Begin typing your search above and press return to search.

తేడా స్వల్పం.. ఫలితాల్లో చాలా వ్యత్యాసం - విజయనగరం జిల్లా ఓట్ల లెక్కలు ఆసక్తికరం

విజయనగరం జిల్లాలో స్థానిక ఎన్నికల్లో టీడీపీకి 4,19,480 ఓట్లు, వైసీపీకి 4,13,528 ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య తేడా కేవలం 6,048 ఓట్లు. అయితే జనసేన, బీజేపీ ఓట్లతో కలిపి కూటమి ఆధిక్యం 94,825కు చేరింది. సీట్ల పరంగా కూటమికి 22, వైసీపీకి 5 స్థానాలు దక్కాయి. గజపతినగరం, చీపురుపల్లిలో వైసీపీ రెండేసి స్థానాలు గెలుచుకుంది.

By:  Tupaki Political Desk   |   9 Nov 2026 11:00 PM IST
తేడా స్వల్పం.. ఫలితాల్లో చాలా వ్యత్యాసం - విజయనగరం జిల్లా ఓట్ల లెక్కలు ఆసక్తికరం
X

స్థానిక ఎన్నికలలో ఓట్ల లెక్కలు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. రాయలసీమ, పల్నాడు వంటి జిల్లాల్లో ఏకపక్ష ఏకగ్రీవాలు జరిగాయని విపక్షం విమర్శలు చేస్తున్నప్పటికీ, పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో మాత్రం వైసీపీ గట్టి పోటీ ఇచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో అధికార టీడీపీ, విపక్షం మధ్య కేవలం ఆరు వేల ఓట్ల తేడా మాత్రమే ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో కూటమిగా చూస్తే మాత్రం తేడా సుమారు 94 వేల 825 ఓట్ల వ్యత్యాసం ఉంది. అయితే సీట్ల విషయంలో మాత్రం ప్రతిపక్షం అధికార కూటమి దరిదాపుల్లో కూడా లేకుండాపోయింది.

విజయనగరం జిల్లాలో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ జిల్లాలో మొత్తం 9,79,848 ఓట్లు పోలవ్వగా, అధికార టీడీపీకి 4,19,480 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో వైసీపీకి 4,13,528 ఓట్లు పోలయ్యాయి. దీంతో రెండు పార్టీల మధ్య తేడా కేవలం 6,048 ఓట్లు మాత్రమే అంటున్నారు. అయితే టీడీపీ కూటమిగా పోటీ చేయడంతో జనసేన, బీజేపీకి వచ్చిన ఓట్లు కలుపుకుంటే 5,14,305 ఓట్లు వచ్చాయి. కూటమిలో జనసేనకు 72,381 ఓట్లు రాగా, బీజేపీకి 16,396 ఓట్లు పోలయ్యాయి. ఇక ఆయా పార్టీలు సాధించిన సీట్లు గమనిస్తే వ్యత్యాసం భారీగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కూటమిలో టీడీపీకి 20, జనసేన 2 స్థానాలు గెలిస్తే విపక్షం వైసీపీ మాత్రం కేవలం 5 సీట్లకే పరిమితమైంది. ఈ లెక్కలు గమనిస్తే జిల్లాలో వైసీపీ అధికార కూటమికి గట్టిపోటీ ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వ్యూహాత్మకంగా వైసీపీ

విజయనగరం జిల్లాలో వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపి తన ఓటు బ్యాంకును కాపాడుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా, కూటమి, వైసీపీ మధ్య దాదాపు 94825 ఓట్ల వ్యత్యాసం ఉందని అంటున్నారు. అంటే ఒక్కో మండలంలో సగటు తేడా కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోల్చిచూస్తే వైసీపీ తన ఓటు బ్యాంకును మెరుగుపరచుకుందని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయని అంటున్నారు. అయితే మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను కలిపి చూస్తే తేడా ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం వైసీపీ మునుపటి కంటే మెరుగైన పరిస్థితికి వచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కీలక నియోజకవర్గాల్లో సత్తా

పరిషత్ ఎన్నికల్లో అధికార కూటమికి దీటుగా వైసీపీ నిలబడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీట్ల పరంగా చూస్తే అధికార కూటమి దరిదాపుల్లో విపక్షం లేకపోయినప్పటికీ కొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం సత్తా చాటిందని చెబుతున్నారు. ప్రధానంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం, సీనియర్ నేత, టీడీపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ గణనీయంగా పుంజుకుందని చెబుతున్నారు. చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నేత బొత్స, గజపతినగరంలో బొత్స సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అప్ప నరసయ్య ప్రత్యేక దృష్టి పెట్టి సత్ఫలితాలు సాధించారని అంటున్నారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో రెండేసి సీట్లను వైసీపీ కైవసం చేసుకోగలిగిందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి విజయనగరం జిల్లా వరకు వైసీపీ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని స్థానిక ఎన్నికలు నిరూపించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.