షర్మిలకు వైఎస్ ఇచ్చిన ఆస్తులు ... చిట్టా విప్పిన రాచమల్లు
వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. వైఎస్ షర్మిలకు తండ్రి వైఎస్సార్ నుంచి ఇల్లు, భూములు, జలవిద్యుత్ ప్రాజెక్టులతో సహా పలు ఆస్తులు అందాయని వెల్లడించారు. జగన్ కూడా ఆమెకు రూ.236 కోట్ల నగదు ఇచ్చారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
By: Satya P | 27 Nov 2026 8:00 AM ISTవైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం అన్నది వ్యక్తిగతం అయినది అంటూ ఒక వైపు వైసీపీ నేతలు చెబుతూనే ఆ వివాదంలోకి తాము కూడా ఎంట్రీ ఇస్తున్నారు. లేటెస్ట్ గా చూస్తే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి వైఎస్సార్ షర్మిలకు ఇచ్చిన ఆస్తులు ఇవే అంటూ ఒక పెద్ద జాబితానే విడుదల చేశారు. అది కూడా షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం జరిగి కేవలం ఒక రోజు కూడా గడవకముందే, వైసీపీ నుంచి షర్మిలపై ఎక్కుపెట్టిన బాణం ఇదని అంటున్నారు. అంతే కాదు జగన్ గొప్ప అన్న అని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ మాత్రమే కాదు జగన్ కూడా షర్మిలకు ఏకంగా 236 కోట్ల రూపాయల నగదును వైట్ మనీగానే ఇచ్చారు అని రాచమల్లు చెప్పుకొచ్చారు. షర్మిలకు అవసరం అయిన ప్రతీ సందర్భంలో జగన్ కోట్ల రూపాయల నగదు ఇస్తూనే ఉన్నారు అని తనకు తెలిసిన సీక్రెట్స్ గా బయటపెట్టారు.
సంప్రదాయం ప్రకారమే :
ఇక మనకు ఉన్న సంప్రదాయం సంస్కృతి ప్రకారం పెళ్ళి సమయంలో కుమార్తెలకు ఆస్తులు ఇచ్చే విధానం ఉందని రాచమల్లు గుర్తు చేశారు. అలా అప్పట్లోనే దివంగత నేత వైఎస్సార్ షర్మిలకు భారీగానే ఆస్తులు ఇచ్చారని ఆయన చెప్పారు. ఆ ఆస్తుల వివరాలు ఇవే అని ఆయన ఒక పెద్ద చిట్టానే విడుదల చేశారు. అందులో హైదరాబాద్, విజయవాడ, కడపలలో ఎక్కడెక్కడ షర్మిలకు ఆస్తులు ఉన్నాయో కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు.
భారీ జాబితాగానే :
ఇదిలా ఉంటే వైఎస్సార్ తన ఆస్తుల పంపకంలో భాగంగానే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇంటిని షర్మిలకు ఇచ్చారని రాచమల్లు చెప్పారు. అలాగే ఇడుపులపాయలో 51 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఆమెకు ఇచ్చారని అన్నారు. ఇక 15 మెగావాట్ల సామర్థ్యం గల ఎస్‌ఆర్‌ఎస్ జలవిద్యుత్ ప్రాజెక్టును ఆమెకు కేటాయించారని, 22.5 మెగావాట్ల సామర్థ్యం గల స్వస్తిక్ జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా ఆమెకే ఇచ్చారని అన్నారు. విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో 35 శాతం వాటాను షర్మిలకు ఇచ్చారని, అలాగ పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్ల భూమిని ఆమెకు అందించారని, ఇక విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీలో 100 శాతం వాటాను ఆమెకు ఇచ్చారని అన్నారు. అంతే కాకుండా రైల్వే కోడూరులో ఉన్న రాజారెడ్డి పాత ఆస్తిని కూడా షర్మిలకు ఇచ్చారని చెప్పారు. ఇక రైల్వే కోడూరులోని సెట్టిగుంటలో ఉన్న 90 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా వైఎస్ఆర్ షర్మిలకు ఇచ్చారని అన్నారు. ఇవన్నీ షర్మిలకు వైఎస్సార్ నుంచి నేరుగా దాఖలు పడ్డ ఆస్తులుగా రచమల్లు చెప్పుకొచ్చారు.
జగన్ ఏకైక యజమానిగా :
కేవలం వైఎస్సార్ మాత్రమే కాకుండా వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి కూడా షర్మిల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించారని రాచమల్లు పేర్కొన్నారు. అయితే కేవలం కుటుంబ విషయాలను ఆస్తులను అడ్డుపెట్టుకుని జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని షర్మిల చూస్తున్నారని రాచమల్లు ఫైర్ అయ్యారు. మరి వైఎస్సార్ షర్మిలకు ఇచ్చిన ఈ ఆస్తులు అన్నీ ఏమయ్యాయని రాచమల్లు ప్రశ్నించారు. షర్మిల వివాహ సమయంలోనే ఆమెకు రావాల్సిన వాటా మొత్తం దక్కిందని ఆ తర్వాత వైఎస్ఆర్ వారసత్వానికి కానీ ఇతర ఆస్తులకు జగన్ మాత్రమే ఏకైక యజమానిగా మిగిలారని రాచమల్లు తేల్చారు.
విడిపోయేంతవరకూ :
మరో వైపు చూస్తే 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత నుంచి జగన్ తో షర్మిల విభేదించి పూర్తిగా విడిపోయేంత వరకు కూడా షర్మిలకు జగన్ తన సొంత సంపాదన నుండే పెద్ద ఎత్తున ఆర్థికంగా సహాయం చేశారని రాచమల్లు కొత్త విషయాలను కూడా చెప్పారు. మరి ఇన్ని రకాలుగా జగన్ సహాయం చేస్తే తన కుమార్తె వివాహాన్ని అడ్డం పెట్టుకుని జగన్ మీద షర్మిల విమర్శలుచ్ ఏయడమేంటని రాచమల్లు నిలదీశారు. మొత్తానికి జగన్ వర్సెస్ షర్మిల ఎపిసోడ్ కంటిన్యూ అయ్యేలా ఉందని రాచమల్లు తాజా కామెంట్స్ తో తెలుస్తోంది. దీని మీద షర్మిల వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది చూడాల్సి ఉంది.
