Begin typing your search above and press return to search.

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

By:  A.N.Kumar   |   3 Nov 2026 11:08 AM IST
పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి ఆందోళన చేపట్టారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్‌తో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, పార్టీ ఏజెంట్లపై కూడా కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజన వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దీనికి నిరసనగా వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పులివెందులలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. తమ పార్టీ ఏజెంట్లను అడ్డుకోవడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుంటున్నారని జగన్ మండిపడ్డారు.

ఈ సందర్భంగా జగన్ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై.. అధికారులపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. పోలింగ్ కేంద్రాలను టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పోలీసులు, ఎన్నికల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పులివెందులలో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి అవసరమైతే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ధర్నా సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసినా మరో రెండేళ్లేనని.. ఆ తర్వాత తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత ఘటనలపై సమగ్ర విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవంతోనే తాము పోలింగ్‌ను అడ్డుకోలేదని.. పులివెందులలో రీపోలింగ్ పెడితేనే వచ్చి ఓటు వేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే బెంగళూరుకు పయనమయ్యారు.

ధర్నా సమయంలో ఆర్వో వైఎస్ జగన్ నుంచి వినతిపత్రం స్వీకరించినప్పటికీ పోలింగ్ రోజున నిబంధనలకు విరుద్ధంగా నిరసన కార్యక్రమం చేపట్టారనే కారణంతో పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. మాజీ సీఎం స్థాయి నేతపై కేసు నమోదు కావడంతో ఏపీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఆధారంగా పోలీసులు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు.. దీనిపై వైఎస్సార్‌సీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.