నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్
వైసీపీకి జరుగుతున్న రాజకీయ నష్టాన్ని గుర్తించిన జగన్, షర్మిల, విజయసాయిరెడ్డి వంటి నేతల వ్యాఖ్యలపై స్పందించవద్దని పార్టీ శ్రేణులకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించినట్లు సమాచారం. రాజకీయ పోరాటాన్ని టీడీపీకే పరిమితం చేసి, ఇతర అంశాలతో పార్టీకి నష్టం జరగకుండా చూడాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
By: Satya P | 20 Nov 2026 11:10 PM ISTవైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ విషయంలో ఎలా అనుసరించాలి, ఎక్కడ డ్యామేజ్ అవుతోంది అన్న దాని మీద సరైన సమీక్షలే చేస్తున్నారు అని అంటున్నారు. పార్టీ గతంలో సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంతో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అన్నది హైకమాండ్ గ్రహిస్తుంది అంటున్నారు. అంతే కాదు పార్టీ టార్గెట్ ఎవరి మీద ఉంటే జనాలలో రిసీవింగ్ ఉంటుంది, దేని గురించి మాట్లాడాలి, ఏ అంశాలను ఏ నాయకులను వదిలిపెట్టాలి అన్న దాంట్లో వైసీపీ పూర్తిగా వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగుతోంది అని అంటున్నారు. అందుకే జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అయితే చర్చకు వస్తున్నాయి.
ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు :
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏపీలో ఉన్న షర్మిల విషయంలో వైసీపీ అతిగా స్పందిస్తోంది అన్న భావన అయితే ఉంది. ఆమె పార్టీ ఏపీలో నామమాత్రంగా ఉంది. పైగా వైసీపీకి ఏ మాత్రం పోటీ కానే కాదు, అలాంటిది షర్మిల మీద వైసీపీ నేతలు తరచూ చేసే కామెంట్స్ వల్ల అది బూమరాంగ్ అయి వైసీపీనే గట్టిగా గుచ్చుకుంటోంది అని అంటున్నారు. ఇలా ఎందువల్ల అంటే ఆమె జగన్ కి స్వయాన సోదరి, పైగా మహిళా నాయకురాలు. ఆమె వైపు నుంచి గట్టి విమర్శలు వస్తే సహజంగా వైసీపీ డిఫెన్స్ లో పడుతుంది. దాంతో జగన్ తాజాగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు అని అంటున్నారు. షర్మిల విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని ఆయన స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.
రేగిన రాజకీయ దుమారం :
ఇటీవల టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్ళి షర్మిల తన కుమార్తె పెళ్ళికి ఆహ్వాన పత్రిక అందచేశారు. అయితే దాని మీద వైసీపీ సొంత పత్రికలోనే ఒక కథనం ప్రచురితం అయి రాజకీయంగా పెను దుమారం రేపింది. దీంతో ఇపుడు ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కూడా రచ్చ సాగుతోంది. అయితే ఈ విషయం మీద పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరూ స్పందించవద్దని జగన్ సూచించినట్లుగా తెలిసింది. కుటుంబ విషయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, తద్వారా కుటుంబపరమైన రాజకీయ వివాదాలు మరింత ముదరకుండా చూసుకోవాలని జగన్ పార్టీ నేతలకు హితవు పలికినట్లుగా చెబుతున్నారు.
కొత్త కోణంగానే :
ఇప్పటికే జగన్ షర్మిల మధ్యన ఆస్తుల వివాదం ఉంది అంటూ ప్రచారం సాగుతోంది. ఇపుడు దానికి తోడు అన్నట్లుగా కొత్తగా సదరు పత్రికలో వచ్చిన కథనం రాజకీయ వివాదాన్ని మరింతగా రాజేసింది. ఇక షర్మిల సోషల్ మీడియా వేదికగా జగన్ను నేరుగా ప్రశ్నించడమే కాకుండా తనపై ఆ పత్రిక ప్రచురించిన కథనంపై సవాల్ కూడా చేశారు. ఇలా సోషల్ మీడియా వేదికగా షర్మిల బహిరంగంగా లేవనెత్తిన పలు ప్రశ్నలు అన్నా చెల్లెళ్ళ మధ్య ఇప్పటికే ఉన్న విభేదాలకు మరో సరి కొత్త కోణాన్ని చేర్చాయని అంటున్నారు. అందుకే జగన్ ఈ విషయాల మీద మరింతగా ముదరకుండా సీనియర్ నేతలకు జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మీదట తన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన గట్టిగానే పార్టీ నాయకులకు చెప్పినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. '
షర్మిల విషయంలో సైలెంట్ :
దాంతో రానున్న రోజులలో షర్మిల చేసే వ్యాఖ్యలకు వైసీపీ నుంచి ఎలాంటి ప్రతిస్పందనలు ఉండవని అంటున్నారు. తాజాగా చోటు చేసుకున్న మొత్తం పరిణామాలను సమీక్షించిన తర్వాతనే జగన్ ఈ తరహా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అంటున్నారు. ఇప్పటిదాకా చూస్తే షర్మిల ఏ కామెంట్స్ చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి తో సహా పలువురు వైసీపీ నాయకులు పలు సందర్భాలలో స్పందించేవారు. అయితే ఇపుడు జగన్ ఆదేశాలతో షర్మిల విషయంలో వైసీపీ మొత్తంగా సైలెంట్ అవుతుందని అంటున్నారు. షర్మిల వ్యాఖ్యల మీద రియాక్ట్ అవడం వల్ల పార్టీకి లాభం మాట పక్కన పెడితే డ్యామేజ్ ఎక్కువగా జరుగుతోంది అని విశ్లేషించుకున్న మీదటనే ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు
విజయసాయిరెడ్డి విషయం :
అంతే కాదు వైసీపీలో నంబర్ టూగా ఉంటూ వచ్చిన విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. దాంతో ఆయన చేస్తున్న రాజకీయ ప్రకటనల విషయంలో కూడా వైసీపీ జాగ్రత్తగా వ్యవహరించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొందరు విషయంలో ప్రతిస్పందించడం ద్వారా వైసీపీ అసలైన రాజకీయ ప్రాధాన్యతల నుండి దృష్టి మరల్చడమే అవుతుందని దాని వల నష్టమే ఎక్కువ అని గ్రహించి ఇలాంటి రూట్ ఎంచుకున్నారు అని అంటున్నారు. ఇటీవల కాలంలో పవన్ వ్యక్తిగత వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు అని జగన్ కట్టడి చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి వైసీపీ తన రాజకీయ పోరాటం మొత్తం టీడీపీతోనే అని భావిస్తోంది. ఆ దిశగానే ఫోకస్ పూర్తిగా పెట్టాలని డిసైడ్ అయింది అని అంటున్నారు.
