Begin typing your search above and press return to search.

ఉగాది పండుగ ఎప్పుడు చేసుకోవాలంటే ?

తెలుగు వారికి కొత్త సంవత్సవరం ఈ రోజుతో ప్రారంభం అవుతుంది అన్న మాట.

By:  Satya P   |   15 March 2026 9:00 PM IST
ఉగాది పండుగ ఎప్పుడు చేసుకోవాలంటే ?
X

ఉగాది తెలుగు వారి సంప్రదాయ పండుగ. ఏడాది పొద్దూ జీవితం ఎలాగో తెలియచెప్పే పండుగ. పంచాంగం ప్రకారం మానవ జీవితాలు సాగుతాయని తెలియచేసే వేడుక. నక్షత్రాలు రాశుల చక్ర భ్రమణంలో మానవ జీవితంలో వెలుగు నీడలు ఎలా పరిభ్రమిస్తాయో తెలియచెప్పే బహు చక్కని పండుగ ఉగాది. ప్రతీ నక్షత్రానికి ఒక రాశి ఉంటుంది. అలా పన్నెండు రాశులు ఉంటాయి. ఈ రాశులు 27 నక్షత్రాల మధ్యనే జ్యోతీష్య శాస్త్రం ఆధారపడి ఉంటుంది. ఏ రాశిలో ఫలాలు ఎలా ఉంటాయో తెలుగు వారి ఉగాది చెబుతుంది. తెలుగు వారికి కొత్త సంవత్సవరం ఈ రోజుతో ప్రారంభం అవుతుంది అన్న మాట.

ఎపుడు జరుగుకోవాలి :

సాధారణంగా భారతీయ సంప్రదాయంలో మన పండుగలు అన్నీ చాంద్రమానం ప్రకారం జరుగుతుంటాయి. భోగీ సంక్రాంతి కనుమ సూర్య మానం ప్రకారం సాగుతాయి. చాంద్రమానం ప్రకారం జరిగే పండుగలు ఏ ఏటికి ఆ ఏడు తేదీలు మారుతూ వస్తాయి. ఇక ఉగాది పండుగ అయినా మరో పండుగ అయినా ఎప్పుడు జరుపుకోవాలి అన్నది ఒక ధర్మ సందేహంగా ఉంటుంది. అయితే ఏ పండుగకు అయినా సూర్యోదయం వేళకు ఆ తిధి ఉంటే ఆ రోజునే జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఈసారి ఉగాది మార్చి 19న లేదా 20న అన్న సంశయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

19నే ఉగాది జరుపుకోవాలని :

దానికి కారణం 19న వేకువ జామున నాటికి అమావాస్య ఘడియలు నిలిచి ఉండడమే. అయితే అమావాస్య వెంటనే ముగిసి సరిగ్గా 6.52 నిముషాలకు పాడ్యమి వస్తుంది. అలా మార్చి 19, 2026న ఉదయం 6:52 గంటలకు ప్రారంభమైన పాడ్యమి మరుసటి రోజు మార్చి 20న తెల్లవారుజామున 4:52 గంటలకు ముగుస్తుంది. అందువల్ల 20వ తేదీన పండుగ ఉండదు, అలా చైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయ వేళనే ఉండడంతో మార్చి 19నే ఉగాది జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది.

పరాభవ నామ సంవత్సరం పేరుతో :

ఇక దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో జరుపుకునే ప్రధాన పండుగ ఉగాది. ఈసారి ఉగాదిని పరాభవ నామ సంవత్సరంగా జరుపుకుంటారు.ఈ పవిత్రమైన రోజున తెలుగు శాక సంవత్సరం 1948 కూడా ప్రారంభమవుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం 60 సంవత్సరాల కాల చక్రంలో నలభైవదిగా చెబుతారు. ఇక ఉగాది అనగానే ఉగాది పచ్చడి చాలా ముఖ్యమైనది.

జీవితం ఆరు రుచుల సమ్మేళనం :

ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తల స్నానం ఆచరించిన వెంటనే దేవుడి పూజలు చేసుకున్న అనంతరం కుటుంబ సభ్యులు అంతా కలసి కూర్చుని మొదట తినాలి. జీవితం ఆరు రుచుల సమ్మేళనం. దానికి ప్రతీకగానే ఉగాది పచ్చడి ఉంటుంది. ఇక పిండి వంటలతో మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం జరిగే వేడుకలో పంచాంగ శ్రవణం ఉంటుంది. పంచాంగ శ్రవణం అతి ముఖ్యమైనదిగా అంతా భావిస్తారు. ఇది కూడా మానవుడి జీవితానికి కొత్త ఆశను ఆలంబనను ఇచ్చే విధంగానే పెద్దలు పంచాంగకర్తలు రూపకల్పన చేశారు అని చెప్పాలి.