Begin typing your search above and press return to search.

ఆదీ.. వేరే రాజకీయ దారి ఏదీ ?

కడప జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జెడ్పీ పీఠం దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తన సోదరుడి కుమారులకు పదవి దక్కాలని పట్టుబట్టినా ఫలితం లేకపోవడంతో రాజీనామా ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన ఆదికి ఇప్పుడు రాజకీయంగా ప్రత్యామ్నాయాలు పరిమితంగా ఉన్నాయనే చర్చ సాగుతోంది.

By:  Satya P   |   22 Nov 2026 10:01 AM IST
ఆదీ.. వేరే రాజకీయ దారి ఏదీ ?
X

కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఆదినారాయణరెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీలో మొదట్లో ఉండేవారు. అలా వైఎస్సార్ హయాంలో 2004, 2009లలో రెండు సార్లు జమ్మలమడుగు నుంచి గెలిచి ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసుకున్నారు. వైఎస్సార్ మరణం తరువాత ఆయన వైసీపీలో చేరి 2014లో జమ్మలమడుగు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే 2016లో ఆయన టీడీపీలో చేరిపోయారు. అలా మంత్రి కూడా చంద్రబాబు కేబినెట్ లో ఆయన అయ్యారు. రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రిగా మూడేళ్ళ పాటు పనిచేశారు. ఇక ఎన్ని2019 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ తరపున కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

కాషాయం కప్పుకుని :

ఇక ఆదినారాయణ రెడ్డి రాజకీయం ముగిసింది అనుకున్న తరుణంలో ఆయన అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన 2019 అక్టోబర్ లో బీజేపీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి తరఫున జమ్మలమడుగు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డిపై 17,191 ఓట్ల మెజారిటీతో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఆయన ప్రస్తుతం ఏపీ శాసనసభలో విప్‌గా కొనసాగుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆదినారాయణ రెడ్డి రాజకీయం కాంగ్రెస్ లో సాగినంత సులువుగా ఎక్కడా సాగలేదనిపిస్తుంది. దానికి కారణం ఆయన ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ అని చెబుతారు.

నాలుగు పార్టీలు మారి :

ఆదినారాయణరెడ్డి బలమైన నాయకుడే. ఆయనకు జమ్మలమడుగులో గట్టి మద్దతు ఉంది. అయితే ఆయన గడచిన రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో చూసుకుంటే ఏకంగా నాలుగు పార్టీలను మారారు. ఆయన కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీల అధినాయకత్వాల విషయంలో అసంతృప్తి చెందుతూనే ఉన్నారు. తన మాటే నెగ్గాలన్న ఆయన ఆలోచనల వల్ల కూడా ఇలా జరుగుతోంది అని అంటారు. ఇక బీజేపీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి తనకంటే సీనియర్ నేత ఎవరూ ఆ పార్టీలో లేరని భావిస్తారని అంటారు. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే ఆదికి మంత్రి పదవి దక్కలేదు అన్నది అనుచరులలో ఉంది.

జెడ్పీ పీఠం కోసం :

ఇక కడప జిల్లాలో జెడ్పీ పీఠం కోసం ఆదినారాయణరెడ్డి ఎంతో ప్రతిష్టగా తీసుకున్నారు. తన సోదరుడి కుమారులకు ఈ పదవిని ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. కానీ చిత్రంగా ఈ పీఠం టీడీపీకి వెళ్ళిపోయింది. చివరి నిముషంలో అనూహ్యంగా మారిన సమీకరణలతో కృష్నా జిలలాలో బీజేపీకి ఈ పదవిని కేటాయించారు. దాంతో ఆదినారాయణ రెడ్డి భగ్గుమంటున్నారు. ఇక తన పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు అన్న వార్తలూ ప్రచారంలో ఉన్నాయి.

వేరే ఆప్షన్ లేదు :

అయితే ఆదినారాయణ రెడ్డి ఎంతగా ఆగ్రహించినా ఆయనకు రాజకీయంగా వేరే ఆప్షన్ అయితే లేదని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా పార్టీలు మారారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీలో ఉండి టికెట్ కోరినా కూడా జమ్మలమడుగులో టీడీపీ ఇంచార్జ్ ఆయన సోదరుడి కుమారుడు పోటీకి సిద్ధంగా ఉన్నారు. కూటమిలో చూస్తే అదీ పరిస్థితి. మరి ఆయన కూటమి నుంచి బయటకు వస్తే వైసీపీలోనే మళ్ళీ చేరాల్సి ఉంటుంది. అది ఆయనకూ ఇష్టం లేదు, వైసీపీ కూడా ఆయనను చేర్చుకోదని అంటున్నారు. మరి రాజకీయంగా చూస్తే ఇంతలా క్లియర్ కట్ పిక్చర్ ఉన్నా ఆదినారాయణరెడ్డి ఎందుకు ఈ ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు అంటే అది ఆయన మంత్రి పదవి కోసమేనా అన్న చర్చ సైతం నడుస్తోంది. మొత్తానికి ఆది ఎంతలా ఆవేదన చెందినా మారేది ఏమీ ఉండదని అంటున్నారు. మంత్రి పదవి కూడా ఆయనకు దక్కే చాన్స్ కూడా లేదనే అంటున్నారు.