మైండ్ సెట్ మారాలి...జగన్ కి చెప్పానంటున్న బొత్స !
ఏపీ రాజకీయాల్లో మార్పులకు అనుగుణంగా వైసీపీ కూడా తన వైఖరిని మార్చుకోవాలని బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, కక్షపూరిత రాజకీయాలను ఇకపై ఉపేక్షించబోమని, అలాంటి వారికి గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. ఈక్వాలిటీ పాలిటిక్స్ ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేయకపోవచ్చని, తన అభిప్రాయాలను జగన్కు కూడా వివరించినట్లు తెలిపారు.
By: Satya P | 15 Nov 2026 9:06 AM ISTవైసీపీలో బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసిన వారు, పీసీసీ చీఫ్ గా కూడా వ్యవహరించిన వారు. ఏపీ వ్యాప్తంగా అభిమానులు కలిగిన వారు. ఇక బొత్స రాజకీయ జీవితం చూస్తే ఆయన ఆచీ తూచీ మాట్లాడుతారు, దూకుడుగా వ్యవహరించరు అన్న పేరు ఉంది. ఆయన విమర్శలు కూడా విధానపరమైన గానే ఉంటాయి. ఇక కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన బొత్స రాజకీయాలలో ప్రత్యర్ధులనే చూస్తారు, శత్రు భావన ఉండదు, కానీ తాజాగా అదే బొత్స మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయం పూర్తిగా మారిపోయింది కాబట్టి వైసీపీ మైండ్ సెట్ కూడా మారాల్సిందే అని అంటున్నారు.
ఈక్వాలిటీ పాలిటిక్స్ :
ఈ పదం వాడింది బొత్సానే. ఏమిటీ ఈ ఈక్వాలిటీ పాలిటిక్స్ అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఇచ్చి పుచ్చుకునే ధోరణి అన్న మాట. అది పాత కాలంలో ఉండేది. ఎవరైనా పాలసీ పరంగానే మాట్లాడేవారు. కానీ ఇపుడు సీన్ మొత్తం మారిపోయింది. అందుకే సమానంగా ఏపీలో రాజకీయ ఆట సాగడం లేదని బొత్స అభిప్రాయపడ్డారు. మేము అంటాము మీరు పడాలి అంటే కుదరదని బొత్స అంటున్నారు. అందుకే పార్టీ శ్రేణుల ఆలోచనా విధానంలోనూ మైండ్ సెట్ లోనూ మార్పు రావాలని ఆయన అన్నారు.
చుక్కలు చూపిస్తాం :
లేటెస్ట్ గా విజయనగరంలో వైసీపీ సమావేశంలో బొత్స మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే వైసీపీ తన మైండ్సెట్ టోటల్ గా మార్చుకోవాల్సి వస్తుందని అంటున్నారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో చుక్కలు చూపిస్తామంటూ బొత్స ఘాటుగానే హెచ్చరించారు. అలాగే ఆ తరహా రాజకీయం కోరుకునే వారికి వైసీపీ తరఫున గట్టిగా బుద్ధి చెబుతామని బొత్స హెచ్చరిక సైతం జారీ చేశారు. ఇక గతంలో మాదిరిగా రాజకీయ ప్రత్యర్థులపై అనవసర సానుభూతి చూపిస్తామను కుంటే పొరపాటు అన్నారు. అందరినీ సమానంగా చూసే రాజకీయాలు ప్రస్తుత వాతావరణంలో ఇకపై పని చేయవేమోనని తబ బలమైన భావనగా ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ కి చెప్పాను :
తాను ఇదే విషయం మీద పార్టీ అధినాయకుడు జగన్ కి కూడా చెప్పాను అని బొత్స అన్నారు. ఏపీ రాజకీయాలలో మార్పుతున్న పరిణామాలు అలాగే వైసీపీకి ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులు అన్నీ కూడా చూసి మరీ తాను జగన్ కి తన అభిప్రాయాలను చెప్పాను అని అన్నారు. వైసీపీ వర్గాలు అనుసరించాల్సిన వైఖరిపై తన మనసులోని మాటను అధినేత జగన్ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినట్లుగా బొత్స వెల్లడించారు. అందుకే తాను గట్టిగా చెబుతున్నాను అని ఆయన అంటూ అధికార పార్టీ అనుసరించే కక్ష సాధింపు చర్యలను ఇకపై ఉపేక్షించేది లేదని బొత్స స్పష్టం చేశారు.
ఉన్నట్లుంది ఎందుకిలా :
ఇదిలా ఉంటే బొత్స సొంత బంధువు చిన్న శ్రీను టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన అక్కడ నుంచి వైసీపీని కట్టడి చేస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు గతంలో మాదిరిగా రాజకీయ ప్రత్యర్ధులు అన్నది కాకుండా వైసీపీ విషయంలో జిల్లా టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. దీంతో అన్ని విధాలుగా వైసీపీ దానితో పాటు సీనియర్ నేత బొత్స ఆయన వర్గం కూడా గట్టిగానే ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే బొత్స ఈ మాట అన్నారు అని అంటున్నారు. ఇక కాస్తా వెనక్కి వెళ్తే విజయనగరం జిల్లాలో ఇచ్చి పుచ్చుకునే వైఖరి అయితే రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉండేది. అశోక్ గజపతి రాజు టీడీపీ వైపు ఉన్నా కాంగ్రెస్ వైసీపీ నుంచి బొత్స ఉన్నా దూకుడుగా రాజకీయాలు చేసే వాతావరణం అప్పట్లో లేదని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే బొత్స తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ భవిష్యత్ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తాయా అన్న చర్చ అయితే సాగుతోంది.
