పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కాన్వాయ్‌పై పెట్రోల్ బాంబులతో దాడి చేశారని వైసీపీ ఆరోపించగా, వైసీపీ నేతలే తమ కార్యకర్తలు, ఆస్తులపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నామినేషన్లను అడ్డుకోవడం, వాహనాలకు నిప్పు పెట్టడం, రాళ్ల దాడులు వంటి ఘటనలతో పలు మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
By: Tupaki Political Desk | 20 Nov 2026 1:09 PM ISTపంచాయతీ ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకుండా తమను అడ్డుకుంటున్నారని, నామినేషన్లు వేయడానికి వెళితే దాడులు చేస్తున్నారని ఇరుపార్టీల వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గ రాజకీయాలలో హైటెన్షన్ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో అధికార పక్షం, కంచుకోటను కాపాడుకోవాలని వైసీపీ పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
పంచాయతీ నామినేషన్ల పర్వం మొదలైన నుంచి పులివెందులలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మొదలైన రగడ పరిషత్ ఎన్నికల సమయంలో పతాకస్థాయికి చేరింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో గ్రామాలు రణరంగాన్ని తలపిస్తున్నాయని చెబుతున్నారు. శుక్రవారం తమ అనుచరులతో నామినేషన్ వేయించేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సింహాద్రిపురం మండలానికి వెళ్లగా, మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్ పై పెట్రోల్ బాంబులు వేశారని వైసీపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ లో పోస్టు పెట్టింది.
సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామ శివార్లలో టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. తాను ఐదు వాహనాల్లో వస్తున్నానని పోలీసులకు మందుగా సమాచారం ఇచ్చానని, ఆయన టీడీపీ కార్యకర్తల దాడులను అడ్డుకోలేకపోయారని ఎంపీ ఫైర్ అయ్యారు. టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగినట్లు ఆయన ఆరోపించారు. అధికారం ఉందని బరి తెగిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా కూటమి సర్కార్ లో అరాచకపర్వం కొనసాగుతోందని దుయ్యబట్టారు. వేముల మండలం వి. కొత్తపల్లె, గొందిపల్లె, వేంపల్లె మండలాల్లో వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చాగలూరు, కొండారెడ్డిపల్లె, నారేపల్లె గ్రామాల్లో నామినేషన్ల సమయంలో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది.
మరోవైపు వైసీపీ నేతలే దాడులకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం అగడూరు, తొండూరు మండలం మల్యాల, సింహాద్రిపురం మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండి రామసుబ్బారెడ్డి ఆస్తులపై జరిగిన దాడులకు నిరసనగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి), ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. వైసీపీ నేతలు నామినేషన్ కేంద్రాల వద్ద ట్రాక్టర్లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. ఇడుపులపాయకు చెందిన టీడీపీ నాయకుడు పీపీ చెన్నరాయుడు ఎస్యూవీ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి దహనం చేశారని తెలిపారు. తొండూరు మండలం మల్లెలలో టీడీపీ కార్యకర్తల ద్విచక్ర వాహనాలకు, అలాగే మరో చోట బొలెరో వాహనానికి నిప్పు పెట్టారు.
