చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం
విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణకు చిన్న శ్రీను రూపంలో కొత్త సవాల్ ఎదురైంది. టీడీపీలో చేరిన చిన్న శ్రీను జిల్లా పరిషత్ పీఠాన్ని గెలిచి తన కుమార్తె సిరి సహస్రను చైర్‌పర్సన్‌గా కూర్చోబెట్టారు. దీంతో జిల్లాలో టీడీపీ బలం పెరిగిందనే చర్చ మొదలైంది. త్వరలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది.
By: Satya P | 20 Nov 2026 11:10 PM ISTవిజయనగరం జిల్లాలో కొత్త రాజకీయానికి దారులు తెరచుకున్నాయి. దశాబ్దాల తరబడి సాగిన పాత రాజకీయానికి చెక్ పెడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ వైసీపీల నుంచి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వెంట ఉండి ఆయన కుడి భుజం గా పనిచేసిన చిన్న శ్రీను టీడీపీలోకి రావడంతో మొత్తం సమీకరణలే మారిపోయాయి. చిన్న శ్రీను తన బల నిరూపణగా జిల్లా పరిషత్తు ఎన్నికలను తీసుకున్నారు. అటు వైసీపీ నుంచి బయటకు వచ్చి తానేంటో నిరూపించుకోవడంతో పాటు టీడీపీ తన మీద పెట్టిన బాధ్యతను కూడా నెరవేర్చి ఆయన జిల్లాలో సత్తా చాటారు. మొత్తానికి జిల్లా పరిషత్తు పీఠాన్ని గెలిచి తన కుమార్తె సిరి సహస్రను కూర్చోబెట్టగలిగారు.
బొత్స వర్సెస్ చిన్న శ్రీను :
ఇక మీదట జిల్లా రాజకీయం బొత్స వర్సెస్ చిన్న శ్రీనుగా సాగనుంది అని అంటున్నారు. బొత్స సొంత మేనమామ మాత్రమే కాదు రాజకీయ గురువుగా చిన్న శ్రీనుకు ఉన్నారని చెబుతారు. అయితే ఎల్లకాలం రాజకీయాలు ఒకేలా ఉండవు అని అంటారు. అందుకే చిన్న శ్రీను తాను సొంతంగా నిలబడాలని అనుకున్నారు. తన వారసురాలిని అందలం మీద చూడాలని అనుకున్నారు. తన పంతాన్ని ఆయన నెరవేర్చుకున్న తీరుని చూసిన వారు విజయనగరం జిల్లా రాజకీయాలలో చిన్న శ్రీను హవా స్టార్ట్ అయింది అని అంటున్నారు. టీడీపీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. అయితే ఇపుడు చిన్న శ్రీను మీద అధినాయకత్వం ప్రత్యేక దృష్టి నిలిపింది అని అంటున్నారు.
వైసీపీకి సంక్లిష్టం :
బొత్స సత్యనారాయణకు బంధుగణం నుంచే ఈ ఎదురీత వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇపుడు ఆయనకు చిన్న శ్రీను ప్రత్యర్థిగా మారి టీడీపీ కూటమి నుంచి సవాల్ విసురుతున్నారు. ఆయనకు అంగ బలం అర్ద బలానికి తోడు అధికారం అండ కూడా ఉంది. పైగా సామాజిక వర్గంలో కూడా మొగ్గు తన వైపే ఎక్కువ అని ఆయన నిరూపించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బొత్స నేరుగానూ ఆయన నాయకత్వంలోని వైసీపీ కూడా విజయనగరం జిల్లాలో రాజకీయంగా సంక్లిష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది అని అంటున్నారు.
మరిన్ని పదవులు :
ఇక విజయనగరం జిల్లాలో వైసీపీకి ఎక్కువగా బలం ఉంది. విశాఖ శ్రీకాకుళంలలో టీడీపీకి పట్టు ఉన్నా పూర్తి స్థాయిలో విజయనగరం జిల్లా అంతటా వైసీపీ గట్టిగా మోహరించిన తీరు ఆ జిల్లాలలో లేదని అంటారు. దానికి కారణం బొత్స ఆయన వెంట ఉన్న నాయకత్వం అని కూడా చెబుతారు. ఇపుడు చిన్న శ్రీనుని ఈ వైపునకు తీసుకుని రావడం ద్వారా భారీ చీలికనే టీడీపీ వైసీపీలో తెచ్చింది అని అంటున్నారు. 2019లో విజయనగరం జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది సీట్లూ గెలుచుకున్న వైసీపీ తన బలాన్ని మరోసారి 2029 లో నిరూపించుకోవాలని చూస్తున్న వేళ టీడీపీ రాజకీయ చాణక్యంతో దెబ్బ తిన్నది అని అంటున్నారు. చిన్న శ్రీనుకు టీడీపీలో రానున్న రోజులలో మరింత ప్రాధాన్యత దక్కుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవులు ఇరవైకి పైగా ఖాళీ అవుతాయి అందులో ఒకటి ఆయనకు ఖాయమని కూడా ప్రచారం సాగుతోంది. 2029 లో టీడీపీని జిల్లాలో గెలిపిస్తే కనుక చిన్న శ్రీను రాజకీయానికి తిరుగు ఉండదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
