తే.. అంకెలు కాస్త తగ్గినట్లు కనిపించినా.. గత ఏడాదితో పోలిస్తే 27 శాతం వ్రద్ది రేటు కనిపిస్తుంది.
2024 అక్టోబరులో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 48,423 వాహనాల్ని అమ్మితే.. ఈ ఏడాది 61,295 వాహనాల్ని అమ్మింది. ఐదో స్థానంలో టయోటా నిలిచింది. గత ఏడాది అక్టోబరులో 30,845 వాహనాల్ని అమ్మితే.. ఈ ఏడాది అక్టోబరులో 42,892 వాహనాల్ని అమ్మకాలు జరిపింది. టాటా అమ్మిన కార్లలో అత్యధికంగా నెక్సాన్ లు ఉంటే ఆ తర్వాతి స్థానాన్ని పంచ్ సొంతం చేసుకుంది. కియా అమ్మకాలు అంతకు ముందు ఏడాది అక్టోబరుతో పోలిస్తే 30 శాతం వ్రద్ధి చెందినట్లుగా పేర్కొంది.
