Begin typing your search above and press return to search.

జగన్ డెసిషన్...కాంగ్రెస్ కి భారీ షాక్ !

వైసీపీ అధినేత వైఎస్ జగన్ జాతీయ రాజకీయాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చారు. అదే సమయంలో అంశాల ఆధారంగా ఎన్డీయేకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తూనే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైసీపీ తన డిమాండ్‌ను వెల్లడించింది.

By:  Satya P   |   28 Nov 2026 9:18 AM IST
జగన్ డెసిషన్...కాంగ్రెస్ కి భారీ షాక్ !
X

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయంతో చాలా కాలంగా జరుగుతున్న ఒక ప్రచారానికి చెక్ పెట్టేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పెద్దన్న ఉన్న ఇండియా కూటమిలో చేరే ప్రసక్తే లేదని తేల్చేశారు. అంతే కాదు తన న్యూట్రల్ స్టాండ్ ని కాపాడుకుంటూనే అవసరం అయిన సందర్భాలలో కచ్చితంగా ఎన్డీయేకు మద్దతుగా నిలుస్తాను అన్న కీలకమైన సందేశాన్ని ఇచ్చారు. జగన్ కాంగ్రెస్ తో జట్టు కట్టబోతున్నారు అని ఆయన బీజేపీకి దూరం జరిగారు అంటూ ఇటీవల వరసగా వార్తలు వచ్చాయి. అయితే జగన్ బీజేపీకి ఎపుడు దగ్గరగా ఉన్నారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇష్యూస్ బేస్డ్ గానే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అని గుర్తు చేస్తున్నారు.

విస్తృత ప్రయోజనాల కోసం :

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ నెల 30న లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్న డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తోంది అని అంటున్నారు. ఈ బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగరాదు అన్నది వైసీపీ స్టాండ్. అదే విధంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అన్నది కూడా తమ పార్టీ విధానం అని వైసీపీ చెప్పుకొచ్చింది. ఏప్రిల్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టినపుడు కూడా వైసీపీ మద్దతుగా నిలిచింది. ఇపుడు అదే చేసింది అని అంటున్నారు. ఒక విధంగా వైసీపీ ఈ బిల్లుకు మద్దతు తెలపడం ద్వారా మహిళా ఓటర్ల మద్దతుని అందుకోవాలని చూస్తోంది అంటున్నారు. ఇక డీలిమిటేషన్ వల్ల పెరిగే నియోజకవర్గాలు తమకు కూడా రాజకీయంగా ఉపయోగపడతాయని లెక్క వేసుకుంటోంది.

కాంగ్రెస్ కి దూరమే :

ఈ బిల్లు సంగతి పక్కన పెడితే వైసీపీ కాంగ్రెస్ విషయంలో తన స్టాండ్ ఏంటో చెప్పకనే చెప్పేసింది అని అంటున్నారు. ఈ బిల్లుని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో ఇండియా కూటమిలోని పార్టీలతో ఒక కీలక సమావేశాన్ని కూడా ఆ పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఇంకో వైపు చూస్తే ఈ మధ్య రాహుల్ గాంధీ బలం పెరిగిందని ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా ఎగబాకింది అని ప్రచారం సాగుతోంది. 2029 నాటికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని బీజేపీ బలం తగ్గిపోయిందని కూడా వార్తా కధనాలు వస్తున్నాయి. దాంతో ఏపీలో వైసీపీ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళుతుందని అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే తాజా నిర్ణయంతో తాను దూరమే అని జగన్ చెప్పేశారు అంటున్నారు.

అది అయ్యేది కాదా :

కానీ జగన్ తాజాగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ గురించి మాట్లాడుతూ చేసిన ట్వీట్ లో కాంగ్రెస్ చంద్రబాబుల మధ్య హాట్ లైన్ దోస్తీ సాగుతోంది అని ఆరోపించారు. ఆ మాటలు ఆయన గతంలో కూడా అన్నారు. ఒక విధంగా కాంగ్రెస్ ఏపీలో విపక్ష పాత్ర పోషించడం లేదు అన్నది వైసీపీలో బలంగా భావన ఉంది. ఏపీలో ఓట్ల చోరీ మీద మాట్లాడడం లేదని ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో ఘర్షణలు జాతీయ మీడియా హైలెట్ చేసినా ఎక్కడా రాహుల్ ఆ ప్రస్తావన తేలేదని వైసీపీ అంటోంది. అలాంటి పార్టీతో కలవడం అన్నది ఉండదని కూడా చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే డీలిమిటేషన్ బిల్లు విషయంలో వైసీపీ ఏమి చేయబోతుంది అని ఇప్పటిదాకా అంతా చర్చినుకున్నారు. కానీ వైసీపీ అయితే తన స్టాండ్ ని మార్చుకోలేదని స్పష్టం అయింది. ఒక విధంగా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు కానీ కొత్త మిత్రులను ఇండియా కూడగట్టలేకపోతోంది ప్రత్యేకించి ఏపీలో అన్ని విధాలుగా భావసారూప్యత ఉన్న వైసీపీని కలుపుకుని పోయే విషయంలో రాహుల్ గాంధీ ఇగోలకు పోతున్నారని అందుకే ఈ దూరం అలాగే సాగుతోందని అంటున్నారు.