Begin typing your search above and press return to search.

వైసీపీ హైకమాండ్ కారణం...నేతల రుసరుసలు

సాలూరు మున్సిపాలిటీలో వైసీపీ కేవలం 297 ఓట్ల తేడాతో చైర్‌పర్సన్ పీఠాన్ని కోల్పోయింది. 13 వార్డులను గెలుచుకున్నప్పటికీ స్వల్ప తేడాతో అధికారం చేజారింది. ఈ నేపథ్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర నిర్వహించిన సమావేశంలో వైసీపీ నేతలు పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థులకు ఆర్థికంగా అండగా నిలవలేదని ఆరోపించారు. ఈ విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని రాజన్నదొర తెలిపారు.

By:  Satya P   |   7 Nov 2026 9:30 AM IST
వైసీపీ హైకమాండ్ కారణం...నేతల రుసరుసలు
X

ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు మునిసిపాలిటీలో వైసీపీ గెలిచి ఓడింది. అది నిజమే. కేవలం 297 ఓట్లే తేడాతో చైర్ పర్సన్ పీఠం ఫ్యాన్ పార్టీ చేజారింది. ఇక మునిసిపల్ వార్డులు చూస్తే 13 దాకా వైసీపీ గెలుచుకుంది. సాలూరులో కాంగ్రెస్ కి తరువాత వైసీపీకి బలం ఉంది. పీడిక రాజన్న దొర 2007 నుంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 వరకూ ఆయన కొనసాగారు. జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా రాజన్నదొర పనిచేశారు. అంతటి పట్టు ఆయనకు ఉంది. అయితే 2024 లో కూటమి ప్రభంజనంలో అందరితో పాటు ఆయన కూడా ఓటమి పాలు అయ్యారు. అయితే గత రెండున్నరేళ్ళుగా పార్టీని ఆయన పటిష్టం చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రాలో వైసీపీకి ఆశలు ఉన్న సీటు ఏదైనా ఉంది అంటే అది సాలూరు మునిసిపాలిటీ అని అంతా అనుకున్నారు. పోరు కూడా అలాగే సాగింది. కానీ రిజల్ట్ మాత్రం చూస్తే కొద్దిలో పీఠం జారిపోయింది. దాంతో వైసీపీ నేతల బాధ వర్ణనాతీతంగా ఉంది అని అంటున్నారు.

పట్టించు కోలేదంటూ :

ఫలితాలు వచ్చిన తరువాత రాజన్నదొర పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు అధిష్ఠానం తీరుని తప్పుపట్టారు. ఓటమికి హైకమాండ్ బాధ్యత వహించాలని వారు చెప్పడం విశేషం. ఇలా ఎందుకు అంటే పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థికంగా ఏ విధంగానూ అండగా హైకమాండ్ లేకుండా పోయింది అని నేతలు రుసరుసలాడారు. అవతల వైపు అధికార బలం అంగబలం అర్ధబలం తోడై వచ్చిందని వారు అంటున్నారు. దానిని ధీటుగా తట్టుకోవాలంటే తమకు ఆర్థికంగా సహకారం అందించాల్సి ఉంది అని వారు చెప్పుకొచ్చారు. అయితే ఖర్చు అంతా అభ్యర్ధులే భరించాలనడంతోనే స్వయం కృషితో చేసిన పోరాటానికి ఈ ఫలితాలు వచ్చాయని అంటున్నారు. అదే అధినాయకత్వం అండగా నిలిస్తే సాలూరు పీఠం తమ వశం అయ్యేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

దృష్టిలో పెడతామని :

అయితే ఆవేశంతో నేతలు చేసిన ఆ కామెంట్స్ ని రాజన్న దొర సానుకూలంగానే తీసుకున్నారు. అన్ని విషయాలూ హైకమాండ్ దృష్టికి తాను తీసుకుని వస్తాను అని ఆయన అన్నారు. పార్టీ తరఫున అంతా కష్టపడ్డారని వైసీపీకి ఇది నైతిక విజయం అని రాజన్న దొర చెప్పడం విశేషం. అదే సమయంలో ఒక్క 150 ఓట్లు వచ్చి ఉంటే చైర్మన్ పదవి కూడా వైసీపీదే అయ్యేదని ఆయన అన్నారు. సాలూరు మునిసిపాలిటీలో 2024లో కూటమికి 12 వేల పై దాటి ఓట్లు వచ్చాయని అదే మున్సిపాలిటీ ఎన్నికలకు వచ్చేసరికి సగానికి సగం ఆరు వేలకు చేశామని ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఈ నంబర్ తిరగబడి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రాజన్న దొర ధీమా వ్యక్తం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే చాలా చోట్ల వైసీపీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చేతులెత్తేసిందని అంటున్నారు. దాంతో ఓటమి దక్కిందని చెబుతున్నారు. సాలూరుతో పాటు అనేక చోట్ల క్యాడర్ మాట ఇలాగే ఉందని అంటున్నారు. మరి దీని మీద హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.