గ్యారెంటీ లేని జడ్పీ పీఠం.. చిన్న శ్రీను కూతురు సిరి సహస్రకు బీసీ గండం?
విజయనగరం జడ్పీ చైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఆమె బీసీ కాదంటూ వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో వివాదం కొనసాగుతోంది. ఆమె బీసీ సర్టిఫికెట్‌పై ఏడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైకోర్టు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ నివేదిక, తదుపరి కోర్టు నిర్ణయంపై ఆమె పదవీకాలం ఆధారపడి ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.
By: Tupaki Political Desk | 20 Nov 2026 10:52 PM ISTవిజయనగరం జడ్పీ చైర్ పర్సన్ గా మజ్జి సిరిసహస్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్పీలో టీడీపీ కూటమికి మెజార్టీ స్థానాలు దక్కడంతో సిరి సహస్ర ఎన్నిక లాంఛనమే అయింది. అయితే బీసీ మహిళకు రిజర్వు చేసిన జడ్పీ చైర్ పర్సన్ స్థానంలో సిరి సహాస్రను ఎలా ఎన్నుకుంటారని వైసీపీ ప్రశ్నిస్తోంది. జడ్పీటీసీగా నామినేషన్ వేసిన సందర్భంలోనే ఆమె కులంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టులో పిటిషన్లు కూడా వేసింది. వివాదంపై కోర్టులో విచారణ జరుగుతుండగానే సిరి సహస్ర జడ్పీ బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశం అవుతోంది. సిరి సహస్ర బీసీ సర్టిఫికెట్ పై కోర్టు తీర్పు వెలువరించే వరకు ఆమె పదవిపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.
టీడీపీ కీలక నేత మజ్జి శ్రీనివాసరావు కుమార్తె అయిన సిరి సహస్రను విజయనగరం జడ్పీ చైర్ పర్సనుగా ఎంపిక చేసిన అధిష్టానం ఈ విషయంలో నెలకొన్న గందగోళానికి పుల్ స్టాప్ పెట్టింది. అయితే సిరి సహస్ర కులంపై కొనసాగుతున్న వివాదానికి ఎటువంటి ముగింపు వస్తుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోందని అంటున్నారు. జడ్పీ పీఠం కోసం ఎందరో ప్రయత్నించినప్పటికీ అధిష్టానం ముందుగా ఇచ్చిన మాట ప్రకారం మజ్జి సిరి సహస్రకు అవకాశం ఇచ్చిందని అంటున్నారు. అయితే ఆమె బీసీ వర్గానికి చెందినట్లుగా కోర్టులో నిరూపించుకుంటేనే ఆమె ఐదేళ్లు పదవీకాలం చేపట్టేందుకు వీలవుతుందని అంటున్నారు.
ఏంటీ వివాదం?
జడ్పీ చైర్ పర్సన్ మజ్జి సిరి సహస్ర బీసీ కాదంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. తెర్లాం జడ్పీటీసీ సభ్యురాలిగా నామినేషన్ వేసిన సమయంలోనే బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదుచేశారు. అయితే తెర్లాం జడ్పీటీసీ స్థానం జనరల్ కేటగిరీకి చెందినది కావడంతో ఆమె నామినేషన్ ఆమోదం పొందినట్లు చెబుతున్నారు. వైసీపీ ఫిర్యాదు, కోర్టు సూచనలతో ముందుగా బీసీ కేటగిరీ కింద నామినేషన్ వేసినప్పటికీ తర్వాత పూర్తి మొత్తం డిపాజిట్ చెల్లించడంతో నామినేషన్ ఆమోదం పొందిందని అంటున్నారు. అయినప్పటికీ ఆమెను జడ్పీ చైర్ పర్సను కాకుండా అడ్డుకోవాలనే నిర్ణయంతో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇప్పటికే వాదనలు జరగగా, కోర్టు ఈ వివాదంపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత విచారణలో తమ నిర్ణయం వెలువరిస్తామని కోర్టు ప్రకటించిందని చెబుతున్నారు.
సిరి సహస్ర బీసీ కాదా?
టీడీపీ సీనియర్ నేత, జడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె అయిన సిరి సహస్ర బీసీ కాదనేది రాజకీయ ప్రత్యర్థుల ఫిర్యాదుగా చెబుతున్నారు. మజ్జి శ్రీనివాసరావు బీసీ అయినప్పటికీ ఆయన దత్త పుత్రికగా సిరి సహస్ర బీసీ ప్రయోజనాలు పొందలేరని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. సిరి సహస్ర జైన్ సామాజిక వర్గానికి చెందిన వారని, ఆమె పదో తరగతి వరకు ఆ సామాజిక వర్గం కిందే కొనసాగారని అంటున్నారు. తర్వాత మజ్జి శ్రీనివాసరావు దత్తత తీసుకున్నట్లు వైసీపీ నేతలు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే దీనిపై నవంబరు 16న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సిరి సహస్రకు బీసీ సర్టిఫికెట్ జారీ అయిందని, చట్టప్రకారం సంబంధిత అధికారి రద్దు చేసేంత వరకు ఆ కుల ధ్రువీకరణ పత్రం చెల్లుబాటులో ఉంటుందని కోర్టు పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఆమె ఎన్నికకు ఆటంకం లేకపోయిందని అంటున్నారు. అయితే కోర్టు సూచనలతో ఆమె బీసీ సర్టిఫికెట్ పై ఏడు రోజుల్లోగా విచారణ జరిపి తేల్చాలని జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్ నివేదకపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పుడెలా?
విజయనగరం జడ్పీ చైర్ పర్సనుగా ఎన్నికైన సిరిసహస్ర భవితవ్యంపై సస్పెన్స్ నెలకొంది. ఆమె బీసీనో కాదో మరో తేల్చాలని హైకోర్టు ఇచ్చిన గడువుకు ఇంకా నాలుగు రోజులే ఉందని చెబుతున్నారు. కోర్టు ఆదేశాల వల్ల ఎన్నిక సమయానికి ఆమె బీసీ సర్టిఫికెట్ చెల్లుబాటు అయినందున ఎన్నిక ప్రక్రియకు ఆటంకం లేకపోయిందని అంటున్నారు. అయితే కలెక్టర్ విచారణలో ఆమె బీసీ అర్హతపై ఎటువంటి నిర్ణయం వెలువడుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. వైసీపీ ఫిర్యాదు వల్ల తాను బీసీని సిరి సహస్ర నిరూపించుకోవాల్సివుందని అంటున్నారు. దీంతో విజయనగరం జడ్పీ చైర్ పర్సన్ గా సిరి సహస్ర ఎన్నిక జరిగినా, కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఆమె పదవీకాలంపై గ్యారెంటీ లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
