'వర్మ' గారి గుండెల్లో గుబులు.. రీజన్ ఇదే.. !
భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 5 వార్డులే కేటాయించడంపై ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ టీడీపీ, జనసేనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో బీజేపీ ప్రాబల్యం తగ్గుతుందనే ఆందోళనే ఆయన అసంతృప్తికి కారణమని విశ్లేషకుల అభిప్రాయం. అయితే గతంలో టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడే బీజేపీ ఇక్కడ గెలిచిందనే అంశం కూడా చర్చకు వస్తోంది.
By: Garuda Media | 23 Nov 2026 4:56 PM ISTఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యంత కీలకమైన నరసాపురం పార్లమెంటుస్థానం నుంచి గత 2024 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న బీజేపీ నాయకుడు.. మరో మాటలో చెప్పాలంటే.. ఆర్ ఎస్ ఎస్ ఆత్మీయ నేత.. భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యవహారం... కూటమిలో రాజకీయంగా దుమారం రేపింది. దీనిపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు టీడీపీని, అటు జనసేనను కూడా ఆయన విమర్శించారు. దీనిపై పార్టీ అంతర్గతంగా మథనం చెందుతున్నా.. కేంద్రం స్థాయిలోను, ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ స్థాయిలోను వర్మకు మంచి ఇమేజ్ ఉంది.
ఈ నేపథ్యంలో ఆయన వ్యవహారాన్ని పార్టీ స్థానిక నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా.. ఆయనకు ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఆయనను హెచ్చరించే పరిస్థితి లేకుండా పోయింది. వివాదం విషయాని కి వస్తే.. తన సొంత నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో కనీసం సమాచారం ఇవ్వలేదన్నది ఆయన ఆవేదన. అంతేకాదు.. భీమవరం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి సమాచారం ఇవ్వకుండా, సంప్రదించకుం డానే టీడీపీ, జనసేన నేతలు అభ్యర్థుల జాబితాలు ప్రకటించారని శ్రీనివాస వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మొత్తం 52 వార్డులు ఉన్న భీమవరం మున్సిపాలిటీలో బీజేపీకి కేవలం 5 వార్డులు కేటాయించడం, ఆ వార్డులు ఏమిటో కూడా మిత్రపక్షాలే నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్టీకి బలం ఉన్న వార్డులను కాకుండా తమ నివాస ప్రాంతంలోని వార్డులనే కేటాయించారని బీజేపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలపై కూటమి మిత్రపక్షాలైన జనసేన, టీడీపీలను ఆయన విమర్శించారు. అయినప్పటికీ.. వివాదమేమీ సర్దుబాటు కాలేదు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయిపోయిన దరిమిలా.. ఎవరూ మాట్లాడడం కూడా లేదు.
అసలు సమస్య ఏంటి.. ?
మంత్రి భూపతిరాజు ఇంత ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేయడానికి అసలు కారణం వేరే ఉందని విశ్లేషకులు చెబుతు న్నారు. నరసాపురం వంటి కీలక నియోజకవర్గంలో తన హవా ఎక్కడ దెబ్బతింటుందోనన్నది వర్మగారి ఆవేదనగా ఉందని చెబుతున్నారు. తన చుట్టూ అంటే.. తన నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ, జనసేన విస్తరిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి తన వ్యక్తిగత విజయం కోసం శ్రమించాల్సి వస్తుందన్నది ఆయన ఆలోచన. అలా కాకుండా.. బీజేపీ తరఫున ఎక్కువ మందికి అవకాశం ఇస్తే.. బీజేపీ గాలి వీస్తుందని.. అప్పుడు తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ సహా.. విజయం విషయంపై ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు.
వాస్తవం ఏంటి.. ?
కానీ, వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. గతంలో బీజేపీ రెండు సార్లు విజయం దక్కించుకుని ఉండొచ్చు. 1999, 2014లో రెండు సార్లు బీజేపీ విజయం దక్కించుకున్నమాట వాస్తవం. కానీ, ఎవరి వల్ల ఈ విజయం వచ్చింది? అనేది కీలక పాయింట్. టీడీపీతో చేతులు కలిపినప్పుడు మాత్రమే ఇక్కడ బీజేపీ విజయం దక్కించుకుంది. ఈ చిన్న లాజిక్‌ను వర్మగారు మరిచిపోతున్నారా? లేక.. సొంత బలం పెరిగిపోయిందని అనుకుంటున్నారా? అనేది ఆయనే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు.
