Begin typing your search above and press return to search.

భీమవరం కూటమిలో బీజేపీ రగడ.. తగ్గేదేలే అంటున్న కేంద్ర మంత్రి

భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. 52 వార్డుల్లో టీడీపీకి 24, జనసేనకు 23, బీజేపీకి 5 కేటాయించగా, వార్డుల ఎంపికలో తమను సంప్రదించలేదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అన్ని స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు.

By:  Tupaki Political Desk   |   17 Nov 2026 12:30 AM IST
భీమవరం కూటమిలో బీజేపీ రగడ.. తగ్గేదేలే అంటున్న కేంద్ర మంత్రి
X

రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమి రాజకీయాల్లో సీట్ల సర్దుబాటుపై గందరగోళం నెలకొంది. మూడు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిన చోట, టీడీపీ, జనసేనకు అవసరం లేని సీట్లను తమకు కేటాయిస్తారని బీజేపీ అసంతృప్తి చెందుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా వెల్లడించడం హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర మంత్రి సొంత పట్టణమైన భీమవరంలో బీజేపీకి 5 కౌన్సిల్ స్థానాలు కేటాయించారు. కేంద్ర మంత్రి సమక్షంలోనే ఐదు స్థానాలు తీసుకోడానికి అంగీకారం కుదిరిందని చెబుతున్నారు. అయితే ఏయే స్థానాలు కేటాయిస్తున్న విషయమై కేంద్ర మంత్రికి చెప్పకపోవడం వివాదానికి దారి తీసిందని అంటున్నారు. తమను కూటమిలో అవమానిస్తున్నారనే అభిప్రాయంతో భీమవరం మున్సిపాలిటీలో అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

భీమవరం మున్సిపాలిటీలో పొత్తులతో సంబంధం లేకుండా బీజేపీ పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చేసిన ప్రకటనతో కలకలం రేగింది. మున్సిపాలిటీలో మొత్తం 52 వార్డులు ఉండగా, 24 చోట్ల టీడీపీ, 23 చోట్ల జనసేన, 5 చోట్ల బీజేపీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం టీడీపీ మహిళానేత తోట సీతామహాలక్ష్మి నివాసంలో జరిగిన సమావేశంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, టీడీపీ నుంచి జిల్లా అధ్యక్షురాలు మంతెన రామరాజు, జనసేన నుంచి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు సమక్షంలో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది. చైర్మనుగా జనసేన, వైస్ చైర్మన్ పదవులను టీడీపీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న విషయమై విభేదాలు పొడసూపాయని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన ఒక్కటై తమను కనీసం సంప్రదించలేదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నొచ్చుకున్నారు.

బీజేపీకి కేటాయించిన ఐదు సీట్లను కేంద్ర మంత్రి నివాసం చుట్టూ ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరో కౌన్సిల్ స్థానం టీడీపీ, జనసేన వద్దనుకుని కేటాయించాయని మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన నేతల వైఖరి కారణంగా తమ పార్టీకి చెందిన నేతలు పోటీకి అవకాశం లభించలేదని కేంద్రమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నారు. భీమవరం మున్సిపాలిటీలో గడిచిన 40 ఏళ్లుగా బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుందని, ఇప్పుడు పొత్తుల వల్ల కొత్తగా తమకు వచ్చే లాభమేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అవమానించారని, మున్సిపాలిటీలో సొంతంగా పోటీ చేసి బీజేపీ సత్తా ఏంటో చూపుతామని సవాల్ చేశారు. దీంతో కూటమి నేతలు కంగారు పడుతున్నారు.

ఎప్పుడూ శాంతంగా ఉండే కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడం చర్చనీయాంశం అవుతోంది. కేంద్రమంత్రి హోదాలో ఉంటూ ఆయన పొత్తులపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. పొత్తులు, సర్దుబాట్లు వంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదన ఆయన మాటల్లో కనిపించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పట్టణంలో అన్ని స్థానాలకు నామినేషన్లు వేయాలని కేంద్రమంత్రి నిర్ణయించడంతో కూటమి పార్టీలు ఉలికిపాటుకు గురయ్యాయి. సీట్ల సర్దుబాటుపై చర్చించిన సమయంలోనే ఏ పార్టీ ఏ వార్డులో పోటీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటే వివాదానికి తావు లేకుండా ఉండేదని అంటున్నారు. ఈ విషయంలో స్థానికుడు అయిన కేంద్ర మంత్రిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన ఆవేదనకు గురయ్యారని, అదే ఆగ్రహంగా మారిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయాలని కేంద్ర మంత్రి నిర్ణయించడంతో పట్టణంలో పలు వార్డుల్లో బీజేపీ కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయంతో భీమవరం రాజకీయాలు వేడెక్కాయి. అయితే చివరి వరకు బీజేపీ పోటీలో ఉంటుందా? లేక తమకు అవసరమైన వార్డులు కేటాయిస్తే మిగిలిన వార్డుల్లో ఉపసంహరించుకుంటుందా? అనేది చూడాల్సివుందని అంటున్నారు.