Begin typing your search above and press return to search.

ఇక అన్నీ మంచి శకునములే !

అంతే కాదు, పచ్చని తోరణాలతో లోగిళ్ళు శుభ కార్యక్రమాలతో సందడి చేయనున్నాయి. ఇంతకీ ఆ శుభ ఘడియలు ఎపుడు వస్తాయి అంటే ఫిబ్రవరి నెల 18 నుంచి అని పండితులు చెబుతున్నారు.

By:  Satya P   |   31 Jan 2026 7:00 PM IST
ఇక అన్నీ మంచి శకునములే !
X

గత 50 రోజులుగా ఎటువంటి శుభ కార్యక్రమాలకు అవకాశం లేకుండా పోయింది. ఎక్కడా పెళ్ళి బాజాలు మోగలేదు, అలాగే ఏ విధమైన శుభాలకు వీలు చిక్కలేదు. అయితే మరి కొద్ది రోజులలో ఆ పరిస్థితి మారబోతోంది. మళ్ళీ డుం డుం బాజాల మోత మోగనుంది. అంతే కాదు, పచ్చని తోరణాలతో లోగిళ్ళు శుభ కార్యక్రమాలతో సందడి చేయనున్నాయి. ఇంతకీ ఆ శుభ ఘడియలు ఎపుడు వస్తాయి అంటే ఫిబ్రవరి నెల 18 నుంచి అని పండితులు చెబుతున్నారు.

మౌఢ్యమితో అంతా :

శుక్ర మౌఢ్యమితో ఎక్కడా ఎటువంటి వివాహాది కార్యక్రమాలు నవంబర్ నెలాఖరు నుంచి జరగలేదు, ఈ మధ్యలో మార్గశిర మాసం పూర్తి అయిపోయింది. పుష్య మాసం ఎటూ శూన్య మాసమే. అయితే పెళ్ళిళ్ళకు ఎంతో కీలకమైన మాఘ మాసం కూడా దాదాపుగా పూర్తి కావస్తున్న వేళ శుక్ర మౌఢ్యమి మెల్లగా వెళ్ళిపోతోంది. ఫిబ్రవరి నెల ఎంట్రీ ఇస్తూనే శుభాలకు స్వాగతం పలకనుంది. ఫిబ్రవరి 17 దాకా శుక్ర మూడమి ఉంటుందని పండితులు చెబుతున్నారు. మాఘ మాసం తరువాత ఫాల్గుణం, చైత్రం, వైశాఖం ఈ మాసాలు అన్నీ కూడా శుభ మాసాలే కావడంతో జోరుగా పెళ్ళిళ్ళు జరగనున్నాయని అంటున్నారు.

పెళ్ళళ్ళకు రెడీ కావచ్చు :

గడచిన రెండు నెలలుగా పెళ్ళిళ్ళు నిలిచిపోయాయి. మూడంతో ఎవరూ వివాహాలు తలపెట్టారు. దాంతో పెళ్ళిళ్ళకు మంచి రోజులు ఎపుడు అన్న దాని మీద పండితులు వివరిస్తున్నారు. 18 నుంచి ఏకంగా మే 9 వరకూ మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. మే 9 దాకా శుభ ముహూర్తాలు ఎన్నో ఉన్నాయని వివరిస్తున్నారు. కేవలం పెళ్ళిళ్ళు మాత్రమే కాకుండా గృహ ప్రవేశాలు కొత్త గృహాలకు శ్రీకారం చుట్టడం ఉప నయనాలు ఇలా అనేక కార్యక్రమాలు ఈ శుభ ముహూర్తాలలో చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు.

శుక్రుడు పవర్ ఫుల్ :

హిందూ సంప్రదాయాలలో గ్రహాలకు ఎంతో ప్రాశస్థ్యం ఉంది. గురువు, శుక్రుడు గ్రహాలు ఎంతో మేలు చేస్తాయని నమ్మకం ఉంది. అయితే ఈ గ్రహాలు రెండూ సూర్యుడికి అతి దగ్గరగా వచ్చినపుడు వాటి శక్తిని కోల్పోతాయి. దాంతో ఆ సమయంలో ఈ గ్రహాల శక్తి ప్రసరించదు కాబట్టి వాటిని మౌడ్యం అని అంటారు. అందుకే గురు శుక్ర మౌఢ్యాలు వచ్చినపుడు శుభ కార్యక్రమాలు ఎవరూ తలపెట్టరు అని చెబుతారు. శుక్ర గ్రహం అనుగ్రహం ఉంటే ప్రతీ ఇంట్లో సంతోషం జీవితంలో స్థిరత్వం అలాగే శాంతి సమకూరుతాయి అని విశ్వసితారు. అందుకే శుక్ర మూఢం వెళ్ళేంతవరకూ ఎవరూ శుభ కార్యక్రమాలు జరుపుకోకుండా ఎదురుచూస్తున్నారు. ఇపుడు ఆ మంచి రోజులు వచ్చేశాయి అని అంటున్నారు.

అధిక జేష్టంతో :

ఇక ఈ ఏడాది అధిక జేష్ట మాసం ఉంది. అది మే నెల 17 నుంచి జూన్ 15 వరకూ కొనసాగుతుంది. ఈ అధిక మాసంలో కూడా మంచి ముహూర్తాలు ఉండవని అంటున్నారు. ఇక నిజ జేష్టం జూన్ 16 నుంచి మొదలవుతుంది. దాంతో జేష్ట మాసంలో మళ్ళీ పెళ్ళిళ్ళకు ఇతర శుభాలకు మంచి రోజులు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఫిబ్రవరి 18 నుంచి మొదలయ్యే శుభ ఘడియలు మూడు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి శుభ కార్యక్రమాలు తలపెట్టాలనుకునేవారు అంతా సిద్ధపడిపోవచ్చు అన్నది పండితులు చెప్పే మాటగా ఉంది.