ఓటు వేయకుండా నేలపై కూర్చొని జగన్ నిరసన.. పులివెందులలో నాటకీయ పరిణామాలు
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
By: A.N.Kumar | 1 Nov 2026 5:44 PM ISTవైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పులివెందుల మున్సిపల్ ఎన్నికల వేళ జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిరాకరించడమే కాకుండా రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయం ఎదుట నేలపై కూర్చొని నిరసనకు దిగడం సంచలనమైంది.
ఎన్నికల ప్రక్రియలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని.. వైఎస్సార్‌సీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసి బయటకు పంపించేశారని జగన్ ఆరోపించారు. అధికార కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలోనే మాజీ ముఖ్యమంత్రికే ఈ పరిస్థితి ఎదురైతే రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని.. వెంటనే ప్రభావిత వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆర్వోను డిమాండ్ చేశారు.
ఆర్వో ఆఫీస్ ముందు నేలపై బైఠాయించిన జగన్ ఈ సందర్భంగా ఊహించని ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఓటు వేయబోనని స్పష్టం చేశారు. "ఎన్నికలు ధర్మబద్ధంగా.. న్యాయబద్ధంగా జరిగేలా రీపోలింగ్ నిర్వహిస్తేనే నేను వచ్చి ఓటు వేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వెళ్లి ప్రశాంతంగా ఓటు వేస్తే ఎన్నికల ప్రక్రియ అంతా సవ్యంగా సాగుతోందనే తప్పు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. అందుకే ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఓటుకు దూరంగా ఉంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు తన సొంత నియోజకవర్గంలో ఓటు వేయకుండా నిరసన తెలపడం.. ఆర్వో ఆఫీస్ ముందు నేలపై కూర్చోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. జగన్ నిర్ణయంతో పులివెందుల మున్సిపల్ ఎన్నికల చుట్టూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జగన్ నిరసన డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.
