Begin typing your search above and press return to search.

''మేం అధికారంలోకి వ‌స్తే.. వాళ్ల‌ను చెప్పుల‌తో కొడ‌తాం''

స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులను ఉద్దేశించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరినీ ఇంటికి పిలిచి చెప్పుతో కొట్టి రాజీనామా చేయిస్తామని హెచ్చరించారు. ప్రొద్దుటూరులో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, ఓటర్లను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Garuda Media   |   27 Nov 2026 9:28 AM IST
మేం అధికారంలోకి వ‌స్తే.. వాళ్ల‌ను చెప్పుల‌తో కొడ‌తాం
X

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ పై నోరు చేసుకోవ‌డం వైసీపీ నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. ప్ర‌జా తీర్పును సైతం వ్యం గ్యంగా... వివాదంగా కూడా మార్చేస్తున్నారు. ప్ర‌జ‌లు ఓటు వేసి గెలిపించిన నాయ‌కుల విష‌యంలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇటీవల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు కూట‌మి పార్టీల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి పార్టీల నాయ‌కులే విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఈ ప్రజాతీర్పును అంద‌రూ గౌర‌వించాల్సిందే. ముఖ్యంగా ఈ ఎన్నిక‌లు ఈవీఎంల‌పై కాకుండా.. బ్యాలెట్ పేప‌ర్ పైనే జ‌రిగాయి. దీంతో ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చిన‌ట్టుగానే భావించాలి. అదే ఈవీఎంలైతే.. ఏవో అనుమానా లు వ్య‌క్తం చేసినా అర్థం ఉంటుంది. కానీ.. బ్యాలెట్‌ పేప‌ర్‌పైనే ఎన్నిక‌లు జ‌రిగాయి కాబ‌ట్టి ఎవ‌రికీ ఎలాంటి అనుమా నాలు లేవు. కానీ, వైసీపీ నాయ‌కులు మాత్రం ఈ ఎన్నిక‌ల‌పై ఇంకా అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నారు.

ప్ర‌జాతీర్పును కూడా అప‌హాస్యం చేస్తూ.. సీనియ‌ర్‌నేత‌, మాజీ ఎమ్మెల్యే క‌డ‌ప‌కు చెందిన రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి తీవ్ర అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని, ప్ర‌జా ప్ర‌తినిధులుగా ప్ర‌మాణ స్వీకారం కూడా చేసిన వారిని చెప్పుతో కొడ‌తామ‌ని.. వ్యాఖ్యానించారు. ``వైసీపీ అంటే ఆట‌ల‌నుకుండారా? మేం అధికారంలోకి రానీ చెప్తాం. ఒక్కొక్క‌రినీ ఇంటికి పిలిచి చెప్పుతో కొట్టి మ‌రీ రాజీనామాలు చేయిస్తం. ఏమ‌నుకుంటు న్నారో`` అని రాచ‌మ‌ల్లు చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

స్థానిక ఎన్నిక‌ల్లో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ప్రొద్దుటూరులోని మండ‌లాలు, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశార‌ని.. బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాలు చేసుకున్నార‌ని రాచ‌మ‌ల్లు ఆరోపించారు. అంతేకాదు, ప్ర‌జ‌ల‌ను కూడా ఓటు వేయ‌కుండా అడ్డుకున్నార‌ని చెప్పారు. ఇవ‌న్నీ.. పోలీసులు, ఎన్నిక‌ల అధికారుల క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగాయ‌ని.. వారిని కూడా వ‌దిలి పెట్టేది లేదని హెచ్చ‌రించారు. అయితే.. సీనియ‌ర్ నాయ‌కుడు అయి ఉండి.. ఇలా ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను అవ‌హేళ‌న చేయ‌డం, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను చెప్పుతో కొడ‌తామ‌ని బెదిరించ‌డంపై నెటిజ‌న్లు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.