పీఏ గారి ఎమ్మెల్యే.. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతపై విమర్శలు
ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే తన వ్యక్తిగత సహాయకుడిపై అధికంగా ఆధారపడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో అధికారులు, పార్టీ నేతలు పీఏ అనుమతితోనే పనులు చేయాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఎదురైన ఓటములకు కూడా పీఏ వ్యవహారశైలే కారణమని పార్టీ శ్రేణులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
By: Tupaki Political Desk | 12 Nov 2026 10:00 PM ISTపీఏ గారి ఎమ్మెల్యే.. ఎఫ్2 సినిమాలో డైలాగ్ అనుకుంటున్నారా? నిజమే ఈ డైలాగ్ ను అక్షరాలా నిజం చేస్తున్నారు ఉత్తరాంధ్రలోని ఓ ఎమ్మెల్యే. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా గుర్తింపు పొందిన ఆ ఎమ్మెల్యే పరిపాలన పరమైన విషయాలతోపాటు పార్టీ వ్యవహారాల్లోనూ తన వ్యక్తిగత సహాయకుడిపై ఎక్కువగా ఆధారపడుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏనే సర్వం అన్నట్లుగా చక్రం తిప్పుతున్నారని టాక్ నడుస్తోంది.
నియోజకవర్గంలో ఎవరికి ఏ పని కావాలి అన్నా ఎమ్మెల్యే ప్రైవేటు పీఏను సంప్రదించాల్సివస్తోందని అంటున్నారు. అధికారులు అయినా, పార్టీ నేతలు అయినా పీఏ అనుమతి లేకుండా ఏ పని చేయలేరని అంటున్నారు. దీంతో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో రెండు మండలాల్లో ఓటమిని ఎదుర్కోవాల్సివచ్చిందని, ఎమ్మెల్యే కుటుంబం కూడా మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
పరిపాలనపరమైన వ్యవహారాలలో సహయపడాల్సిన వ్యక్తి.. ఏకంగా ఎమ్మెల్యేను డామినేట్ చేస్తున్నట్లు వ్యవహరిస్తుండటమే హాట్ టాపిక్ అవుతోంది. ఉత్తరాంధ్రలోని ఒక ప్రధాన సామాజికవర్గానికి నేతృత్వం వహిస్తున్న సదరు నేత గతంలో ఎప్పుడూ లేనట్లుగా ప్రస్తుతం తన పీఏకు బాధ్యతలు వదిలేయడమే విమర్శలకు తావిస్తోందని చెబుతున్నారు. రాష్ట్రంలో పలు పదవులు అనుభవించిన ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని పార్టీ శ్రేణులు సనుగుతున్నాయి.
ఇటీవల మండల పరిషత్ ఎన్నికల్లో ఓ మండలానికి చెందిన నాయకుడు పార్టీ వదిలి వెళ్లిపోవడానికి ఆ పీఏనే కారణమని అంటున్నారు. దీనివల్ల పార్టీ మారిన నేత వైసీపీ నుంచి గెలవడమే కాకుండా, అక్కడ పార్టీ జడ్పీటీసీ ఓటమికి కారణమయ్యాడని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ మండలంలో మెజార్టీ ఎంపీటీసీలు వైసీపీ గెలవడం వల్ల ఎంపీపీ కూడా అయ్యే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
పార్టీతోపాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచాల్సిన ఎమ్మెల్యే తన పీఏ కారణంగా ఎదురుదెబ్బలు తింటున్నారని అంటున్నారు. కొందరు నేతల వద్ద డబ్బులు వసూలు చేయడం దగ్గర నుంచి పనుల కోసం వచ్చిన వారితో దురుసుగా మాట్లాడటం, ఎమ్మెల్యే బదులుగా తనే ప్రతి వ్యవహారంలోనూ తలదూర్చుతూ పార్టీ నేతలను అవమానాలకు గురిచేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్లుగా చెబుతున్నారు. సదరు ఎమ్మెల్యే పార్టీలో అత్యంత సీనియర్ కావడం వల్ల అధిష్టానం కూడా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని అప్రమత్తం చేసిందని చెబుతున్నారు. అయితే సదరు పీఏ ఆ ఎమ్మెల్యే వద్ద సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నందున లైట్ తీసుకున్నారని, దీంతో స్థానిక ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారని చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే తన పీఏ వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. లేనిపక్షంలో రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు. పీఏ కారణంగా ఎమ్మెల్యే గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఇబ్బందులు పడ్డారని, కేడర్ తో చాలా గేప్ వచ్చిందని, ఇప్పుడు కొత్త నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి రిపీట్ అవడం వల్ల విపక్షానికి మేలు జరుగుతోందని అంటున్నారు. పీఏ వ్యవహారశైలి వల్లే సీనియర్ ఎమ్మెల్యే అయివుండి మంత్రిగా అవకాశం దక్కించుకోలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. కానీ, ఎమ్మెల్యే మాత్రం తన పీఏను అన్నివిధాల ప్రోత్సహిస్తూ అప్రతిష్ట మూటగట్టుకోవడమే ఎవరికీ అంతుచిక్కడం లేదని చెబుతున్నారు.
