బొత్సను సవాల్ చేస్తున్న బంధువులు
ఇక బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనకు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది.
By: Satya P | 31 Oct 2026 9:31 AM ISTవిజయనగరం జిల్లాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎదురు లేదన్నది తెలిసిందే. ఆయన సామాజిక వర్గంతో పాటు రాజకీయంగా చూపించే చతురత బంధు వర్గం, మందీ మార్బలం ఇవన్నీ దశాబ్దాలుగా విజయనగరాన్ని రాజకీయ కోటగా చేసుకుని పాలించారు. అయితే అన్ని కాలాలూ ఒక్కటిగా ఉండవు అన్నది తెలిసిందే. ఇపుడు టీడీపీ కూటమి వేస్తున్న పై ఎత్తులతో బొత్స కోటకు బీటలు వారుతున్నాయని అంటున్నారు. తన మేనల్లుడు కుడి భుజం అయిన చిన్న శ్రీను టీడీపీలో జీర్ణించుకోవడాన్ని తట్టుకోలేకపోతున్న బొత్సకు ఇపుడు మరో బంధువు అదే పార్టీలో చేరి సవాల్ చేస్తున్నారు. నెల్లిమర్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తాజాగా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
రెండు సార్లు గెలిచిన వైనం :
ఇక బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనకు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2009, 2019లలో రెండు సార్లు ఆయన నెల్లిమర్ల నుంచి గెలిచారు. ఆయనకంటూ ప్రత్యేక వర్గం ఉంది. ఆయన బొత్సకు బంధువు అవుతారు. ఇపుడు ఆయన టీడీపీలో చేరి బొత్సకే పరీక్ష పెడుతున్నారు. ఇక చిన్న శ్రీను ఆయనకు స్వయంగా వియ్యంకుడు. దాంతో కాస్తా లేటు గా అయినా లేటెస్ట్ గా ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన కోడలు సిరి సహస్ర జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రేసులో ఉంది. దాంతో అప్పలనాయుడు తన వంతుగా గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు అని అంటున్నారు.
బలమైన చోటనే :
ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ చాలా కాలంగా అప్పలనాయుడు వైసీపీ వ్యవహారాలను చూసుకుంటూ వస్తున్నారు. ఇపుడు ఆయన టీడీపీలో చేరడంతో ఆయనతో పాటు బలమైన వర్గం నేతలు కూడా సైకిలెక్కేశారు. ఇక్కడ అయిదురుగు జెడ్పీటీసీలు ఉన్నారు. వీరిని వైసీపీ ఎలా గెలిపించుకుంటుంది అన్నది చర్చగా ఉంది. అలాగే చిన్న శ్రీనుకు గజపతినగరం, చీపురుపల్లి, ఎస్ కోటలలో బలం ఉంది అని అంటున్నారు. దాంతో విజయనగరం జిల్లాలో వైసీపీని గెలిపించడం అన్నది బొత్సకు అగ్ని పరీక్షగా మారుతోంది అని అంటున్నారు.
అదే సామాజిక వర్గంతో :
ఇదిలా ఉంటే గతంలో తూర్పు కాపులు ఎక్కువగా వైసీపీ వైపు ఉండేవారు, ఇప్పుడు అదే సామాజిక వర్గం వారికి టీడీపీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. కొండపల్లి శ్రీనివాస్ ని మంత్రిగా చేసింది. ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడుకు చాన్స్ ఇచ్చారు. డీసీసీబీ చైర్మన్ గా కిమిడి నాగార్జునని నియమించారు. చిన్న శ్రీను కూడా టీడీపీలో చేరడం బడ్డుకొండ అప్పలనాయుడు వంటి వారు పసుపు శిబిరానికి మద్దతుగా రావడంతో తూర్పు కాపులలో భారీ చీలిక ఏర్పడుతుందని టీడీపీ వైపు వారు నిలిచే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.
వారసుల గెలుపు :
ఇక బొత్స ఈ ఎన్నికల్లో తన వారసులను బరిలోకి దించారు. అటు కుమార్తె బొత్స అనూషను గజపతినగరం నుంచి జెడ్పీటీసీగా పోటీలో ఉంచితే ఇటు కోడలు సంధ్యను చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలో నిలబెట్టారు. మధ్యలో సొంత సోదరి లక్ష్మిని గుర్ల నుంచి పోటీ చేయిస్తున్నారు. ఈ మూడు జెడ్పీటీసీలు బొత్స ప్రతిష్టకు సవాల్ గా మారుతున్నాయని అంటున్నారు. విజయనగరం జిల్లా పరిషత్తులో మొత్తం 27 జెడ్పీటీసీలు ఉన్నాయి. అలాగే 449 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే 14 మంది జెడ్పీటీసీలు గెలవాలి. మరి బొత్స పలుకుబడి ఏ మేరకు పనిచేస్తుంది అన్నది ఈ ఎన్నికలు తేల్చనున్నాయని అంటున్నారు.
